
ఒబామా రాకపై నిరసన
చెన్నై, సాక్షి ప్రతినిధి: దేశ రాజధాని ఢిల్లీలో ఈనెల 26న జరిగే రిపబ్లిక్ వేడుకలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హాజరుకావడాన్ని నిరసిస్తూ రాష్ట్రంలోని వామపక్షాలు నిరసనలకు సిద్ధమవుతున్నాయి. ఈనెల 24న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయాలని నిర్ణయించాయి. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జీ రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పాండియన్, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియూ (ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శి ఎస్ బాలసుందరం, ఎస్‌యూసీఐ(సీ) రాష్ట్ర కార్యదర్శి ఏ రంగస్వామి శనివారం మీడియాకు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. రిపబ్లిక్ దినోత్సవానికి విశిష్ట అతిథిగా హాజరుకావాలని, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను ప్రధాని మోదీ ఆహ్వానించడం, ఆయన రాక సందర్భంగా భారీ స్వాగత సన్నాహాలు చేయడం గర్హనీయమని అన్నారు. ఒబామా కేవలం అతిథిగా రావడం లేదని, భారత్‌కు అన్ని విధాల నష్టం చేకూర్చే అనేక ఒప్పందాలు చేసుకోబోతున్నారని వారు వ్యాఖ్యానించారు.
ముఖ్యంగా రక్షణశాఖకు సంబంధించి అమెరికా మాత్రమే ఏకఛత్రాధిపత్యం వహించేందుకు తన పర్యటనను సద్వినియోగం చేసుకుంటారన్నారు. రక్షణ, అంతరిక్ష పరిశోధనా రంగాల్లో అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు ప్రవేశింపజేస్తారని చెప్పారు. రాబోయే పదేళ్లలో అమెరికా-భారత్‌లు సంయుక్తంగా రక్షణశాఖను బలపరచడం, సైనిక శిక్షణ పొందే ప్రమాదం ఉందని వారన్నారు. ఎందరో త్యాగఫలాల ద్వారా ఆర్జించుకున్న స్వాతంత్య్రాన్ని గణతంత్ర దినోత్సవం రోజునే అమెరికాకు పణంగా పెట్టడం ఆవేదనకరమని వారు పేర్కొన్నారు. భారత్‌కు సహకరించాల్సిన అమెరికా అందుకు విరుద్ధంగా తనకు దాసోహం చేసుకునేందుకు పన్నాగం పన్నిందన్నారు. భారత్‌పై అమెరికా సాగించబోతున్న కుట్రలను ఎండగడుతూ ఈనెల 24న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ, చెన్నైలోని అమెరికా దౌత్య కార్యాలయం ముందు నిరసన, ఆందోళనా కార్యక్రమాలను నిర్వహించబోతున్నట్లు వారు తెలిపారు.