Tamil Nadu CM Panneerselvam
-
శశికళపై తిరుగుబాటుకు మరో ఉద్యమం
-
శశికళపై తిరుగుబాటుకు మరో ఉద్యమం
రంగం సిద్ధం చేసిన ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం జయ నివాసాన్ని స్మారకమందిరంగా మార్చేందుకు సంతకాల సేకరణ చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని ఎలాగైనా అధిరోహించాలని తాపత్రయపడుతున్న శశికళకు, ఆ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం షాకుల మీద షాకులిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసం పోయెస్ గార్డెన్లో మకాం వేసిన శశికళను అక్కడి నుంచి గెంటేయ్యడానికి రంగం సిద్దం చేసుకున్నారు. జయలలిత నివాసాన్ని స్మారకమందిరంగా మార్చడానికి సంతకాల సేకరణ ఉద్యమంతో ఆయన ప్రజల ముందుకు వచ్చారు. ప్రజల మద్దతు కోరుతూ సంతకాల సేకరణను శనివారం పన్నీర్‌సెల్వం ప్రారంభించారు. అంతేకాక వేదనిలయంలో ఉంటున్న శశికళను ఖాళీ చేయించాలని అధికారులకు కూడా ఆదేశాలు జారీచేశారు. జయలలిత తన తల్లి మీద ప్రేమతో పోయెస్ గార్డెన్‌లోని తన నివాసానికి వేదనిలయంగా పేరు పెట్టుకున్నారు. జయలలిత అనారోగ్యంతో మరణించడంతో ఆమె నివాసాన్ని స్మారకమందిరంగా మార్చాలని అప్పుడే పలువురు డిమాండ్ చేశారు. కానీ ఎప్పటినుంచో జయతో కలిసి ఉంటున్న శశికళ, అమ్మ అంత్యక్రియల అనంతరం డైరెక్ట్‌గా పోయెస్ గార్డెన్‌కే వెళ్లారు. ఇక అక్కడే ఆమె నివాసం ఉంటూ వస్తున్నారు. అక్కడి నుంచి చక్రం తిప్పుతున్న శశికళను ఎలాగైనా అక్కడి నుంచి బయటికి తరిమివేయాలని పన్నీర్ సెల్వం నిర్ణయించుకున్నారు. -
చెన్నైలో ఐటీ దాడులు : సీఎం అత్యవసర సమావేశం
-
చెన్నైలో ఐటీ దాడులు : సీఎం అత్యవసర సమావేశం
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం బుధవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అందుబాటులో ఉన్న మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్రావు, ఆయన బంధువుల ఇళ్లల్లో ఆదాయపు పన్ను శాఖాధికారుల సోదాలపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం. మరో వైపు అక్రమంగా భారీ మొత్తంలో డబ్బు, బంగారం దాచిన కేసులో పట్టుబడ్డ టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ రామ్మోహన్ రావు కొడుకుతో శేఖర్ రెడ్డికి సంబంధాలున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. సీఎస్ రామ్మోహన్ రావు, ఆయన బంధువలు ఇళ్లపై జరిపిన దాడుల్లో భారీగా నగదు, బంగారం పట్టుబడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. దీంతో సీఎం అత్యవసర భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. -
వర్దా ఎఫెక్ట్ : తమిళనాడు అతలాకుతలం
చెన్నై: వర్దా తుపాను తమిళనాడును అతలాకుతలం చేస్తోంది. సోమవారం ఉదయం నుంచి కురుస్తోన్న అతి భారీ వర్షాలతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. కుండపోత వర్షాలు, పెనుగాలులతో వందలాది చెట్లు నేలకూరాయి. పలు ప్రాంతాల్లో సహాయ సిబ్బంది, ఎన్డీఆర్ఫ్, ఆర్మీ సిబ్బంది రంగంలోకి దిగి సేవలందిస్తున్నాయి. తుపాను తీరం దాటే సమయంలో గాలులు మరింత పెరిగే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. చెన్నైకు 50కి.మీ దూరంలో వర్దా తుపాను కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ తెలిపింది. వర్దా తుపాను పరిస్థితులపై తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సోమవారం సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. సాయంత్రం 4గంటల వరకు ప్రజలు బయటకు రావొద్దని అధికారులు ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నానికి శ్రీహరికోట-నెల్లూరు మధ్య తుపాను తీరం దాటే అవకాశముంది. చెన్నై విమానాశ్రయంలో రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. సోమవారం సాయంత్రం 6గంటల వరకు విమాన రాకపోకలు నిలిపివేస్తున్నట్లు ఎయిర్ లైన్ సంస్థలు ప్రకటించాయి. [ ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ] -
గుప్త నిధి గుట్టు రట్టు
- శేఖర్‌రెడ్డి ఇంటి గోడలో కరెన్సీ కట్టలు వెలికితీత - స్టార్ హోటల్ గదిలో 40 కేజీల బంగారం పట్టివేత - పన్నీర్ సెల్వంతోనూ శేఖర్‌రెడ్డికి సంబంధాలు! సాక్షి, చెన్నై/వేలూరు: నల్ల కుబేరుడు శేఖర్‌రెడ్డి ఇంటా బయటా తవ్వే కొద్దీ నోట్ల కట్టలు, బంగారం నిల్వలు బయటపడుతున్నాయి. ఆదివారం చెన్నైలోని ఓ స్టార్ హోటల్లో 40 కేజీల బంగారాన్ని ఐటీ అధికారులు వెలికితీశారు. వేలూరులో సాగిన తనిఖీల్లో ఆరు బ్యాగుల్లో నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ నోట్లు ఎంత మొత్తం అన్నది అధికారులు వెల్లడించలేదు. పలువురు ప్రముఖులు, బ్యాంకు అధికారులు, శేఖర్‌రెడ్డి సన్నిహితులు లక్ష్యంగా దాడులు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. జయలలిత మరణానంతరం తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన పన్నీర్ సెల్వంతో కూడా శేఖర్‌రెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయని కొన్ని స్థానిక చానెళ్లలో కథనాలు ప్రసారమ య్యాయి. శేఖర్‌రెడ్డి ఆస్తులపై గత నాలుగు రోజులుగా ఐటీ దాడులు సాగుతున్నాయి. శనివారం నాటికి సుమారు రూ. 170 కోట్ల నగదు, 130 కేజీల బంగారం పట్టుబడింది. ఆదివారం శేఖర్‌రెడ్డితో పాటు ఆయన సన్నిహితుల ఇళ్లల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మరోవైపు శేఖర్‌రెడ్డి సతీమణి జయశ్రీని అధికారులు శనివారం విచారించారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఉదయం ఐటీ వర్గాలు ఆరు ట్రావెల్ బ్యాగుల్లో నోట్లకట్టల్ని, రెండు సూట్‌కేసుల్లో బంగారాన్ని, కీలక పత్రాలను తమ కార్యాలయానికి తీసుకెళ్లారు. నోట్ల కట్టలు ఇంటి గోడలో ఏర్పాటు చేసిన అరలో గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పన్నీర్, శశికళ లక్ష్యంగా దాడులు గత 4 రోజులుగా శేఖర్రెడ్డిఇళ్లు, కార్యాలయాల్లో దాడులు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు తాజాగా తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం, జయలలిత నెచ్చెలి శశికళ సన్నిహితుల ఇళ్లు, ఆస్తులు లక్ష్యంగా దాడులు చేస్తున్నట్టు తెలిసింది. చెన్నైతో పాటు తిరునల్వేవి, వెల్లూరు, కాట్పాడి సహా 16 ముఖ్య ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో సీబీఐ, ఈడీ అధికారులు కూడా పాల్గొంటున్నట్టు తెలిసింది. -
పన్నీరుకు ఊరట
సాక్షి, చెన్నై: రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ పన్నీరు సెల్వంకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ మద్రాసు హైకోర్టులో తిరస్కరణకు గురైంది. ఆయనకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసే ప్రాథమిక హక్కు లేదంటూ పిటిషనర్‌కు కోర్టు అక్షింతలు వేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్లు జైలు శిక్ష పడ్డ మరుక్షణం సీఎం పదవికి, ఎమ్మెల్యే పదవికి జయలలిత అనర్హురాలైన విషయం తెలిసిందే. అధినేత్రి జయలలిత కటకటాల్లోకి వెళ్లడంతో ఆమె ఆదేశాల మేరకు అన్నాడీఎంకే శాసన సభా పక్షం సమావేశం అయింది. తమ సీఎం ఓ పన్నీరు సెల్వం అంటూ ఏకగ్రీవంగా ఆ సమావేశంలో ఎమ్మెల్యేలు తీర్మానించారు. రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్యను కలుసుకోవడం, మరుసటి రోజే బాధ్యతల్ని ఓ పన్నీరు సెల్వం స్వీకరించారు. సీఎంగా పన్నీరు సెల్వం, ఆయన నేతృత్వంలోని మంత్రి వర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఇంత వరకు అన్నీ బాగానే ఉన్నా, అస్సలు ఆయన బాధ్యతలు స్వీకరించడం చట్ట పరంగా జరగలేదంటూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం చర్చనీయాంశంగా మారింది. పిటిషన్: నగరానికి చెందిన ప్రభాకరన్ అనే న్యాయవాది పన్నీరు సెల్వంకు సీఎం పదవిని వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించారు. సీఎంగా ఉన్న సమయంలో ఆదాయానికి మించి జయలలిత అండ్ బృందం సాగించిన ఆస్తుల కేసు వివరాల్ని, బెంగళూరు ప్రత్యేక కోర్టు విధించిన శిక్ష గురించి తన పిటిషన్లో పేర్కొన్నారు. జయలలిత తన పదవికి రాజీనామా చేయలేదంటూ పేర్కొన్నారు. జయలలితకు శిక్ష విధించిన మరుక్షణం కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి సమాచారం వెళ్లాల్సి ఉందని వివరించారు. శ్రీరంగం శాసన సభ నియోజకవర్గం ఖాళీ ఏర్పడ్డట్టు, శాసన సభా పక్ష నేత పదవి ఖాళీ అయినట్టుగా అసెంబ్లీ కార్యదర్శి కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయాల్సి ఉందన్నారు. అయితే, ఆ ప్రయత్నాలు అడుగైనా ముందుకు సాగలేదని ఆరోపించారు. అసెంబ్లీ కార్యదర్శి నుంచి వచ్చే లేఖ ఆధారంగా, సీఎం పదవి ఎంపికకు సంబంధించి గవర్నర్ దృష్టికి కేంద్ర ఎన్నికల కమిషన్ సమాచారం అందించాల్సిన అవసరం ఉన్నట్టు చట్ట నిబంధనల్లో పేర్కొన్నారని త న పిటిషన్ ద్వారా కోర్టు దృష్టికి తెచ్చారు. కేంద్ర ఎన్నికల కమిషన్, గవర్నర్ చర్చించినానంతరం సీఎం పదవి ఖాళీ ఏర్పడ్డట్టు ప్రకటించాల్సి ఉందని వివరించారు. అయితే, కేవలం తన ప్రతినిధిని సీఎం సీటులో కూర్చో బెట్టడం లక్ష్యంగానే జయలలిత తరపున ప్రయత్నాలు జరిగాయే తప్పా, చట్టానికి లోబడి ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. చట్టాలకు వ్యతిరేకంగా సీఎం పదవిని పన్నీరు సెల్వంకు కట్టబెట్టారని, ఆయన్ను ఆ పదవి నుంచి తొలగించి, చట్ట పరంగా సీఎం అభ్యర్థి ఎంపిక ప్రక్రియకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తిరస్కరణ: పన్నీరు సెల్వం సీఎం పదవిని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ విచారణ గురువారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి సత్యనారాయణన్ నేతృత్వంలోని బెంచ్ ముందుకు వచ్చింది. పిటిషన్‌ను పరిశీలించినానంతరం అస్సలు ఈ పిటిషన్ కోర్టులో దాఖలు చేయడానికి ఎలాంటి ప్రాథమిక హక్కు పిటిషనర్‌కు లేదని బెంచ్ స్పష్టం చేసింది. ఈ పిటిషన్ విచార యోగ్యం కాదని, దీన్ని తిరస్కరిస్తున్నామని ప్రకటించారు. ఇది కాస్త సీఎం పదవిలో ఉన్న ఓ పన్నీరు సెల్వంకు ఊరట నిచ్చినట్టే. ఈ పిటిషన్ తిరస్కరణతో ఆయన పదవికి వ్యతిరేకంగా ఇతరులెవ్వరు కోర్టు మెట్లు ఎక్కే అవకాశాలు లేని దృష్ట్యా, పరోక్షంగా సీఎం పదవికి పూర్తి స్థాయిలో గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టే.