- ప్రధాన నిందితుడి తండ్రి బీఎస్పీ నేత
- బాధితురాలికి బెదిరింపు కాల్
- కాంగ్రెస్ నేత హస్తం ?
- సీపీకు ఫిర్యాదు చేసిన యువతి
- కామాంధులను ఎన్‌కౌంటర్ చేయాలంటూ విద్యార్థుల డిమాండ్
- నిందితుల కోసం ఇతర రాష్ట్రాల్లోనూ గాలింపు
బెంగళూరు : నగరంలో పీజీ యువతిపై సామూహిక అత్యాచారం చేసిన కామాంధులకు రాజకీయ నేతల అండదండలు పుష్కలంగా ఉన్నట్లు సమాచారం. అందుకే వారు చాకచక్యంగా తప్పించుకుంటున్నారని విద్యార్థులు విమర్శిస్తున్నారు. నిందితులను ఎన్‌కౌంటర్ చేయాలంటూ రాష్ర్ట వ్యాప్తంగా విద్యార్థులు బుధవారం ఆందోళన చేపట్టారు. మంగళూరు విశ్వవిద్యాలయంలో పీజీ చేస్తున్న ఆ యువతి వారం రోజులు సెలవులు రావడంతో బెంగళూరులో ఉన్న కుటుంబ సభ్యుల దగ్గరకు వచ్చిన సమయంలో ఈ ఘోరం జరిగింది.
కేసు తప్పుదోవ..: ఈ కేసులో ప్రధాన నిందితుడు నాసీర్ అహ్మద్ అలియాస్ హైదర్ (24) తండ్రి బహుద్దూర్ బహుజన సమాజ్‌వాది పార్టీ (బీఎస్‌పీ) ప్రముఖ నేత. ఆయన ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. దీంతో కేసు తప్పుదోవపట్టించడానికి పలువురు రాజకీయ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలున్నాయి. కేజీ హళ్ళి నివాసి వాసీం (25), మహ్మద్ ఆలీ (26), ఫ్రేజర్‌టౌన్ నివాసి ఆతీష్ (26), ఇమ్తియాజ్ (22) ఆ యువతిపై అత్యాచారం చేసినట్లు ప్రధాన నిందితుడు నాసీర్ అహ్మద్ తెలిపారు.
దీంతో పోలీసులు ఆ నలుగురి కోసం పక్క రాష్ట్రాల్లోనూ గాలిస్తున్నట్లు బెంగళూరు నగర అడిషనల్ పోలీసు కమిషనర్ శరత్‌చంద్ర బుధవారం తెలిపారు. నాసీర్ అహ్మద్‌పై గతంలోనే భారతీనగర పోలీస్ స్టేషన్‌లో అత్యాచారం కేసు నమోదైందని, మిగిలిన నిందితులపై ఏవైనా కేసులు ఉన్నాయా అని ఆరా తీస్తున్నామని చెప్పారు. నిందితులు అందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు పాత కార్లు విక్రయించే వ్యాపారం చేసేవారన్నారు.
బెదిరింపు ఫోన్.. : బెంగళూరు నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్‌ను బాధితురాలు, తన స్నేహితుడు బుధవారం సాయంత్రం కలుసుకున్నారు. సుమారు అరగంట సేపు మాట్లాడారు. తనకు గుర్తు తెలీని వ్యక్తులు ఫోన్ చేస్తున్నారని, కేసు ఉపసంహరించుకోకుంటే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని బాధితురాలు వాపోయినట్లు సమాచారం. కాగా అధికార పార్టీకి చెందిన ఓ నేతే ఇలా బెదిరిస్తున్నానే ఆరోపణలున్నాయి.
సీఐపై వేటు : యువతిపై అత్యాచారం కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇక్కడి పులకేశీనగర పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మహ్మద్ రఫీక్‌ను అధికారులు సస్పెండ్ చేశారు.