
‘జై ఆంధ్రప్రదేశ్’ సభకు ఆటంకాలు
విశాఖపట్నం: ప్రత్యేక హోదా కోసం సాగిస్తున్న పోరాటంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జై ఆంధ్రప్రదేశ్’ బహిరంగ సభకు అడ్డుకునేందుకు చంద్రబాబు సర్కారు కుయుక్తులు పన్నింది. జనం సభకు రాకుండా చేసేందుకు అడ్డంకులు సృష్టించింది. సభ జరిగిన ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలోకి ప్రజలను వెళ్లనీయకుండా పోలీసులు నియత్రించారు. స్టేడియం గేట్లు మూసివేసి సభకు వచ్చిన ప్రజలను అడ్డుకున్నారు. దీంతో వేలాది ప్రజలు స్టేడియం వెలుపలే ఉండిపోయారు. సభ జరుగుతున్నంతసేపు ప్రజలు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అభిమానులు బయటే ఉండిపోయారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సభా ప్రాంగణంలోకి వస్తున్న సమయంలోనూ పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. కార్యకర్తలను విచక్షణారహితంగా తోసేశారు. స్టేడియం గేట్లు అన్ని తెరిచి ప్రజలను లోపలికి అనుమతించాలని వేదికపై నుంచి వైఎస్సార్ సీపీ నాయకులు పదేపదే విజ్ఞప్తి చేసినా పోలీసులు పెడచెవిన పెట్టారు. పోలీసులు ఇలాగే ప్రవర్తిస్తే ప్రజలు తిరగబడతారని చెవిరెడ్డి భాస్కరరెడ్డి మైకులో హెచ్చరించారు. ప్రజలను లోపలికి రానివ్వాలని కోరారు. అయినా పోలీసులు పట్టించుకోలేదు.