♦ ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ మాకెన్
♦ అకాల వర్షాలతో నష్టపోయిన ప్రాంతాలకు వెళ్లేందుకు సమయం లేదా?
♦ ఆప్‌ను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు
న్యూఢిల్లీ : అకాల వర్షాలతో రైతులు నష్టపోతే పట్టించుకోకుండా భూ సేకరణ బిల్లు విషయంలో చేపట్టడం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ ర్యాలీ రైతుల విషయంలో మొసలి కన్నీరు కారుస్తోందని అజయ్ మాకెన్ విమర్శించారు.అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సమయం లేదా అని ఆయన ప్రశ్నించారు. ఐదు కిలో మీటర్ల దూరంలోని రైతులను కలిసి సమస్యలు తెలుసుకోలేకపోయిన వారు, ఇప్పుడు ఆకస్మాత్తుగా మేల్కొని రైతుల తరఫున కేంద్రంతో పోరాడతామని చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
అకాల వర్షాల వల్ల రాష్ట్రంలోని ప్రజలకు తీవ్రంగా నష్టపోయారని మాకెన్ చెప్పారు. అయినా కూడా ఆప్ నుంచి ఒక్కరు కూడా రైతులను కలవడానికి గ్రామాలకు వెళ్లలేదని ఆరోపించారు. ఇప్పుడు రైతుల సంక్షేమమంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు. పొరుగున ఉన్న హరియానా, ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ సీఎంలు తమ రాష్ట్రాల్లోని బాధిత ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారని తెలిపారు.
ఆ రాష్ట్రాల సీఎంలు కేంద్రం నుంచి ఆర్థిక సాయాన్ని డిమాండ్ చేసినా కూడా సెక్రటేరియట్ నుంచి ఆప్ నేతలు ఒక్కరు కూడా బయటకు రాలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సహా తమ నేతలంతా గ్రామల్లో పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశామని తెలపారు. అంతే కాకుండా రైతులకు ఆర్థిక సాయం కోసం కేంద్రాన్ని డిమాండ్ చేశామని చెప్పారు. రైతులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పట్టించుకోని ఆప్, ఇప్పుడు ర్యాలీ చేపట్టడం వింతగా ఉందన్నారు.
ఆ పార్టీకి చెందిన వారు తమ ర్యాలీకి మద్దతు కోరేందుకు గ్రామాలకు వెళ్లాలనుకుంటే నిర్లక్ష్యం చేసినందుకు రైతులు రానివ్వరని చెప్పారు. రైతులకు ఆప్ గురించి పూర్తిగా అర్థమైందని, వారి తియ్యటి మాటలను నమ్మే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఆమ్ ఆద్మీ పార్టీ భూసేకరణ బిల్లుకి వ్యతిరేకంగా ఏప్రిల్ 22న జంతర్‌మంతర్ నుంచి పార్లమెంట్‌కు ర్యాలీ చేపట్టింది.
రైతుల విషయంలో ఆప్ మొసలి కన్నీరు కారుస్తోంది
Published Sat, Apr 4 2015 11:30 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement