కొంగొత్త రాజకీయం | political parties confusion due to districts bifurcation | Sakshi
Sakshi News home page

కొంగొత్త రాజకీయం

Published Sat, Oct 15 2016 9:58 AM | Last Updated on Mon, Sep 17 2018 5:36 PM

కొంగొత్త రాజకీయం - Sakshi

కొంగొత్త రాజకీయం

  • ఐదు జిల్లాలకు ప్రత్యేక కమిటీలు
  • ముందుగానే నియమించిన సీపీఎం
  • ఈ నెల 20లోపు ఏర్పాటుకు
  • కాంగ్రెస్, బీజేపీ కసరత్తు
  • అధికార పార్టీలో అయోమయం
  • ఏప్రిల్ వరకు పాత కమిటీలే !
  •  
    సాక్షి, వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజన రాజకీయ పార్టీలను అయోమయంలో పడేస్తోంది. రాజకీయ పార్టీల సంస్థాగత స్వరూపం ఎలా ఉండాలనే విషయంలో అన్ని పార్టీల్లో అస్పష్టత నెలకొంది. దసరా రోజు వరకు ఉన్న పరిస్థితికి ప్రస్తుత పరిస్థితికి పొంతన కుదరడం లేదు.

    ఇన్ని రోజులు గ్రేటర్ వరంగల్, వరంగల్ జిల్లా విభాగాలుగా ఉన్న రాజకీయ పార్టీల కమిటీలను ఎలా ఏర్పాటు చేయాలో తెలియక గందరగోళం నెలకొంది. ప్రధానంగా గ్రేటర్ వరంగల్ కమిటీ కొనసాగింపుపై అన్ని పార్టీలు ఆలోచన చేస్తున్నాయి. గ్రేటర్ వరంగల్ జిల్లా కమిటీలను వరంగల్ అర్బన్ జిల్లా కమిటీలుగా మార్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాయి.
     
    సీపీఎం అన్ని పార్టీల కంటే ముందుగానే జిల్లా కమిటీలను నియమించింది. వరంగల్ అర్బన్ జిల్లా కార్యదర్శిగా ఎస్.వాసుదేవరెడ్డి, వరంగల్ రూరల్ జిల్లా కార్యదర్శిగా ఎం.చుక్కయ్య, మహబూబాబాద్ జిల్లా కార్యదర్శిగా సాదుల శ్రీనివాస్, భూపాలపల్లి జిల్లా కార్యదర్శిగా సూడి కృష్ణారెడ్డి, జనగామ జిల్లా కార్యదర్శిగా యు.రవిలను నియమించింది.
     
    కాంగ్రెస్‌లో కొత్త జిల్లా కమిటీల నియామకం కోసం అక్టోబరు 20లోపు ప్రతిపాదనలు పంపాలని అన్ని జిల్లాల ప్రస్తుత డీసీసీలకు ఏఐసీసీ ఆదేశాలు ఇచ్చింది. వరంగల్ జిల్లాలో కొత్త కమిటీల కూర్పుపై కొంత సందిగ్ధత నెలకొంది. గ్రేటర్ వరంగల్ కమిటీని కొనసాగించాలా.. వద్దా.. అనే విషయంపై చర్చ జరుగుతోంది. డీసీసీ ప్రస్తుత అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం ఉంది.
     
    దీని కోసం ప్రస్తుత గ్రేటర్ వరంగల్ కమిటీని రద్దు చేసే ప్రతిపాదన ఉన్నట్లు తెలిసింది. మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జెన్నారెడ్డి భరత్‌చందర్‌రెడ్డి, జయశంకర్ జిల్లా అధ్యక్షుడిగా మల్లాడి రాంరెడ్డిని అధ్యక్షుడిగా నియమించనున్నట్లు తెలిసింది. జనగామ జిల్లా అధ్యక్షుడిగా చెంచారపు శ్రీనివాస్‌రెడ్డి, వై.సుధాకర్‌లలో ఒకరు నియమితులయ్యే అవకాశం ఉంది. వరంగల్ రూరల్ జిల్లాకు ఇనుగాల వెంకట్రామిరెడ్డి, కొండేటి శ్రీధర్ పేర్లను పీసీసీ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. డీసీసీ అధ్యక్షుల నియామకంపై శుక్రవారం హైదరాబాద్‌లో పీసీసీ స్థాయిలో సమావేశం జరగనుందని హస్తం పార్టీ వర్గాలు తెలిపారు.
     
    అధికార టీఆర్‌ఎస్ పార్టీ జిల్లాల వారీగా కమిటీల ఏర్పాటుపై కసరత్తు ఇంకా మొదలుపెట్టలేదు. టీఆర్‌ఎస్ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ వచ్చే ఏప్రిల్‌లో జరగనుంది. దీంతోప్రస్తుత కమిటీలను వచ్చే ఏప్రిల్ వరకు కొనసాగిస్తారని తెలుస్తోంది. పరిపాలన మార్పులపై దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్ ఇప్పట్లో టీఆర్‌ఎస్ కమిటీలను నియమించే అవకాశం లేదని గులాబీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
     
    అన్ని రకాల నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసిన తర్వాతే టీఆర్‌ఎస్‌కు కొత్త జిల్లాల కమిటీలను నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. గులాబీ పార్టీ అధిష్టానం త్వరలోనే జిల్లాలకు తాత్కాలిక కన్వీనర్లను నియమించే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. టీఆర్‌ఎస్‌కు ప్రస్తుతం వరంగల్, గ్రేటర్ వరంగల్ జిల్లా కమిటీలు ఉన్నారు. గ్రేటర్ వరంగల్ కమిటీని వరంగల్ అర్బన్ జిల్లా కమిటీగా మార్చే అవకాశం ఉంది. మిగిలిన నాలుగు జిల్లాల అధ్యక్ష పదవుల కోసం భారీగా పోటీ ఉండనుంది.
     
    భారతీయ జనతా పార్టీలో కొత్త జిల్లాల ప్రకారం కమిటీలు ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్టోబరు 15, 16 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. వరంగల్ జిల్లా కార్యవర్గ సమావేశం సైతం ఈ తేదీల్లో జరగనుంది.
     
    ఈ సమావేశాల్లోనే కొత్త కమిటీల కూర్పుపై నిర్ణయం తీసుకోకున్నారు. బీజేపీలో ప్రస్తుతం వరంగల్, గ్రేటర్ వరంగల్ జిల్లాల కమిటీలు ఉన్నాయి. వరంగల్ జిల్లా కమిటీని వరంగల్ రూరల్ జిల్లా కమిటీగా మార్చనున్నారు. ప్రస్తుతం ఉన్న వరంగల్ కమిటీ అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యే అవకాశం ఉంది. గ్రేటర్ వరంగల్ కమిటీని వరంగల్ అర్బన్ కమిటీగా మార్చనున్నారు.
     
     గ్రేటర్ వరంగల్ బీజేపీ అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ పదవి కోసం గ్రేటర్‌లోని పలువురు నేతలు పోటీ పడుతున్నారు. జయశంకర్(భూపాలపల్లి) జిల్లా కమిటీ అధ్యక్ష పదవి రేసులో చందుపట్ల కీర్తి, నాగపురి రాజమౌళి పేర్లు వినిపిస్తున్నారుు. జనగామ జిల్లా అధ్యక్ష పదవి కోసం కె.వి.ఎల్.ఎన్.రెడ్డి, నెల్లుట్ల నర్సింహారావు పేర్లను పార్టీ అధిష్టానం పరిశీలించనుంది. మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా గాదె రాంబాబు, పెదగాని సోమయ్య పేర్లు వినిపిస్తున్నాయి.
     
     టీడీపీలో కొత్త జిల్లాల కమిటీల ప్రక్రియ ఇంకా మొదలుకాలేదు. సంస్థాగతంగా పార్టీ బలహీనం కావడంతో కొత్త కమిటీల నియామకంపై జాప్యం జరుగుతోందని తెలుస్తోంది.
     
     సీపీఐ నిర్మాణ మహాసభ నవంబర్ 7, 8 తేదీల్లో తొర్రూరులో జరగనుంది. ఈ సమావేశాల్లో ఐదు జిల్లాల కమిటీలను నియమించనున్నారు. అనంతరం నవంబరు 28, 29, 30 తేదీల్లో వరంగల్‌లోనే రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి.
     
     వైఎస్సార్ సీపీ కొత్త జిల్లాలకు పార్టీ కమిటీలపై దృష్టి పెట్టింది. త్వరలోనే జిల్లాలకు ప్రత్యేకంగా కమిటీలను నియమించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement