
ప్రజల ఆదరణ మాకే!
మ్యానిఫెస్టో హామీలు నెరవేర్చాం
అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాం
అందుకే ప్రజలు మా ప్రభుత్వం రావాలని కోరుతున్నారు
అసెంబ్లీలో సీఎం జయ
విపక్షాల వాకౌట్
చెన్నై, సాక్షి ప్రతినిధి: అన్నాడీఎంకే ప్రభుత్వంపై ఎవరెన్ని వక్రభాష్యాలు చేసినా ప్రజలు మళ్లీ తమ ప్రభుత్వాన్నే కోరుతున్నారని ముఖ్యమంత్రి జయలలిత స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల ఆరంభంలో గవర్నర్ కే.రోశయ్య ప్రసంగానికి శనివారం నాటి అసెంబ్లీలో ధన్యవాదాలు తెలిపే తీర్మాన సమయంలో ఆమె సుదీర్ఘమైన ఉపన్యాసం చేశారు. ప్రజల కోసం నన్ను నేను అర్పించుకున్నాను, ఈ విషయం ప్రజలకు తెలుసని అన్నారు. గతంలో తన ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన అనేక పథకాలను డీఎంకే ప్రభుత్వం అటకెక్కించింది, రేపు అధికారంలోకి వస్తే అదేరీతిన వ్యవహరిస్తుందని ప్రజలు భయపడుతున్నారని ఆమె చెప్పారు.
ప్రజాశ్రేయస్సును విస్మరించి సొంత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చిందని విమర్శించారు. అయితే తమ నేతృత్వంలోని అన్ని ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడ్డాయని, 2011లో ప్రజలు మార్పును కోరి అన్నాడీఎంకేకు పట్టం కట్టారు, అధికారంలోకి వచ్చిన తరువాత అన్నాడీఎంకే ప్రజల కోసం పాటుపడి మన్నలను పొందిందని అన్నారు. అమ్మ పేరుతో ప్రవేశపెట్టిన అన్ని పథకాలు ప్రజాదరణ పొందాయన్నారు.
వరదల్లో నష్టపోయిన చిన్నవర్తకులను ఆదుకునేందుకు చేపట్టిన పథకం ద్వారా రెండు లక్షల మంది లబ్ధిపొందారని తెలిపారు. ఉన్నత విద్యలో దేశంలోనే ప్రథమస్థానంలో నిలవడంతోపాటు,పాఠశాల విద్యలో దేశంలోనే పేరు తెచ్చుకున్నామని చెప్పారు. శాంతి భద్రతల్లో రాష్ట్రం ఒక ప్రశాంతమైన ఉద్యానవనమనే భావన కలిగిస్తోందని చెప్పారు. 2010లో 1,715 హత్యలు జరగగా, 2015 నాటికి 1,642కు తగ్గించినట్టు వెల్లడించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల అదనంగా 32.50 లక్షల టన్నుల విద్యుత్ ఉత్పత్తినిసాధించామని, తద్వారా విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా తీర్చిద్దిన ఘనత అన్నాడీఎంకే ప్రభుత్వానిదేనని వివరించారు.
రూ.210 కోట్లతో 59,905 పాడిపశువులను పంపిణీ చేశామని, 1.80 కోట్ల మందికి కొత్తగా ఉద్యోగావకాశాలు కల్పించామని తెలిపారు. వరదలతో నష్టపోయిన అన్ని కుటుంబాలు తమ ప్రభుత్వం చేపట్టిన సహాయ కార్యక్రమాలతో తేరుకున్నాయని చెప్పారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న హామీలన్నీ నెరవేర్చామని, ఒక్కమాటలో చెప్పాలంటే అన్నాడీఎంకే ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని అన్నారు.
విపక్షాల వాకౌట్
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ సీఎం జయలలిత చేస్తున్న ప్రసంగానికి విపక్షాలు అడ్డుతగలాయి. పసలేని గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలా అంటూ విమర్శలు గుప్పించిన విపక్షాలు సమావేశం నుంచి వాకౌట్ చేశాయి.