దసరా ఉత్సవాల సందర్భంగా దుర్గగుడిలో పోలీసుల జులుం సాగుతోంది.
- మూలా నక్షత్రం రోజున ఘటన
- అదేరోజు ధర్నాకు దిగేందుకు అర్చకుల యత్నం
- వీడియో పుటేజ్‌లో దాడి చేసినట్లు స్పష్టం
సాక్షి, విజయవాడ : దసరా ఉత్సవాల సందర్భంగా దుర్గగుడిలో పోలీసుల జులుం సాగుతోంది. ఇటీవల ఒక పోలీస్ ఉన్నతాధికారి అంతరాలయంలో పూజ చేయించుకుంటున్నారనే ఉద్దేశంతో పంచభోగ నివేదనను అమ్మవారికి సమర్పించకుండా బయటే నిలుపుదల చేశారు. ఇది చివరకు దేవస్థానం ఉద్యోగులకు మెమోలు ఇచ్చే వరకూ వెళ్లింది. ఈ ఘటన మరిచిపోక ముందే దేవస్థానం అర్చకుడ్ని ఒక పోలీస్ ఉద్యోగి కొట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
మూలానక్షత్రం రోజున వివాదం
పోలీస్ కానిస్టేబుల్ తనకు తెలిసిన ఒక వ్యక్తిని దర్శనం నిమిత్తం మల్లేశ్వరస్వామి ఆలయానికి తీసుకొచ్చారు. ఆ వీఐపీ అంతరాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, అక్కడ విధినిర్వహణలో ఉన్న ఒక అర్చకుడు వారించాడు. బయట నుంచే దర్శించుకోవాలని సూచించి ఆపే ప్రయత్నంలో చెయ్యి అడ్డం పెట్టాడు. దీంతో వీఐపీతో వచ్చిన పోలీస్ కానిస్టేబుల్‌కు కోపమొచ్చి అర్చకుడిని కొట్టడమే కాకుండా.. ఆలయంలో దుర్భాషలాడాడు. ఇదంతా అక్కడ ఉన్న వీడియో ఫుటేజ్‌లో నమోదైనట్లు దేవస్థాన వర్గాలు చెబుతున్నాయి.
ధర్నా చేసేందుకు అర్చకుల యత్నం
సమాచారం తెలుసుకున్న అర్చకులు అదేరోజు ధర్నా చేసేందుకు సిద్ధమయ్యారు. మూలా నక్షత్రం రోజు కావడంతో వారికి వారే సర్ది చెప్పుకొని శాంతించారు. అయితే, దాడి విషయాన్ని ఈవో సూర్యకుమారి దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిసింది. వీడియో పుటేజ్‌లు పరిశీలించిన ఆమె.. అర్చకుడు ఫిర్యాదు చేస్తే పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. దేవస్థానంలో చిరుద్యోగి అయిన అర్చకుడు ఫిర్యాదు చేయడానికి భయపడుతున్నారని చెబుతున్నారు. వీడియో ఫుటేజ్ ఆధారంగా ఈవోనే జరిగిన ఘటనను పరిశీలించి సుమోటోగా పోలీస్ ఉన్నతాధికారులు ఫిర్యాదుచేసి న్యాయం చేయాలని అర్చకులు కోరుతున్నారు.