ఒకే ఏడాదిలో సంజయ్‌దత్‌కు ఏకంగా మూడుసార్లు పెరోల్ మంజూరు కావడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. భార్య మాన్యతాదత్‌కు బాగాలేదంటూ ఇతడు పెరోల్ పొందగా, ఆమె సినిమా ప్రదర్శనకు హాజరైన ఫొటోలు శనివారం వార్తాపత్రికల్లో రావడంతో ఈ వివాదం మరింత తీవ్రరూపం దాల్చింది.
పుణే/ముంబై: బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌కు స్వల్ప వ్యవధిలోనే మరోసారి పెరోల్ రావడంపై రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేగుతోంది. సామాన్య ఖైదీలు దరఖాస్తు చేస్తే ఏవో కారణాలు చూపుతూ పెరోల్ తిరస్కరిస్తారని, సినీ, రాజకీయ ప్రముఖులను మాత్రం అడిగిందే తడవుగా విడుదల చేస్తున్నారని సామాజిక సంఘాల కార్యకర్తలు విమర్శించారు. 1993 పేలుళ్ల కేసులో దోషిగా తేలిన దత్ ప్రస్తుతం యెరవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. భార్య అనారోగ్యాన్ని కారణ ంగా చూపుతూ దత్ ఈ అక్టోబర్‌లోనూ నెల రోజులపాటు పెరోల్ పొందాడు. భార్య మాన్యతాదత్ ఆరోగ్యం బాగాలేనందున మరోసారి నెలపాటు పెరోల్ మంజూరు చేయాలని కోరుతూ దత్ చేసిన అభ్యర్థనపై పుణే డివిజనల్ కమిషనర్ ప్రభాకర్ దేశ్‌ముఖ్ సానుకూలంగా స్పందించి శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే మాన్యతాదత్ సినిమా ప్రదర్శనకు హాజరవుతూ ఉత్సాహంగా కనిపించిన ఫొటోలు పలు వార్తాపత్రికల్లో శనివారం ఉదయం దర్శనమిచ్చాయి. దీంతో దత్ దరఖాస్తుపై సందేహాలు వ్యక్తమయ్యాయి.
ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పలు సామాజిక సంఘాలు శనివారం ఆందోళనకు దిగాయి. ట్విటర్, ఫేస్‌బుక్ వంటి సామాజిక సంబంధాల సైట్లలోనూ ఈ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమయింది. ఈ వివాదంపై స్పందించిన రాష్ట్ర హోంమంత్రి ఆర్.ఆర్.పాటిల్ పెరోల్ మంజూరుపై విచారణకు ఆదేశించినట్టు ప్రకటించారు. ‘ఏయే కారణాలతో పెరోల్ మంజూరు చేశారో పరిశీలించడానికి వీలుగా సంబంధిత పత్రాలను కోరాం’ అని వివరణ ఇచ్చారు.
జైలు ఎదుట ఆర్పీఐ ఆందోళన
పుణే: దత్‌కు నెలరోజుల వ్యవధిలోనే మరోసారి పెరోల్ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) కార్యకర్తలు యెరవాడ జైలు ఎదుట శనివారం నిరసన తెలిపారు. నల్లజెండాలు, బ్యానర్లు ప్రదర్శిస్తూ దత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సినీనటుణ్ని కూడా సామాన్య ఖైదీ మాదిరిగానే పరిగణించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో జైలు వద్ద శుక్రవారం రాత్రి నుంచే భద్రతను కట్టుదిట్టం చేశామని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
ట్విటర్‌లో జనాగ్రహం
సామాజిక సంబంధాల సైట్ ట్విటర్‌లోనూ ఈ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం కనిపించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని ఎంతమాత్రమూ సమర్థించలేమని నెటిజనులు స్పష్టం చేశారు.
ఈ నేరగాడు (దత్) వచ్చే ఏడాది కూడా విడుదలైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ ఎంపీ, దత్ సోదరి ప్రియకు కృతజ్ఞతలు!! -మిత్రాజోషి, ముంబై
సిగ్గుచేటు! సంపన్నుడు, సినీనటుడు సంజయ్‌దత్‌కు మరోసారి హాలీడే ప్యాకేజీ (పెరోల్) వచ్చింది. వేలాది మంది అమాయకులు మాత్రం జైళ్లలో మగ్గుతూనే ఉంటారు.
-నందితా ఠాకూర్, ముంబై
ప్రతిసారీ ఈ పెరోల్ నాటకాలు ఆడే బదులు దత్ నుంచి ఒకేసారి రూ.100 కోట్లు తీసుకొని విడుదల చేస్తే బాగుంటుంది!!
-అజ్ఞాత వ్యక్తి
సంజయ్ దత్‌కు పెరోల్‌పై దుమారం
Published Sat, Dec 7 2013 11:15 PM | Last Updated on Sat, Sep 2 2017 1:22 AM
Advertisement
Advertisement