
ముందు మీ కర్మాగారాల బకాయిలు చెల్లించండి
బీజేపీ, జేడీఎస్ నేతలపై రాష్ట్ర చక్కెర శాఖ మంత్రి మహదేవ ప్రసాద్ విమర్శ
బెంగళూరు : చెరకు రైతుల ప్రయోజనాల కోసం ధర్నాలకు దిగుతామని ప్రకటిస్తున్న బీజేపీ, జేడీఎస్ నేతలు ముందుగా ఆయా పార్టీలకు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు చెందిన కర్మాగారాలు రైతులకు బాకీ ఉన్న మొత్తాన్ని చెల్లించాలని రాష్ట్ర చక్కెర శాఖ మంత్రి మహదేవ ప్రసాద్ సలహా ఇచ్చారు. శనివారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ...రాష్ట్రంలోని చెరకు రైతులకు రూ.2,500 మద్దతు ధరను అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. అయితే చక్కెర కర్మాగారాల పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ మొత్తాన్ని విడతల వారీగా చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. కోతకు సిద్ధంగా ఉన్న చెరకు పంట పొలంలోనే ఎండిపోతే రైతులు మరింతగా ఇబ్బంది పడతారని, అందువల్లే గతనెల 30 నుంచే చెరుకు క్రషింగ్‌ను ప్రారంభించామని గుర్తుచేశారు.
అయితే ఈ విషయాలేవి పట్టించుకోకుండా విపక్షాలు కేవలం తమ రాజకీయ ప్రయోజనాల కోసమే సువర్ణసౌధ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టాయని విమర్శించారు. బెళగావి, బీదర్, బిజాపుర వంటి ప్రాంతాల్లో చెరకు రైతులు ఎక్కువగా ఉన్నందున అక్కడ చెరకు రైతులకు మద్దతుగా ధర్నాలకు దిగితే రాజకీయంగా ఎక్కువ లబ్ధి పొందవచ్చనే భ్రమలో ఉన్నారని ధ్వజమెత్తారు. నిజంగా చెరకు రైతుల సంక్షేమాన్ని కోరితే కనుక ముందుగా తమ ఆధీనంలో ఉన్న చెక్కెర కర్మాగారాలకు చెరకు రైతుల బకాయిలు చెల్లించాల్సిందిగా బీజేపీ, జేడీఎస్ పార్టీలు తమ నాయకులను ఆదేశించాలని ఈ సందర్భంగా సూచించారు.