ఓ నాన్నా.. ఇటు చూడూ.. | Education needs to poor students in villages | Sakshi
Sakshi News home page

ఓ నాన్నా.. ఇటు చూడూ..

Published Mon, Jul 3 2017 1:20 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

ఓ నాన్నా.. ఇటు చూడూ.. - Sakshi

ఓ నాన్నా.. ఇటు చూడూ..

చెమట చుక్క చిందిస్తే..
అప్పుల పంటే మొలిచింది..
నాగలి వెనక నడిస్తే..
కన్నీళ్ల చేనే పండింది..
సాగే జూదమైంది.. బతుకే భారమైంది..
తెల్లారేసరికే..
ఆ రైతు జీవితం ఉరితాడుకు వేలాడింది! కానీ..
ఓ నాన్నా.. ఇటు చూడు
నీ చావుతో అప్పులు తీరలేదు..
అసలు, మిత్తి కలసి అమ్మను ప్రశ్నిస్తున్నాయి..
చదువుల కల చెదిరిపోయింది..
చేతిలో పుస్తకం జారిపోయింది..
ఇప్పుడు... తమ్ముడూ నేనూ
కూలి బడిలో కష్టాల ఓనమాలు దిద్దుతున్నాం!!


రైతన్న ఆత్మహత్యలతో దిక్కులేని పక్షులవుతున్న బిడ్డలు
మధ్యలోనే ఆగుతున్న చదువులు.. కూలి బాట పడుతున్న బాల్యం
ఆదరించేవారు లేక.. ఆలనాపాలనా లేక దుర్భర పరిస్థితులు
పోషణ భారమై రోడ్డున పడుతున్న కుటుంబాలు.. తల్లితో కలసి పనులకు కొందరు..
అప్పుల భారంతో పట్నానికి వెళ్తున్నవారు ఇంకొందరు.. కానరాని సర్కారు సాయం


సాక్షి నెట్‌వర్క్‌: తెలంగాణలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలు గోడుగోడున విలపిస్తున్నాయి. పెద్దదిక్కును కోల్పోవడంతో వారి ఇళ్లల్లో బాల్యాన్ని సంక్షోభం చుట్టుముడుతోంది. నాన్న వేలు పట్టుకుని బడికెళ్లాల్సిన పిల్లలు.. భారంగా పనికి కదులుతున్నారు. ఆదరించేవారు లేక.. ఆలనాపాలనకు నోచుకోలేక చదువులకు దూరమవుతున్నారు. అప్పులు భారం మోయలేకనో.. కాలం కలసిరాకనో క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్న రైతన్నలు తమ కుటుంబాలను మరిన్ని కష్టాల్లోకి నెట్టి వెళ్లిపోతున్నారు. దీంతో తమ పిల్లల్ని పెద్ద చదువులు చదివించేందుకు అప్పటిదాకా వారు పడ్డ కష్టమంతా వృథా అవుతోంది.

చదువుల కల చెదిరిపోవడమే కాదు.. అప్పుల భారం మీద పడటంతో భార్యాపిల్లలు రోడ్డున పడుతున్నారు. పెద్దదిక్కును కోల్పోయి సాయం కోసం దిక్కులు చూస్తున్నారు. తండ్రి మరణంతో అర్ధంతరంగా చదువులు మాని కూలి పనులకు వెళ్తున్నవారు కొందరైతే.. చిన్న వయసులోనే అప్పుల భారం భుజానికెత్తుకొని పట్నం బాటపడుతున్నవారు మరికొందరు! ఇక కొన్ని కుటుంబాల్లో.. పిల్లల్ని పస్తులు ఉంచలేక మధ్యాహ్న భోజనమైనా దొరుకుతుందన్న ఆశతో బడికి పంపుతున్న దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఆత్మహత్య చేసుకున్న దాదాపు 50 రైతు కుటుంబాలను ‘సాక్షి’పరిశీలించగా.. హృదయాలను కదిలించే కన్నీటి వెతలెన్నో కనిపించాయి.
 
వసివాడుతున్న పసిడి బాల్యం
‘సాక్షి’పరిశీలించిన దాదాపు 50 కుటుంబాల్లో 40 వరకు రైతు కుటుంబాల్లోని పిల్లలంతా 15 ఏళ్ల లోపువారే. ఎదిగే వయసులో తండ్రి లేకపోవడం.. చదువులు ఆగిపోవడం.. ఒక్కసారిగా కష్టాలు చుట్టుముట్టడం.. అనుకోని బాధ్యతలు పైనపడటంతో ఈ పసి పిల్లలు కుంగుబాటుకు గురవుతున్నారు. అప్పులోళ్లు ఇప్పటికీ వచ్చి ఒత్తిడి చేస్తుండటం, తండ్రి చేసిన బాకీ తీర్చాలంటూ ఇంటికొచ్చి దురుసుగా ప్రవర్తిస్తుండటం వంటి ఘటనలు వీరిపై పెను ప్రభావం చూపిస్తున్నాయి.

తల్లి పడే కష్టం చూడలేక చాలామంది దొరికిన పనులకు వెళ్తున్నారు. చేతికొచ్చిన పనులు చేస్తున్నారు. వికారాబాద్‌ జిల్లా హకీంపేటకు చెందిన శ్రీనివాస్‌.. తండ్రి చనిపోయే నాటికి టెన్త్‌ చదువుతున్నాడు. తండ్రి మరణంతో పూట గడవని స్థితిలో చదువు ఆపేసి ఇప్పుడు శ్రీనివాస్‌ వ్యవసాయ కూలీగా మారిపోయాడు. ఇదే జిల్లా పోలేపల్లికి చెందిన ఈశ్వర్‌.. తండ్రి ఆత్మహత్యతో 9వ తరగతితోనే మానేసి కొన్నాళ్లు హైదరాబాద్‌లో హోటల్‌ బాయ్‌గా పనిచేసి కొన్ని అప్పులు తీర్చాడు. ప్రస్తుతం సెంట్రింగ్‌ కూలీగా పని చేస్తున్నాడు.

తల తాకట్టు పెట్టి..
భర్త తనువు చాలించినా కుటుంబ పోషణను భుజానకెత్తుకున్న భార్యలు తమ పిల్లల్ని ఎన్నో కష్టాలకోర్చి చదివిస్తున్న ఉదంతాలూ ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా చౌదర్‌పల్లికి చెందిన లలితమ్మ.. భర్త ఆత్మహత్యానంతరం తమకున్న నాలుగెకరాలతోపాటు మరో నాలుగెకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తోంది. కూలి పనులకూ వెళ్తోంది. ఇలా వచ్చిన ఆదాయంతో తన ముగ్గురు పిల్లల్ని చదివిస్తోంది. పెద్ద కొడుకు మహేశ్‌ (21) డిగ్రీ, కుమార్తె మంజుల (19) ఇంటర్, రెండో కొడుకు నరేశ్‌ (17) టెన్త్‌ పూర్తి చేశారు. వీరు కష్టాల పాలు కావొద్దనే ఉన్నత చదువులు చదివించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు లలితమ్మ చెప్పింది.

ఆదిలాబాద్‌ జిల్లా కొలాంగూడకు చెందిన జంగుబాయి కూలీ పనులకు వెళ్తూ పిల్లల్ని చదివిస్తోంది. ఆమె భర్త మడావి అయ్యు (40) గత ఫిబ్రవరి 26న ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక్కసారిగా కుటుంబ పరిస్థితులు తల్లకిందులయ్యాయి. దీంతో జంగుబాయి వ్యవసాయ కూలీగా రోజూ రూ.120 సంపాదిస్తూ.. డిగ్రీ చదువుతున్న రెండో కుమార్తె రవాణా ఖర్చులకు రూ.30, ఆరో తరగతి చదువుతున్న కొడుకు ఆటో ఖర్చు కోసం రూ.20 ఖర్చు చేస్తోంది. మిగతా పిల్లల్ని హాస్టల్‌లో ఉంచింది.

ఈ చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో..
ఈ చిత్రంలో భర్త ఫొటో పట్టుకొని ఉన్న మహిళ పేరు సురేఖ. ఆమె భర్త దేవా (కొమురం భీం జిల్లా కైరిగూడ) పత్తి పంట కోసం రూ.3 లక్షల దాకా అప్పు చేశాడు. పంట చేతికందలేదు. మరోపక్క పెళ్లీడుకొచ్చిన కూతురు. దిక్కుతోచక 2011లో ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మరణానంతరం సురేఖ భూమి అమ్మి బిడ్డ పెళ్లి చేసింది. అప్పటికి కొడుకు నరేశ్‌ రెండో తరగతి చదువుతున్నాడు.

కుటుంబ పోషణ భారం కావడంతో బాధను దిగమింగుకుని కొడుకు చదువు మాన్పించింది. ఇద్దరూ కలిసి కూలి పనులకు వెళ్తున్నారు. ఇప్పుడు నరేశ్‌ వయసు 16. పిల్లలకు మంచి చదువులు చెప్పించాలనుకున్నాం కానీ పెనిమిటి మరణంతో అవన్నీ కల్లలయ్యాయని ఉబికివస్తున్న కన్నీళ్లతో చెప్పింది సురేఖ.

ఇసుమంతైనా సాయం లేదు!
ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రభుత్వపరంగా సాయం అందుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ఘటన జరిగిన రోజు అధికారులు, నేతలు వచ్చి ఇస్తున్న హామీలేవీ నెరవేరడం లేదు. వికారాబాద్‌ జిల్లా నంద్యానాయక్‌ తండాకు చెందిన రాథోడ్‌ ధన్‌సింగ్‌ నాలుగెకరాల రైతు. కాలం కలిసిరాక మూడెకరాలు అమ్మి కొన్ని అప్పులు తీర్చాడు. మిగతా ఎకరంలో బోరు వేయిస్తే చుక్క నీరు పడలేదు. భార్య, ఏడుగురు పిల్లలను పోషించడానికి అందినచోటల్లా అప్పులు చేశాడు.

రుణదాతల ఒత్తిడి భరించలేక గతేడాది ఏప్రిల్‌ 5న ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు అతని భార్య తుల్జీబాయి, ఏడుగురు పిల్లలకు మిగిలింది.. వంటింట్లో రెండు పాత్రలు, చినిగిన రెండు జతల బట్టలు.. ఇవే! ధన్‌సింగ్‌ ఆత్మహత్య చేసుకున్నప్పుడు చూడ్డానికి వచ్చిన అధికారులు పిల్లల్ని హాస్టల్‌లో చేర్పిస్తామన్నారు. తర్వాత ఆ ఊసే లేదు. ఏడుగురు పిల్లల ఆకలి తీర్చలేక.. ఇంట్లో గ్లాసుడు బియ్యమూ లేక పస్తులుంటున్నట్టు ఆ తల్లి చెబుతోంది. ఇక పిల్లల చదువుల గురించి చెప్పేదేముంటుంది?

సదుకుంటే ఎట్ల గడుస్తది సారూ..
ఎండిన పంట పొలంలోనే నా భర్త పురుగుల మందు తాగిండు. నేనూ అప్పుడే సద్దామనుకున్నా.. కానీ పిల్లల ఆగమైతరని బతికున్న. భర్త చనిపోంగానే కొడుకు చదువు మాన్పించిన. నాతోనే కూలికి తోల్కపోతున్న. వాడు సదువుకుంటనంటున్నడు. నాకూ కొడుకును మంచిగ సదివించాలని ఉంది గానీ అప్పులోళ్లు ఇప్పటికీ ఇంటికి తిరుగుతూనే ఉన్నారు. ఆడు సదుకుంటే మా కుటుంబం ఎట్ల గడుస్తది సారూ..!
– మీరి, తిమ్మక్కపల్లి తండా, మెదక్‌ జిల్లా

చదవాలని ఉంది..

పత్తి పంట నష్టాలను మిగల్చడంతో మా నాన్న గతేడాది జూన్‌ 1న ఆత్మహత్య చేసుకున్నడు. నన్ను బాగా చదివించాలని తపన పడేవాడు. పాలిటెక్నిక్‌ వరకు చదివిన నేను తండ్రి మరణంతో తప్పనిసరి పరిస్థితుల్లో వ్యవసాయంలోకి దిగిన. ప్రభుత్వం సాయం చేస్తే ఉన్నత చదువులు చదవాలని ఉంది. నేను చదువుకు దూరమైనా తమ్ముడిని టెన్త్, చెల్లిని 7వ తరగతి చదివిస్తున్నా.

మధ్యాహ్న భోజనమే దిక్కు..
ఎకరంన్నర సాగు కోసం నా పెనిమిటి మల్లేశం రూ.3 లక్షల వరకు అప్పు చేశాడు. ఏడు బోర్లూ వట్టిపోయినయ్‌. వరి ఎండిపోయింది. పొలంలోనే పురుగుల మందు తాగిండు. పిల్లలు ఎక్కడ ఆగమైతరోనని నేను బతికున్న. పెద్ద బిడ్డ 9, చిన్న బిడ్డ 6 చదువుతుండ్రు. బుడ్డోడిని అంగన్‌వాడ్కి పంపుతున్న. స్కూల్ల పెట్టే మధ్యాహ్న భోజనంతో పిల్లలకు ఒక పూట గడిచిపోతోంది. రెండో పూట కడుపు నింపుకోవడాన్కి కష్టపడుతున్నం.
– మొగుళ్ల లక్ష్మి, మిరుదొడ్డి, సిద్దిపేట జిల్లా

నాన్నే ఉంటే.. సదివించేటోడు!
మిర్చి పంటలో నష్టం రావడంతో మా నాన్న గతేడాది ఏప్రిల్‌లో పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అమ్మ కూలి చేసి మా ముగ్గుర్ని సాకుతోంది. టెన్త్‌లో పాసైన. అమ్మ.. ఇక చదివించలేనంటే చదువు మానేశా. మా నాన్నే ఉంటే బాగా చదివించేవాడు.
– తేజావత్‌ శ్రావణి, ఊటవాగు తండా, ఖమ్మం జిల్లా

పెద్దోడు డిగ్రీ.. చిన్నోడు ఇంటర్‌తో ఆగిపోయారు..
మూడేళ్ల క్రితం నా భర్త వెల్మల్‌ మారుతి ఆత్మహత్య చేసుకున్నాడు. బీడీలు చుడుతూ ముగ్గురు పిల్లలతో కుటుంబాన్ని నెట్టుకురావడం సాధ్యం కావడం లేదు. అందుకే పెద్దోడు సందీప్‌ను డిగ్రీ వరకు చదివించి ఆపేశాను. రెండో వాడు ఇంటర్‌తో ఆగిపోయాడు. చిన్నబ్బాయి నవీన్‌ ఇంటర్‌లో చేరాడు. ప్రభుత్వ కాలేజీలో సీటు వస్తే సరి.. ప్రైవేటుగా చదివించే స్థోమత లేదు. తిననీకే సంపాదన చాలడం లేదు. ఇక చదువెలా చెప్పించేది?
– వెల్మల్‌ సావిత్రి, జానకంపేట, నిజామాబాద్‌ జిల్లా

పిల్లల్ని మంచిగ చదివిద్దామన్నడు..
నా భర్త చిలువేరి మొండయ్య (40) పంటకు చేసిన అప్పులు తీర్చలేక ప్రాణాలు తీసుకున్నడు. ఇప్పుడే పొలానికి వెళ్లి వస్తానని గుళికలు మింగాడు. మేం రోడ్డున పడ్డాం. బతికున్న రోజుల్లో.. ఇద్దరు ఆడపిల్లల్ని బాగా చదివిద్దామని, మంచి ఉద్యోగాలు చేయిద్దామని అనేవాడు. మనిషి లేకపోయినా, ఆయన మాట నిలిపేందుకు కూలి చేసి బిడ్డల్ని చదివిస్తున్నా. సర్కారు నుంచి చిల్లిగవ్వ అందలేదు.
– మంజుల, రాఘవపట్నం, జగిత్యాల జిల్లా

సదువుకుంటే ఎట్ల గడుస్తది సారూ..
ఎండిన పొలంలోనే నా భర్త పురుగుల మందు తాగిండు. నేనూ అప్పుడే సద్దామనుకున్నా.. కానీ పిల్లలు ఆగమైతరని బతికున్న. భర్త చనిపోంగనే కొడుకు చదువు మాన్పించిన. నాతోనే కూలీకి తోల్కపోతున్న. వాడు సదువుకుంట నంటున్నడు. నాకూ కొడుకును మంచిగ సదివించాలని ఉంది గానీ అప్పులోళ్లు ఇప్పటికీ ఇంటికి తిరుగుతూనే ఉన్నారు. ఆడు సదువుకుంటే కుటుంబం ఎట్ల గడుస్తది సారూ!
– మీరి, తిమ్మక్కపల్లి తండా, మెదక్‌ జిల్లా

చదవాలని ఉంది..
పత్తి పంట నష్టాలను మిగల్చడంతో మా నాన్న గతేడాది ఆత్మహత్య చేసుకున్నడు. పాలిటెక్నిక్‌ వరకు చదివిన నేను నాన్న మరణంతో తప్పనిసరి పరిస్థితుల్లో వ్యవసాయంలోకి దిగిన. ప్రభుత్వం సాయం చేస్తే ఉన్నత చదువులు చదువుతా. తమ్ముడిని టెన్త్, చెల్లిని 7వ తరగతి చదివిస్తున్నా.
– రాజశేఖర్, డాకూరు, సంగారెడ్డి జిల్లా

చదువు మానేసి.. ట్రాక్టర్‌పై పనికి..
ఈ చిత్రంలో కనిపిస్తున్నవారు మంచిర్యాల జిల్లా మన్నెగూడెంకు చెందిన బట్టు రాజయ్య భార్యాపిల్లలు. రాజయ్య ఎనిమిదెకరాల రైతు. ఆయన ఉన్నన్ని రోజులు తన నలుగురు పిల్లల్ని మంచి చదువులు చదివించాడు. బాగా చదువుకుని జీవితంలో స్థిరపడాలని పిల్లలకు చెప్పేవాడు. వరుస పంట నష్టాలు అప్పులను మిగల్చడంతో వాటిని తీర్చే దారిలేక 2015 అక్టోబర్‌ 13న రాజయ్య ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ పోషణకు ఆయన భార్య మారక్క.. స్థానిక పాఠశాలలో వంటమనిషిగా చేరింది.

పెద్ద కొడుకు సంతోశ్‌ (19) 9వ తరగతి, రెండో కొడుకు సమ్మయ్య(16) 8వ తరగతి వరకు చదివి మానేశారు. తల్లి కష్టం చూడలేక ట్రాక్టర్‌పై పనికి కుదిరారు. వీరంతా కలసి మూడో కొడుకు సురేశ్‌(14)ను చదివించాలనుకున్నా.. అదీ సాధ్యం కాక అతడిని కూడా కూలి పనులకు పంపుతున్నారు. అతికష్టమ్మీద చిన్న కొడుకు పున్నంను మంచిర్యాలలోని ఏకలవ్య ఆశ్రమంలో చేర్చారు. బతికుండగా తన పిల్లల గురించి రాజయ్య ఏం కలలుగన్నాడో కానీ.. ఆ పిల్లలు మాత్రం ఇప్పుడు కూలీలుగా మిగిలిపోయారు. చాలా వరకు రైతు కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement