కౌన్సెలింగ్తో దారికొచ్చిన ప్రియుడు
నాగాయలంక : అబ్బాయి పేరు మతృత్తి దుర్గాప్రసాద్. స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా చేపూరు. అమ్మాయి పేరు గాలంకి అనూష. ఆమె స్వగ్రామం నాగాయలంక సమీపంలోని మర్రిపాలెం. వీరిద్దరూ హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటుండగా.. ఏడాదిన్నర క్రితం కలిశారు. వారి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని దుర్గాప్రసాద్ నమ్మించాడు. దీంతో అనూష పెళ్లికాకుండానే గర్భం దాల్చింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. దుర్గాప్రసాద్ ముఖం చాటేశాడు. అతను సొంత ఊరు వెళ్లిపోయాడు. గర్భందాల్చిన అనూష కూడా పుట్టింటికి చేరింది. పెద్దలు జోక్యం చేసుకుని పెళ్లి ప్రయత్నాలు చేశారు. దుర్గాప్రసాద్ పెళ్లి చేసుకోని అడ్డం తిరిగాడు.
పోలీసుల జోక్యంతో...
దుర్గాప్రసాద్ పెళ్లికి అంగీకరించకపోవడంతో ఆగస్టు నాలుగో తేదీన అనూష తల్లిదండ్రులు నాగాయలంక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో 20 రోజుల క్రితం అనూష మగబిడ్డకు జన్మనిచ్చింది. పోలీసులు కూడా దుర్గాప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని నాగాయలంక పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. పండండి మగబిడ్డ పుట్టిందని తెలియడంతో అప్పటి వరకు పెళ్లి చేసుకోనని అడ్డం తిరిగిన అతను దారిలోకి వచ్చాడు. పోలీసులు కౌన్సెలింగ్తో దారికొచ్చిన ప్రియుడు పెళ్లి చేసుకునేందుకు అంగీకరించాడు. అనంతరం ఇరు గ్రామాల పెద్దలు, బంధువులు రంగంలోకి దిగారు. అన్ని విషయాలు మాట్లాడుకున్నారు. శనివారం సాయంత్రం స్థానిక కృష్ణానదీ తీరంలోని శ్రీ వేంటేశ్వరస్వామి గుడిలో పండండి బిడ్డ ఒడిలో ఉన్న అనూష మెడలో దుర్గాప్రసాద్ తాళి కట్టాడు. ఆలయ అర్చకుడు దీవి మురళీఆచార్యులు సంప్రదాయప్రకారం మాంగల్యధారణ చేయించారు. టి.కొత్తపాలెం సర్పంచి మెండు లక్ష్మణరావు(చంటి), చేపూరు గ్రామపెద్ద అప్పికొండ అప్పలకొండ, మర్రిపాలెం మాజీ సర్పంచ్ బండ్రెడ్డి గోపాలరావు, ఇతర పెద్దలు, ఇరువర్గాల బంధువులు ఆశీర్వదించారు.