
పింగళి చైతన్యకు ‘యువ పురస్కార్’
ప్రకటించిన కేంద్ర సాహిత్య అకాడమీ
సాక్షి, న్యూఢిల్లీ: యువ రచయిత్రి పింగళి చైతన్యకు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్-2016 లభించింది. దేశవ్యాప్తంగా 24 భాషలకు సంబంధించి 24 మంది యువ రచయితలకు ఈ పురస్కారం ప్రకటించారు. అకాడమీ చైర్మన్ విశ్వనాథ్‌ప్రసాద్ తివారీ నేతృత్వంలో గురువారం ఇంఫాల్‌లో జరిగిన సమావేశంలో ఈ అవార్డుల ఎంపిక జరిగింది. తెలుగు భాషకు సంబంధించి చైతన్య రాసిన ‘చిట్టగాంగ్ విప్లవ వనితలు’ (సంక్షిప్త కథలు) పుస్తకానికి ఈ పురస్కారం దక్కిందని అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.
తెలుగు భాషకు సంబంధించి డాక్టర్ అనుమాండ్ల భూమయ్య, డాక్టర్ పాటిబండ్ల రజని, డాక్టర్ వాడరేవు చిన్నవీరభద్రుడు జ్యూరీ సభ్యులుగా వ్యవహరించారు. ఈ అవార్డు కింద రూ.50 వేల నగదు పురస్కారం అందజేస్తారు.
వెంకటసుబ్బారావుకు ‘బాల్ సాహిత్య పురస్కార్’
కేంద్ర సాహిత్య అకాడమీ దేశవ్యాప్తంగా 21 మంది రచయితలకు ‘బాల్ సాహిత్య పురస్కార్-2016’ అవార్డులను ప్రకటించింది. తెలుగు భాషకు సంబంధించి ఆలపర్తి వెంకటసుబ్బారావు (బాలబంధు) రాసిన స్వర్ణ పుష్పాలు (కవిత్వం) పుస్తకానికి ఈ అవార్డు దక్కింది. అవార్డు కింద రూ.50 వేల నగదు అందిస్తారు. నవంబరు 14న జరిగే బాలల దినోత్సవంలో అవార్డు అందజేస్తారని కె.శ్రీనివాసరావు తెలిపారు. జ్యూరీ సభ్యులుగా తెలుగు భాషకు సంబంధించి బి.నరసింగరావు, ఎల్.ఆర్.స్వామి, ఎన్.కె.బాబు వ్యవహరించారు.