ఆత్మహత్య చేసుకున్న రైతు బిడ్డలను చదివిస్తాం
- ఆమ్ ఆద్మీ పార్టీ మహారాష్ట్ర యూనిట్ స్పష్టం
- ‘సీడ్ ఫండ్’ పేరుతో సరికొత్త కార్యక్రమం
- 12వ తరగతి వరకు చదివిస్తామని వెల్లడి
ముంబై: రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల బిడ్డలకు చదువు చెప్పించాలని ఆమ్ ఆద్మీ పార్టీ మహారాష్ట్ర యూనిట్ నిర్ణయించింది. వారికి 12వ తరగతి వరకు చదువు చెప్పించడానికి ‘సీడ్ ఫండ్’ పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆప్ మహారాష్ట్ర యునిట్ ఆదివారం ప్రకటించింది. మరాట్వాడా, విదర్భ ప్రాంతాల్లో రైతులు, రైతు కూలీల కోసం ఏడురోజుల సామూహిక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించే ముందు ఈ ప్రకటన చేసింది. మే 24న ఛత్రపతి శివాజీ తల్లి జిజియాబాయి పుట్టిన ప్రాంతమైన జల్నాలోని సింద్‌ఖెడ్ రాజా ప్రాంతంలో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ‘ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రాష్ట్రంలో 622 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వారి పిల్లలు మెరుగైన జీవితానికి సరైన అవకాశాలు కల్పించాలి. ప్రస్తుతం మాకు అధికారం లేదు.
కాబట్టి రైతులకు, రైతు కుటుంబాలకు సహాయం చేసేందుకు ఉత్తమమైన మార్గాలను ఆలోచించాం. ఆత్మహత్య చేసుకున్న రైతు బిడ్డలను 12వ తరగ తి వరకు చదివించాలని నిర్ణయించాం.’ అని ఆప్ స్టేట్ యునిట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు రవి శ్రీవాత్సవ్ తెలిపారు. ఈ కార్యక్రమం కోసం నిధుల సేకరణ ప్రారంభమైందని, ఇందుకోసం ప్రజల సహాయాన్ని కూడా కోరతామని రవి తెలిపారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తీరే ్చ సరైన మార్గాల అన్వేషణకు ఆప్ కార్యకర్తలు ప్రణాళికలు రూపొందిస్తున్నారని ఆయన అన్నారు. వ్యవసాయ సంక్షోభం, రైతు ఆత్మహత్యలను నివారించడానికి ఇతర ఆదాయ వనరులను అన్వేషిస్తున్నారన్నారు.