'వేద' ఘోష!
'వేద' ఘోష!
Published Sat, Aug 19 2017 11:14 AM | Last Updated on Sun, Sep 17 2017 5:42 PM
పోలీస్ వలయంలో పోయెస్‌గార్డెన్
వందకుపైగా బలగాలతో మోహరింపు
పనివాళ్లు, ప్రయివేటు సెక్యూరిటీకి చెక్
శశికళ కుటుంబ ప్రవేశంపై నిషేధం
సాక్షి, చెన్నై : దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసం వేదనిలయాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని జయ స్మారక మందిరంగా మార్చనున్నట్లు సీఎం ఎడపాడి చేసిన ప్రకటనతో పోయెస్‌గార్డెన్ పోలీస్ వలయంగా మారింది. గురువారం రాత్రి సీఎం ప్రకటించగానే పోలీసులు చేరుకోగా శుక్రవారం ఉదయానికి భారీ సంఖ్యలో బారికేడ్లు, సుమారు వందమందికి పైగా పోలీసు బలగాలు ప్రత్యక్షమయ్యాయి. వేదనిలయం సమీపించే రోడ్డులో మూడు చోట్ల పోలీసులు పహరా కాస్తున్నారు. శశికళ కుటుంబీకులను లోనికి వెళ్లకుండా నిషేధాజ్ఞలు విధించారు. అలాగే ఆ పరిసరాలతో సంబంధం లేని వ్యక్తులను సైతం అనుమతించడం లేదు. వేదనిలయం సమీపంలో నివసిస్తున్న వారిని నిర్ధారించుకున్న తరువాతనే అనుమతిస్తున్నారు. ప్రస్తుతం వేదనిలయం బెంగళూరు జైల్లో శశికళతోపాటు శిక్షను అనుభిస్తున్న ఇళవరసి కుమారుడు వివేక్ స్వాధీనంలో ఉంది. అయితే వీరికి సంబంధించిన వారెవ్వరూ అక్కడ నివసించడం లేదు. ఇటీవల వరకు మన్నార్‌కుడి (శశికళ స్వస్థలం)కి చెందిన కొందరు పనివాళ్లు, ప్రయివేటు సెక్యూరిటీ గార్డులు ఇంటిని కనిపెట్టుకుని ఉండేవారు. అయితే వారిని శుక్రవారం అక్కడి నుంచి పంపివేశారు.
నాడు రూ.1.32 లక్షలు.. నేడు రూ.90 కోట్లు
పోయెస్‌గార్డెన్‌లోని ఇంటిని జయ తల్లి సంధ్య 1967 జూలై 15 వ తేదీన తనపేరుపై కొనుగోలు చేశారు. 24 వేల చదరపు అడుగుల స్థలంలో 21,662 చదరపు అడుగుల్లో భవనాన్ని నిర్మించి ఉంది. రూ.1.32 లక్షలతో సొంతం చేసుకున్న వేదనిలయం విలువ నేడు రూ. 90 కోట్లని సమాచారం.
ప్రభుత్వ నిర్ణయంపై దీప, దీపక్‌ల వివాదం:
వేదనిలయంను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని సహించేది లేదని గురువారమే అభ్యంతరం వ్యక్తం చేసిన జయ మేనకోడలు కేసు వేయనున్నట్లు శుక్రవారం ప్రకటించారు. అలాగే దీప సోదరుడు సైతం సదరు భవనం దీపకు, తనకు సొంతమని, అందుకు తగిన డాక్యుమెంట్లు తన వద్ద ఉన్నాయని దీపక్ శుక్రవారం ప్రకటిస్తూ సీఎం ఎడపాడికి లేఖ రాశారు. ప్రభుత్వానికి చేతనైతే చట్టపరంగా స్వాధీనం చేసుకోవాలని దీపక్ సవాలు విసిరారు. వేదనిలయం తన తదనంతరం కుమారుడు (జయకుమార్), కుమార్తె (జయలలిత)కు చెందాలని సంధ్య వీలునామా రాశారు. ప్రస్తుతం ఆ వీలునామా దీపక్ వద్ద ఉంది. అయితే ప్రజల కోసం ఏ ఆస్తులనైనా స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని అధికార పార్టీ నేతలు అంటున్నారు. వారసత్వ హక్కును రుజువు చేసుకున్న వారికి నష్టపరిహారం చెల్లించి వేదనిలయంను స్వాధీనం చేసుకుంటామని మంత్రి సీవీ షణ్ముగం చెబుతున్నారు.
చిన్నమ్మ కోసం దినకరన్ పరుగు:
జయ మరణంపై విచారణ కమిషన్, పోయెస్‌గార్డెన్ ఇళ్లు ప్రభుత్వపరం కావడం, ఎడపాడి, పన్నీర్ ఏకమయ్యే ప్రయత్నాలు ఊపందుకోవడంతో అన్నాడీఎంకే (అమ్మ) ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు బెంగళూరుకు పరుగులు తీశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో శశికళ తనకు ఇచ్చిన ఆదేశాలను నెరవేర్చితీరుతానని దినకరన్ వ్యాఖ్యానించారు.
Advertisement