అడ్డం తిరిగిన కిడ్నాప్ కథ
Published Fri, Oct 7 2016 2:23 PM | Last Updated on Mon, Sep 4 2017 4:32 PM
ట్రేడ్ ఇండియా ఫర్ యూ పేరిట మోసం
కటకటాల్లోకి నిందితుడు
హుస్నాబాద్ : ట్రేడ్ యూనియన్ ఫర్‌యూ డాట్‌కమ్ పేరిట మోసాలకు పాల్పడడమే కాకుండా.. కిడ్నాప్ కథ అల్లిన ఓ సైబర్ నేరస్తున్ని కోహెడ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సదరు నిందితుడికి సంబంధించిన వివరాలను హుస్నాబాద్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ దాసరి భూమయ్య విలేకరులకు వెల్లడించారు. బెజ్జంకి మండలం మాదాపూర్‌కు చెందిన గూడూరు శ్రీనివాసాచారి కరీంనగర్‌లో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో ట్రేడ్ యూనియన్ ఫర్‌యూ డాట్ కమ్ పేరిట వెబ్‌సైట్ ప్రారంభించాడు. రూ.20వేలు డిపాజిట్ చేస్తే నెలకు రూ.వెయ్యి చొప్పున నెట్‌బ్యాంకింగ్ ద్వారా చెల్లిస్తానని నమ్మించాడు. ఇందుకు గొలుసుకట్టు విధానాన్ని ఎంచుకున్నాడు. ఇలా హుస్నాబాద్, కోహెడ, మెదక్ జిల్లా సిద్దిపేటలో కొందరిని ఏజెంట్లుగా పెట్టుకుని వారికి 20శాతం కమీషన్ ఇచ్చేవాడు. వారిద్వారా 50 మంది నుంచి దాదాపు రూ.కోటి వరకు వసూలు చేశాడు.
అడ్డం తిరిగిన కిడ్నాప్ కథ
డబ్బులు వసూలు చేసిన శ్రీనివాసాచారి రూ.వెయ్యి మాత్రం చెల్లించలేదు. దీంతో బాధితులు పలుమార్లు ఫోన్ చేసినా.. స్పందన లేదు. ఇటీవల కోహెడ మండలం పెద్దసముద్రాలకు రాగా.. బాధితులు నిలదీశారు. ఆ సమయంలో వారికి రూ. నాలుగు లక్షలు చెల్లించనున్నట్లు ప్రామిసరి నోట్ రాసిచ్చాడు. అక్కడి నుంచి తప్పించుకున్న శ్రీనివాసాచారి తనను కొందరు కిడ్నాప్ చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను అశ్రయించాడు. అతడి ఫిర్యాదుపై లోతుగా విచారణచేపట్టగా.. కిడ్నాప్ కథ ఒట్టిదేనని, అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడని గుర్తించారు. బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బును రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని సీఐ వివరించారు. నిందితుడిని పట్టుకున్న కోహెడ ఎస్సై తిరుపతి, సిబ్బందిని అభినందించారు. హుస్నాబాద్ ఎస్సైలు సంజయ్, పాపయ్యనాయక్ తదితరులున్నారు.
Advertisement
Advertisement