
చెన్నైను వణికిస్తున్న వర్దా తుపాను
► తమిళనాడును ముంచెత్తిన అతి భారీ వర్షాలు
► విమానాశ్రయం మూసివేత
► పలు రైళ్లు దారి మళ్లింపు, రద్దు
► పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత
► ప్రజలు బయటకు రావద్దని అధికారులు ఆదేశాలు
చెన్నై: తమిళనాడు రాష్ట్రాన్ని వణికిస్తున్న వర్దా తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. సోమవారం తెల్లవారుజాము నుంచే మీనంబాకం, చెన్నై విమానశ్రయం పరిసరాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పనులున్న ప్రజలు బయటకు రావద్దని, పనులను వాయిదా వేసుకోవాలని అధికారులు ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నానికి తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చెన్నైకు 105కి.మీ దూరంలో తుపాను కేంద్రీకృతమైందని తీరం దాటే సమయంలో పెనుతుపాను తీవ్ర ప్రభావం చూపనుందని హెచ్చరించారు. తుపాను తీరం దాటిన అనంతరం 36 గంటల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. తుపాను ప్రభావంతో చెన్నై విమానాశ్రయాన్ని సోమవారం మధ్యాహ్నం 3గంటల వరకు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేయగా కొన్నింటినీ దారి మళ్లించారు. తమిళనాడు ముంపు ప్రాంతాల్లో నివసిస్తున్న 7357 మంది ప్రజలను 54 సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. (తుఫాను పరిస్థితిపై కేంద్రం హెచ్చరిక)
వర్దా తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు పడతాయని అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. చెన్నై, ఎన్నోర్, కట్టుపల్లి పోర్టుల్లో పదో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తుపాను సహాయ కార్యక్రమాల్లో 15 ఎన్డీఆర్ఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. చెన్నైకు సమీపంలో తీరం దాటే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. తీరం దాటే సమయంలో గంటకు 110కి.మీ వేగంతో గాలులు వీస్తాయన్నారు. 22 ఏళ్ల తర్వాత చెన్నైకు సమీపంలో తుపాను తీరం దాటనుంది. దీని ప్రభావంతో చెన్నై సహా తమిళనాడు ఉత్తర జిల్లాల్లో భారీ వర్షాలు, పెనుగాలులు బీభత్సం సృష్టిస్తాయని అధికారులు హెచ్చరించారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వాలు అధికారులకు అప్రమత్తం చేశారు. తుపాను పరిస్థితులను అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.