బీజేపీయే ప్రధాన ప్రత్యర్థి
విధానసభ ఎన్నికలపై డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్‌సింగ్ లవ్లీ
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)యే తమ ప్రధాన ప్రత్యర్థి అనే వాదనను ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) కొట్టిపారేసింది. త్వరలో జరగనున్న విధానసభ ఎన్నికల్లో తమ ప్రధాన ప్రత్యర్థి బీజేపీయేనని పేర్కొంది. తమ పార్టీకి ప్రజాదరణ బాగా పెరిగిందని, ఇటీవల తాము జరిపిన ఓ సర్వేలో ఈ విషయం తేటతెల్లమైందని డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్‌సింగ్ లవ్లీ స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయంలో సహచర నేతలతో కలసి మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడారు. తమ ఓటుబ్యాంకు పెరిగిందనే విషయం ఇటీవల తాము జరి పిన అధ్యయనంలో తేలిందన్నారు. ఈ విష యం త్వరలో జరగనున్న ఎన్నికల్లోనూ నిర్ధారణ అవుతుందన్నారు.
విధానసభ ఎన్నికల్లో తాము బీజేపీతోనే తలపడతామని ఆయన పునరుద్ఘాటించారు. ‘గత 11 నెల లుగా నగరంలో అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోయాయి. చలికాలం వచ్చేసిన్పటికీ నగరవాసులకు విద్యుత్ సరఫరాలో కోత కష్టాలు తప్పడం లేదు. వేలాదిమంది వృద్ధులు, వితంతువులు, అంగవికలురు పింఛన్ల కో సం కళ్లు కాయలు కాచేవిధంగా ఎదురుచూస్తున్నారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉం డగా ప్రారంభించిన రాజీవ్ ఆవాస్ యోజన కింద మురికివాడల్లో ఫ్లాట్ల నిర్మాణ పనులు కూడా జరగడం లేదు’ అని అన్నారు.
తాల్‌కటోరా స్టేడియంలో చాచా జయంతి
దివంగత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ 125వ జయంతి వేడుకలను నగరంలోని తాల్‌కటోరా స్టేడియంలో ఈ నెల 13వ తేదీన నిర్వహిస్తామని డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్‌సింగ్ లవ్లీ తెలిపారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ హాజరువుతారని, ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారని పేర్కొన్నారు.
ఇదిలాఉండగా వివిధ పార్టీలకు చెందిన కౌన్సిలర్లు, రాజకీయ నాయకులు డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్‌సింగ్ లవ్లీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నవారిలో మున్సిపల్ కౌన్సిలర్, పూర్వాంచల్ నాయకుడు సతేంద్ర రాణా, మరో మున్సిపల్ కౌన్సిలర్ రేఖా వశిష్ట్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ జీవన్‌లాల్, బీజేపీ నాయకుడు డాక్టర్ వీర్‌పాల్ తదితరులు ఉన్నారు.