శశికళపై తిరుగుబాటుకు మరో ఉద్యమం
-
రంగం సిద్ధం చేసిన ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం
-
జయ నివాసాన్ని స్మారకమందిరంగా మార్చేందుకు సంతకాల సేకరణ
చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని ఎలాగైనా అధిరోహించాలని తాపత్రయపడుతున్న శశికళకు, ఆ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం షాకుల మీద షాకులిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసం పోయెస్ గార్డెన్లో మకాం వేసిన శశికళను అక్కడి నుంచి గెంటేయ్యడానికి రంగం సిద్దం చేసుకున్నారు. జయలలిత నివాసాన్ని స్మారకమందిరంగా మార్చడానికి సంతకాల సేకరణ ఉద్యమంతో ఆయన ప్రజల ముందుకు వచ్చారు.
ప్రజల మద్దతు కోరుతూ సంతకాల సేకరణను శనివారం పన్నీర్సెల్వం ప్రారంభించారు. అంతేకాక వేదనిలయంలో ఉంటున్న శశికళను ఖాళీ చేయించాలని అధికారులకు కూడా ఆదేశాలు జారీచేశారు. జయలలిత తన తల్లి మీద ప్రేమతో పోయెస్ గార్డెన్లోని తన నివాసానికి వేదనిలయంగా పేరు పెట్టుకున్నారు. జయలలిత అనారోగ్యంతో మరణించడంతో ఆమె నివాసాన్ని స్మారకమందిరంగా మార్చాలని అప్పుడే పలువురు డిమాండ్ చేశారు. కానీ ఎప్పటినుంచో జయతో కలిసి ఉంటున్న శశికళ, అమ్మ అంత్యక్రియల అనంతరం డైరెక్ట్గా పోయెస్ గార్డెన్కే వెళ్లారు. ఇక అక్కడే ఆమె నివాసం ఉంటూ వస్తున్నారు. అక్కడి నుంచి చక్రం తిప్పుతున్న శశికళను ఎలాగైనా అక్కడి నుంచి బయటికి తరిమివేయాలని పన్నీర్ సెల్వం నిర్ణయించుకున్నారు.