Seed Fund
-
స్టార్టప్‌లకు రైల్వే నిధుల మద్దతు
న్యూఢిల్లీ: స్టార్టప్‌లకు ఏటా రూ.50 కోట్ల నిధులు అందించనున్నట్టు రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ ప్రకటించారు. మరే ఇతర భాగస్వామ్యాల మాదిరిగా ఇది ఉండదని స్పష్టం చేస్తూ.. మేథో సంపత్తి హక్కులు ఆయా ఆవిష్కరణదారులకే (స్టార్టప్ సంస్థలకు) ఉంటాయని స్పష్టం చేశారు. ఇండియన్ రైల్వే ఆవిష్కరణల విధానం కింద.. రైల్వే శాఖ స్టార్టప్‌ల్లో పెట్టుబడులు పెడుతుందని, దీని ద్వారా వినూత్నమైన సాంకేతిక ఆవిష్కరణలను వారి నుంచి నేరుగా పొందొచ్చని మంత్రి తెలిపారు. వినూత్నమైన సాంకేతిక పరిష్కారాలకు రూ.1.5 కోట్లను సీడ్ ఫండ్‌గా అందించనున్నట్టు చెప్పారు. నిధుల మద్దతును రెట్టింపు చేస్తామని, విజయవంతంగా అభివృద్ధి చేసిన ఉత్పత్తి లేదా టెక్నాలజీని అమల్లో పెడతామని వివరించారు. ఆవిష్కర్తలు, రైల్వే 50:50 నిష్పత్తిలో వ్యయాలు భరించేలా ఈ పథకం ఉంటుందన్నారు. స్టార్టప్ ల ఆవిష్కరణ, అభివృద్ధి దశలో రైల్వే ఫీల్డ్ ఆఫీసర్లు, ఆర్డీఎస్వో, జోనల్, రైల్వే బోర్డు అధికారుల నుంచి ఎప్పటికప్పుడు సహకారం అందుతుందని వైష్ణవ్ తెలిపారు. పారదర్శక విధానంలో స్టార్టప్‌ల ఎంపిక ఉంటుందని, ఇందు కోసం ప్రత్యేకంగా ఇన్నోవేషన్ ఇండియన్ రైల్వేస్ పేరిట పోర్టల్‌ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. -
టి హబ్‌కు స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఆవిష్కరణల వాతావరణానికి దిక్సూచిగా ఉన్న ‘టి హబ్’కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్’ పథకానికి ఎంపికైంది. కేంద్ర పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) ఈ పథకం కింద అర్హత కలిగిన స్టార్టప్‌లకు రూ.5 కోట్లు విడుదల చేస్తుంది. ప్రాథమిక స్థాయిలో ఉన్న స్టార్టప్‌ల ఆవిష్కరణలకు ఊతమిచ్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రపంచ స్థాయిలో స్టార్టప్‌లు రాణించేలా వాటికి అవసరమైన అన్ని వసతులు సమకూర్చడంపైనే తాము ప్రధానంగా దృష్టి పెడుతున్నట్టు టి హబ్ సీఈవో మహంకాళి శ్రీనివాస్‌రావు ‘సాక్షి’కి వెల్లడించారు. (క్లిక్: 2 గంటల్లో వంట గ్యాస్ సిలిండర్ డెలివరీ.. నిమిషం ఆలస్యమైనా..) స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్‌కు అర్హత కలిగిన స్టార్టప్‌లను ఎంపిక చేసేందుకు ఇంక్యుబేటర్ సీడ్ మేనేజ్మెంట్ కమిటీ (ఐఎస్ఎంసీ)ని ఏర్పాటు చేస్తున్నట్టు టి హబ్ ప్రకటించింది. రిచ్ డైరక్టర్ జనరల్ అజిత్ రంగ్నేకర్, ఫ్రెష్‌వర్క్స్ కో ఫౌండర్ కిరణ్ దరిసి, మైగేట్ వ్యవస్థాపక బృందం సభ్యుడు వింగ్ కమాండర్ ఆంథోని అనిష్‌తో పాటు పలువురు పెట్టుబడిదారులు, ఎంట్రప్రెన్యూర్లు, విద్యావేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులు ఐఎస్ఎంసీలో సభ్యులుగా ఉంటారు. మూడేళ్ల వ్యవధిలో 15 స్టార్టప్‌లకు ఈ పథకం ద్వారా టి హబ్ నిధులు అందజేస్తుంది. ఆసక్తి ఉన్న స్టార్టప్‌లు సీడ్‌ఫండ్ స్టార్టప్ ఇండియా వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని టి హబ్ సీఈవో సూచించారు. (క్లిక్: పాస్‌పోర్టు అపాయింట్మెంట్ల కుదింపు) -
ఐఐటీ హైదరాబాద్..స్టార్టప్‌ల కోసం స్పెషల్ ఫండ్
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ కీర్తి కిరీటంలో మరో ఘనత వచ్చి చేరింది. కేంద్రం అందించే స్టార్టప్ సీడ్ ఫండ్‌కి ఈ కాలేజీ ఎంపికైంది. దీంతో ఇక్కడ నూతన ఆవిష్కరణలకు మరింత ఊతం లభించనుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ సంస్థ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పేరుతో నూతన ఆవిష్కరణలకు ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ సంస్థకు చెందిన అడ్వైజరీ కమిటీ ఐఐటీ, హైదరాబాద్‌కి స్టార్టప్ ఫండ్ కింద రూ. 5 కోట్లు మంజూరు చేసేందుకు అంగీకారం తెలిపింది. గత పదమూడేళ్లుగా ఐఐటీ హైదరాబాద్ సాధించిన పురోగతి ఆధారంగా ఈ నిధులు మంజూరు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఎన్ఎల్పీ, రొబోటిక్స్, వర్చువల్ రియాలిటీ, ఆగ్యెమెంటెడ్ రియాలిటీ, బ్లాక్ చెయిన్ తదితర టెక్నాలజీ మీద అభివృద్ధి చేస్తున్న కాన్సెప్టులు, స్టార్టప్‌లకు సాయం అందివ్వనున్నారు. రాబోయే మూడేళ్లల కాలంలో కనీసం 10 నుంచి 15 వరకు స్టార్టప్‌లు ఐఐఐటీ హైదరాబాద్ నుంచి వస్తాయని అంచనా. -
రూ.1,000 కోట్లతో స్టార్టప్ సీడ్ ఫండ్
న్యూఢిల్లీ: వినూత్నమైన ఆలోచనలతో ముందుకు వచ్చే స్టార్టప్‌లకు వెన్నుదన్నుగా నిలిచేందుకు కేంద్రం మరో విడత ప్రత్యేక నిధిని ప్రకటించింది. రూ.1,000 కోట్లతో ‘స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్’ను ఏర్పాటు చేస్తున్నట్టు.. ప్రధాని నరేంద్ర మోదీ ‘స్టార్టప్ ఇండియా అంతర్జాతీయ సదస్సు’ ప్రారంభం సందర్భంగా వెల్లడించారు. 2016లో మోదీ సర్కారు స్టార్టప్ ఇండియా అంతర్జాతీయ సదస్సును ఆరంభించగా.. ఇది ఈ ఏడాదితో ఐదో వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుంది. స్టార్టప్‌ల వృద్ధితో ఎన్నో ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని, ప్రజల జీవితాల ఉన్నతికి తోడ్పడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ‘‘స్టార్టప్‌లకు నిధులు అందించేందుకు రూ.1,000 కోట్లతో స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నాము. ఇది నూతన స్టార్టప్‌ల ఏర్పాటుకు, వాటి వృద్ధికి సాయపడుతుంది’’ అని మోదీ ప్రకటించారు. ఈ ఫండ్ ఆఫ్ ఫండ్ పథకాన్ని స్టార్టప్‌లకు మూలధన నిధులు అందించేందుకు వినియోగించనున్నట్టు చెప్పారు. ఇకపై స్టార్టప్‌ల రుణ సమీకరణకూ మద్దతు ఉంటుందని ప్రకటించారు. భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ (సదుపాయాలు)గా ఉందని తెలియజేస్తూ.. వినూత్నమైన టెక్నాలజీలు, ఆలోచనల తో వచ్చి, పెద్ద సంస్థలుగా అవతరించేందుకు ఇది తోడ్పడుతుందని చెప్పారు. -
ఆత్మహత్య చేసుకున్న రైతు బిడ్డలను చదివిస్తాం
- ఆమ్ ఆద్మీ పార్టీ మహారాష్ట్ర యూనిట్ స్పష్టం - ‘సీడ్ ఫండ్’ పేరుతో సరికొత్త కార్యక్రమం - 12వ తరగతి వరకు చదివిస్తామని వెల్లడి ముంబై: రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల బిడ్డలకు చదువు చెప్పించాలని ఆమ్ ఆద్మీ పార్టీ మహారాష్ట్ర యూనిట్ నిర్ణయించింది. వారికి 12వ తరగతి వరకు చదువు చెప్పించడానికి ‘సీడ్ ఫండ్’ పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆప్ మహారాష్ట్ర యునిట్ ఆదివారం ప్రకటించింది. మరాట్వాడా, విదర్భ ప్రాంతాల్లో రైతులు, రైతు కూలీల కోసం ఏడురోజుల సామూహిక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించే ముందు ఈ ప్రకటన చేసింది. మే 24న ఛత్రపతి శివాజీ తల్లి జిజియాబాయి పుట్టిన ప్రాంతమైన జల్నాలోని సింద్ఖెడ్ రాజా ప్రాంతంలో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ‘ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రాష్ట్రంలో 622 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వారి పిల్లలు మెరుగైన జీవితానికి సరైన అవకాశాలు కల్పించాలి. ప్రస్తుతం మాకు అధికారం లేదు. కాబట్టి రైతులకు, రైతు కుటుంబాలకు సహాయం చేసేందుకు ఉత్తమమైన మార్గాలను ఆలోచించాం. ఆత్మహత్య చేసుకున్న రైతు బిడ్డలను 12వ తరగ తి వరకు చదివించాలని నిర్ణయించాం.’ అని ఆప్ స్టేట్ యునిట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు రవి శ్రీవాత్సవ్ తెలిపారు. ఈ కార్యక్రమం కోసం నిధుల సేకరణ ప్రారంభమైందని, ఇందుకోసం ప్రజల సహాయాన్ని కూడా కోరతామని రవి తెలిపారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తీరే ్చ సరైన మార్గాల అన్వేషణకు ఆప్ కార్యకర్తలు ప్రణాళికలు రూపొందిస్తున్నారని ఆయన అన్నారు. వ్యవసాయ సంక్షోభం, రైతు ఆత్మహత్యలను నివారించడానికి ఇతర ఆదాయ వనరులను అన్వేషిస్తున్నారన్నారు.