చెన్నై, సాక్షి ప్రతినిధి: శివగంగైలోని ఒక టాస్మాక్ దుకాణంలో టైమ్‌బాంబ్ బయటపడింది. పైపు రూపంలో ఒక గోనె సంచిలో రహస్యంగా దాచి ఉంచిన ఈ బాంబును నిర్వీర్యం చేశారు. దీంతో పెద్దప్రమాదం తప్పింది. శివంగంగై గాంధీకి వీధి సమీపంలో జిల్లా ఉపాధికల్పనా కార్యాలయ నిర్మాణ పనులు నిర్వహిస్తున్నారు. ఈ నిర్మాణానికి ఎదురుగుండా టాస్మాక్ దుకాణం, దీనికి అనుబంధంగా బార్ ఉంది.
కొత్త ఏడాది వేడుకల్లో భాగంగా గురువారం ఉదయం నుంచి రాత్రి 10 గంటలకు టాస్మాక్ మూసివేసే వరకు భారీ సంఖ్యలో మందుబాబులు గుమిగూడారు. టాస్మాక్ మూసివేసిన తరువాత సిబ్బందిని పంపివేసి కొందరు మాత్రం లోపలే నిద్రించారు. అర్ధరాత్రి వేళ వారిలో ఒకడు మూత్ర విసర్జన కోసం లేచివెళుతుండగా ఒక మూల నుంచి టిక్‌టిక్ అనే శబ్దం వినిపించింది. భయాందోళనకుగురైన ఆ వ్యక్తి ఇతరులను నిద్రలేపాడు.
టాస్మాక్ దుకాణం నలుమూలల పరిశీలించగా ఒక గోతం నుంచి ఆశబ్దం వస్తున్నట్లు కనుగొన్నారు. బాంబుగా అనుమానించిన వారు టాస్మాక్ యజమానికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు, బాంబ్ స్క్వాడ్ నిపుణులు అక్కడికి చేరుకున్నారు. అది బాంబుగా నిర్ధారించారు. జాగ్రత్తగా గోతాంను తెరచిచూడగా అర అడుగున్న పైపు రూపంలో బాంబు, రెండు సిలిండర్లు, బ్యాటరీలు, ఒక డయలు కలిగి ఉన్న టైమ్‌బాంబు కనిపించింది.
వాటి అనుసంధానాన్ని జాగ్రత్తగా కట్‌చేసి బాంబును నిర్వీర్యం చేశారు. దీనిపై ఓ అధికారి మాట్లాడారు. ఇది చాలా శక్తివంతమైనదని, సుమారు 300 అడుగుల పరిధిలో తీవ్ర విధ్వంసాన్ని సృష్టించగలదని చెప్పారు. భవనాలను కూల్చివేయడంతోపాటు ప్రాణ నష్టం కూడా తీవ్రంగా ఉండేదని చెప్పారు. టైమ్‌బాంబుగానేగాక రిమోట్ సహాయంతో పేల్చేసే వసతి ఉందన్నారు.
శివగంగైలో టైమ్‌బాంబ్
Published Sat, Jan 3 2015 2:21 AM | Last Updated on Sat, Sep 2 2017 7:07 PM
Advertisement
Advertisement