చెన్నై, సాక్షి ప్రతినిధి: ఇరువర్గాల మధ్య రాజకీయ కక్షలు గ్రామంలో నిప్పురాజేశాయి. పెట్రోబాంబుల దాడులతో అమ్మవారి రథంతోపాటు ప్రజల ఆస్తులు బుగ్గిపాలయ్యాయి. ఈ విధ్వంసకాండలో జిల్లా ఎస్పీ సహా పలువురు పోలీసులకు గాయాలు కాగా 120 మందిని అరెస్ట్ చేసి గ్రామంలో 144 సెక్షన్ విధించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విల్లుపురం జిల్లా శంకరాపురం సమీపంలో శేషముత్తిరం అనే గ్రామం ఉంది. గ్రామంలో కొలువుదీరి ఉన్న మారియమ్మన్ ఆలయంలో ప్రతిఏటా ఉత్సవాలు చేస్తారు. ఇందుకోసం 2012లో అమ్మవారికి కొత్తగా రథం చేయించారు. అదే ఏడాది ఉత్సవాల్లో రథోత్సవం చేయాలని నిర్ణయించారు. అయితే గ్రామ రోడ్లలో రథోత్సవం చేయరాదని పేర్కొంటూ ఒక వర్గం అభ్యంతరం లేవనెత్తింది. గ్రామ పెద్దల సమక్షంలో చర్చలు జరిపినా ససేమిరా అనడంతో రథోత్సవంపై నిషేధం విధించారు. మూడేళ్లుగా ఆడిమాస తిరువిళారోజున ఇరువర్గాల మధ్య చర్చ జరగడం, నిషేధంతో రథోత్సవం జరుపకపోవడం ఆనవాయితీగా మారింది. అయితే ఈ ఏడాది ఎలాగైనా రథోత్సవం జరపాలని ఒక వర్గం నిర్ణయించుకుంది. నిషేధం విధించినా ఆదివారం ఉదయం రథోత్సవం జరిపితీరాలని ఏర్పాట్లు చేసుకుంది.
బాంబుల బీభత్సం: తమ మాటను కాద ని రథోత్సవానికి సిద్ధం అయ్యారని ఆగ్రహం చెందిన ఆలయ ప్రత్యర్థి వర్గం సుమారు 500 మందితో శనివారం రాత్రి ట్రాక్టర్లతో గ్రామానికి చేరుకుంది. కొత్తగా తయారుచేసిన రథంపై తమ వెంట తెచ్చుకున్న పెట్రోబాం బులను విసరగా పూర్తిగా దగ్దం అయింది. అలాగే ఆ పరిసరాల్లోని ఇళ్లపై బాంబులు విసరడంతో అగ్నికి ఆహుతైనాయి. ఈ మంటలు పరిసరాలకు వ్యాపించడంతో వరికుప్పల్లు పరశురామ ప్రీతి అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకోగా ఆందోళనకారులు వారిపై రాళ్లురువ్వారు. దీంతో పోలీసులు బాష్పవాయువును ప్రయోగించి చెదరగొట్టారు. పరిస్థితి అదుపుతప్పడంతో విల్లుపురం జిల్లా ఎస్సీ నరేంద్రనాథ్ గ్రామంలోకి రావడంతో ఆయనపై కూడా రాళ్లురువ్వారు. ఈ దాడుల్లో ఎస్సీ సహా పలువురు పోలీసులు గాయపడ్డారు. ఈ సంఘటన నేపథ్యంలో మహిళలు సహా సుమారు 120 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రామంలో 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటుచేసి 144వ సెక్షన్ విధించారు. గత గ్రామ పంచాయితీ ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన వ్యక్తి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మారియమ్మన్ ఆలయానికి కొత్త రథం తయారుచేయించాడు. ఇదే ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తి గ్రామంలో రధ సంచారంపై ఉన్న నిషేధాన్ని అడ్డుపెట్టుకుని విధ్వంసానికి దారితీసినట్లు సమాచారం.
రథోత్సవంలో రాజకీయం
Published Mon, Aug 17 2015 3:58 AM | Last Updated on Sun, Sep 3 2017 7:33 AM
Advertisement