
పన్నీరుకు ఊరట
రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ పన్నీరు సెల్వంకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ మద్రాసు హైకోర్టులో తిరస్కరణకు గురైంది. ఆయనకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసే ప్రాథమిక హక్కు
సాక్షి, చెన్నై: రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ పన్నీరు సెల్వంకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ మద్రాసు హైకోర్టులో తిరస్కరణకు గురైంది. ఆయనకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసే ప్రాథమిక హక్కు లేదంటూ పిటిషనర్‌కు కోర్టు అక్షింతలు వేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్లు జైలు శిక్ష పడ్డ మరుక్షణం సీఎం పదవికి, ఎమ్మెల్యే పదవికి జయలలిత అనర్హురాలైన విషయం తెలిసిందే. అధినేత్రి జయలలిత కటకటాల్లోకి వెళ్లడంతో ఆమె ఆదేశాల మేరకు అన్నాడీఎంకే శాసన సభా పక్షం సమావేశం అయింది. తమ సీఎం ఓ పన్నీరు సెల్వం అంటూ ఏకగ్రీవంగా ఆ సమావేశంలో ఎమ్మెల్యేలు తీర్మానించారు. రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్యను కలుసుకోవడం, మరుసటి రోజే బాధ్యతల్ని ఓ పన్నీరు సెల్వం స్వీకరించారు. సీఎంగా పన్నీరు సెల్వం, ఆయన నేతృత్వంలోని మంత్రి వర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఇంత వరకు అన్నీ బాగానే ఉన్నా, అస్సలు ఆయన బాధ్యతలు స్వీకరించడం చట్ట పరంగా జరగలేదంటూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం చర్చనీయాంశంగా మారింది.
పిటిషన్: నగరానికి చెందిన ప్రభాకరన్ అనే న్యాయవాది పన్నీరు సెల్వంకు సీఎం పదవిని వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించారు. సీఎంగా ఉన్న సమయంలో ఆదాయానికి మించి జయలలిత అండ్ బృందం సాగించిన ఆస్తుల కేసు వివరాల్ని, బెంగళూరు ప్రత్యేక కోర్టు విధించిన శిక్ష గురించి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. జయలలిత తన పదవికి రాజీనామా చేయలేదంటూ పేర్కొన్నారు. జయలలితకు శిక్ష విధించిన మరుక్షణం కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి సమాచారం వెళ్లాల్సి ఉందని వివరించారు. శ్రీరంగం శాసన సభ నియోజకవర్గం ఖాళీ ఏర్పడ్డట్టు, శాసన సభా పక్ష నేత పదవి ఖాళీ అయినట్టుగా అసెంబ్లీ కార్యదర్శి కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయాల్సి ఉందన్నారు.
అయితే, ఆ ప్రయత్నాలు అడుగైనా ముందుకు సాగలేదని ఆరోపించారు. అసెంబ్లీ కార్యదర్శి నుంచి వచ్చే లేఖ ఆధారంగా, సీఎం పదవి ఎంపికకు సంబంధించి గవర్నర్ దృష్టికి కేంద్ర ఎన్నికల కమిషన్ సమాచారం అందించాల్సిన అవసరం ఉన్నట్టు చట్ట నిబంధనల్లో పేర్కొన్నారని త న పిటిషన్ ద్వారా కోర్టు దృష్టికి తెచ్చారు. కేంద్ర ఎన్నికల కమిషన్, గవర్నర్ చర్చించినానంతరం సీఎం పదవి ఖాళీ ఏర్పడ్డట్టు ప్రకటించాల్సి ఉందని వివరించారు. అయితే, కేవలం తన ప్రతినిధిని సీఎం సీటులో కూర్చో బెట్టడం లక్ష్యంగానే జయలలిత తరపున ప్రయత్నాలు జరిగాయే తప్పా, చట్టానికి లోబడి ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. చట్టాలకు వ్యతిరేకంగా సీఎం పదవిని పన్నీరు సెల్వంకు కట్టబెట్టారని, ఆయన్ను ఆ పదవి నుంచి తొలగించి, చట్ట పరంగా సీఎం అభ్యర్థి ఎంపిక ప్రక్రియకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తిరస్కరణ: పన్నీరు సెల్వం సీఎం పదవిని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ విచారణ గురువారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి సత్యనారాయణన్ నేతృత్వంలోని బెంచ్ ముందుకు వచ్చింది. పిటిషన్‌ను పరిశీలించినానంతరం అస్సలు ఈ పిటిషన్ కోర్టులో దాఖలు చేయడానికి ఎలాంటి ప్రాథమిక హక్కు పిటిషనర్‌కు లేదని బెంచ్ స్పష్టం చేసింది. ఈ పిటిషన్ విచార యోగ్యం కాదని, దీన్ని తిరస్కరిస్తున్నామని ప్రకటించారు. ఇది కాస్త సీఎం పదవిలో ఉన్న ఓ పన్నీరు సెల్వంకు ఊరట నిచ్చినట్టే. ఈ పిటిషన్ తిరస్కరణతో ఆయన పదవికి వ్యతిరేకంగా ఇతరులెవ్వరు కోర్టు మెట్లు ఎక్కే అవకాశాలు లేని దృష్ట్యా, పరోక్షంగా సీఎం పదవికి పూర్తి స్థాయిలో గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టే.