
వర్దా ఎఫెక్ట్ : తమిళనాడు అతలాకుతలం
చెన్నై: వర్దా తుపాను తమిళనాడును అతలాకుతలం చేస్తోంది. సోమవారం ఉదయం నుంచి కురుస్తోన్న అతి భారీ వర్షాలతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. కుండపోత వర్షాలు, పెనుగాలులతో వందలాది చెట్లు నేలకూరాయి. పలు ప్రాంతాల్లో సహాయ సిబ్బంది, ఎన్డీఆర్ఫ్, ఆర్మీ సిబ్బంది రంగంలోకి దిగి సేవలందిస్తున్నాయి. తుపాను తీరం దాటే సమయంలో గాలులు మరింత పెరిగే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. చెన్నైకు 50కి.మీ దూరంలో వర్దా తుపాను కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ తెలిపింది.
వర్దా తుపాను పరిస్థితులపై తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సోమవారం సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. సాయంత్రం 4గంటల వరకు ప్రజలు బయటకు రావొద్దని అధికారులు ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నానికి శ్రీహరికోట-నెల్లూరు మధ్య తుపాను తీరం దాటే అవకాశముంది. చెన్నై విమానాశ్రయంలో రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. సోమవారం సాయంత్రం 6గంటల వరకు విమాన రాకపోకలు నిలిపివేస్తున్నట్లు ఎయిర్ లైన్ సంస్థలు ప్రకటించాయి.