ఎన్నికలకు ముందే చిందిన రక్తం!
బీహార్లో ఎన్నికలంటే ఒకప్పుడు పెద్ద ఎత్తున హింస చోటుచేసుకునేది. ఆటవిక రాజ్యాన్ని తలపించేవిధంగా మాటవినని అభ్యర్థులపై దాడులు, ఓటర్లకు బెదిరింపులు, బ్యాలెట్ బాక్సులు ఎత్తుకుపోవడం వంటి అరాచకాలు జరిగేవి. ఇటీవలకాలంలో ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవడంతో ఈ హింస కొంత తగ్గుముఖం పట్టినట్టు కనిపించినా.. తాజాగా ఎన్డీయే, జేడీయూ కూటమి మధ్య హోరాహోరీగా జరుగుతున్న ఎన్నికల్లోనూ హింస చోటుచేసుకుంటున్నది. ఒకప్పటి అరాచకాలను ఇది గుర్తుచేస్తున్నది.
తాజాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తిపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. మధుబని జిల్లాలో జంఝర్పూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న సునీల్ ఝాపై కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో గాయపడిన సునీల్ ఝా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు బీజేపీ రెబెల్ ఎమ్మెల్యే రెష్మీ వర్మ ఇంటివద్ద టైంబాంబ్ దొరకడం కలకలం సృష్టించింది. బీజేపీ నుంచి టికెట్ రాకపోవడంతో రేష్మీ వర్మ స్వతంత్ర అభ్యర్థిగా నర్కటియాగంజ్ నుంచి పోటీకి దిగారు. రెబెల్గా బరిలోకి దిగిన ఆమెకు మొదటినుంచీ బెదిరింపు లేఖలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ఇంటివద్ద అమర్చిన టైంబాంబును పోలీసులు శనివారం గుర్తించి నిర్వీర్యం చేశారు. గతంలోనూ రేష్మీ వర్మ ఇంటివద్ద బాంబు దొరకడం గమనార్హం. ఇక మొదటి దఫా బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచార గడువు నేటితో ముగిసింది. ఈ నెల 12న తొలిదఫా పోలింగ్ జరుగనుంది.