
చెన్నై : తమిళన హీరో కార్తి నటించి ‘ధీరన్’ చిత్రంపై స్టే విధించాలని కోరుతూ మధురై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మధురైకు చెందిన పసుంపొన్ నిన్న ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల విడుదలై ప్రదర్శింపబడుతున్న ధీరన్ చిత్రంలో కథానాయకునిగా కార్తి నటించారని, ఇందులో ఒక సామాజిక వర్గాన్ని కించపరిచేలా చిత్రీకరించారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఓ సామాజిక వర్గాన్ని అవమానపరిచేలా ఉన్నందున ఆ చిత్రంపై స్టే విధించాలని కోరారు.
ఈ పిటిషన్ గురువారం న్యాయమూర్తి మహాదేవన్ సమక్షంలో విచారణకు వచ్చింది. ఆ సమయంలో ధీరన్ చిత్రం గురించి పిటిషనర్ మాట్లాడుతూ తన ఆరోపణలపై పరిశీలన జరిపేందుకు ఇద్దరు న్యాయవాదులతో కూడిన కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ న్యాయవాదులు సినిమా చూసేందుకు ప్రత్యేక ప్రదర్శనకు ఏర్పాటు చేయాలని, ఇందుకయ్యే ఖర్చు పిటిషనర్ భరిస్తారా? అనే విషయం కోర్టుకు తెలపాలని, అందుకు అంగీకరిస్తే విచారణ చేస్తామని తీర్పునిస్తూ కేసు వాయిదా వేశారు. కాగా ధీరన్ సినిమా...తెలుగులో ఖాకీ పేరుతో విడుదలైన విషయం తెలిసిందే.