
సంకటంలో పళని సర్కారు
► ఐటీ లేఖతో ఉత్కంఠ
► మంత్రుల మెడకు ఉచ్చు
► శేఖర్‌రెడ్డి డైరీలో అవినీతి భాగోతం
సాక్షి, చెన్నై: ఆదాయపన్ను శాఖ రూపంలో సీఎం పళనిస్వామి సర్కారు సంకటంలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంట్రాక్టర్ శేఖర్‌రెడ్డి ఇంట్లో లభించిన డైరీలోని గుట్టును బయట పెట్టే రీతిలో ఐటీ వర్గాలు దూకుడు పెంచడం చర్చకు దారితీసింది. ఈ వ్యవహారం మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల మెడకు చుట్టుకోవచ్చన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అమ్మ జయలలిత మరణం తదుపరి అన్నాడీఎంకేలో చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదే సమయంలో పళని ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా ఐటీ దాడులు హోరెత్తాయి.
పెద్ద నోట్ల రద్దు సమయంలో సాగిన దాడులు ఓ వైపు ఉం టే, తదుపరి చోటు చేసుకున్న పరిణామాలు, ఆర్కేనగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో సాగిన దాడులు మరోవైపు పళని ప్రభుత్వం నెత్తిన ఐటీ ఒత్తిడి పెరిగినట్టు అయింది. ఈ పరిస్థితుల్లో పెద్ద నోట్ల రద్దు సమయంలో పట్టుబడ్డ కాంట్రాక్టర్ శేఖర్‌రెడ్డి ఇంట్లో లభించిన డైరీ రూపంలో తాజాగా పళని ప్రభుత్వం సంకటంలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ సమయంలో తాను సీఎంగా లేనప్పటికీ, తాజాగా, అప్పటి భారాన్ని తాను మోయాల్సిన పరిస్థితి పళనికి తప్పడం లేదని చెప్పవచ్చు. అప్పటి దాడుల్లో పట్టుబడ్డ శేఖర్‌రెడ్డి డైరీలో ఉన్న కమీషన్లు, అవినీతి చిట్టాను గురి పెట్టి పళని ప్రభుత్వానికి ఐటీ లేఖ సంధించడం చర్చకు దారి తీసింది.
ఐటీతో సంకటం : టీనగర్‌లోని శేఖర్‌రెడ్డి ఇంట్లో సాగిన దాడుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సమయంలో అనేక కీలక ఆధారాలు, లెక్కలోకి రాని నగదు, డైరీలు ఐటీ వర్గాలకు చిక్కాయి. ఇందులో ఓ డైరీలో కాంట్రాక్టర్‌గా తాను పొందిన లబ్ధికి ప్రతిఫలంగా కమీషన్లు పొందిన వారి వివరాలు ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇందులో పలువురు మంత్రులు, అ«ధికారులు, ఎమ్మెల్యేల పేర్లుకూడా ఉన్న సమాచారం చర్చకు దారి తీసింది. శేఖర్‌రెడ్డి వ్యవహారం ఓ వైపు సీబీఐ, మరో వైపు ఈడీ, ఇంకో వైపు ఆదాయపన్ను శాఖల చేతిలో ఉన్నా, ఆ డైరీ రూపంలో సంకటం మాత్రం పళని ప్రభుత్వానికి తప్పదేమోనన్న ఉత్కంఠ బయలు దేరింది.
లేఖాస్త్రం ఉత్కంఠ : అన్నాడీఎంకేలోకి విలీనం అంటూ కొన్నాళ్లు సమయాన్ని సాగదీసిన మాజీ సీఎం పన్నీరు సెల్వం, శుక్రవారం తన రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టే సమయంలో చేసిన ప్రకటన కొత్త చర్చకు తెర లేపింది. త్వరలో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు అని ఆయన చేసిన వ్యాఖ్యలతో పళని శిబిరంలో కలవరం బయలు దేరింది. మెజారిటీ శాతం ఎమ్మెల్యేలు తన వెంట ఉండగా, రాష్ట్రపతి ఎన్నికల నిమిత్తం కేంద్రం తమ మద్దతు ఓట్ల కోసం ఎదురు చూస్తున్న సమయంలో పన్నీరు వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించక తప్పలేదు. ఆయన ఆ వ్యాఖ్యలు చేసిన మరుసటిరోజే పళని ప్రభుత్వం సంకట పరిస్థితుల్ని ఎదుర్కొనే విధంగా ఐటీ లేఖాస్త్రం సంధించి ఉండడం ఆ శిబిరంలో ఉత్కంఠ రేపింది.
ఆ డైరీలోని కమీషన్లు, అవినీతి చిట్టాలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఉండడం, ఏసీబీని రంగంలోకి దించే రీతిలో సూచనలు ఆ లేఖలో పేర్కొన బడి ఉండడంతో అస్సలు ఏమి జరగనుందోనన్న ప్రశ్న తప్పడం లేదు. రాష్ట్రంలో పర్యటించాల్సిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన రద్దు కావడం, తమిళనాడు ప్రభుత్వాన్ని తాము కూల్చబోమని స్పష్టం చేస్తూ, పరోక్షంగా అదే కుప్పకూలడం ఖాయం అన్నట్టుగా ప్రధాన ప్రతి పక్ష నేత, డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ వ్యాఖ్యలు సంధించిన నేపథ్యంలో ప్రస్తుతం ఆదాయపన్ను లేఖాస్త్రంతో పళనిస్వామి ప్రభుత్వ మనుగడ మీద దెబ్బ తీస్తుందా అన్న చర్చ ఊపందుకుని ఉండడం గమనార్హం. అయితే, ఈ లేఖాస్త్రం ఇదివరకు కమలం పెద్దల కనుసన్నల్లో సాగినట్లుగా ప్రచారంలో ఉన్న బెదిరింపుల పర్వంలో ఒకటిగా మిగులుతుందా లేదా రాష్ట్రపతి ఎన్నికల తదుపరి కొత్త ట్విస్ట్ దిశగా అడుగు పడుతుందా అన్నది వేచి చూడాల్సిందే.