పీజీలు.. ఇక ఆటోడ్రైవర్లు
పర్మిట్ల కోసం పోస్టుగ్రాడ్యుయేట్ల దరఖాస్తులు
వారిబాటలోనే వేలాదిమంది గ్రాడ్యుయేట్లు
నిరుద్యోగ సమస్యే ప్రధాన కారణమంటున్న పరిశీలకులు
ప్రత్యామ్నాయ ఆదాయమార్గంగా
ఎంచుకుంటున్నారంటున్న ఆర్టీవో అధికారులు
సాక్షి, ముంబై:
‘హాయ్ సార్.. వేర్ షల్ యూ గో.. ’ అంటూ ఇకపై నగరంలోని ఆటో డ్రైవర్లు ప్రయాణికులతో ఇంగ్లీష్‌లో మాట్లాడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆటో పర్మిట్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 413 మంది పోస్ట్‌గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాకుండా డిగ్రీ చదివిన విద్యార్థులు కూడా ఆటో పర్మిట్ల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఆర్టీవో అధికారి ఒకరు వెల్లడించారు. వీరిలో సగం మంది నగరానికి చెందినవారితోపాటు శివారు ప్రాంతాలకు చెందిన వారు కూడా ఉన్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 70,861 ఆటో పర్మిట్లు జారీ చేయాల్సి ఉండగా వాటిలో 20,931 నగరానికి చెందినవే. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 1,75,349 మంది దరఖాస్తులు చేసుకోగా, 70,181 మంది నగరవాసులు దరఖాస్తు చేసిన వారిలో ఉన్నారు. ఇదిలా వుండగా రాష్ట్రవ్యాప్తంగా 413 మంది పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసినవారు ఆటో పర్మిట్ల కోసం దరఖాస్తు చేసుకోగా, 4,176 మంది డిగ్రీ పొందిన వారు దరఖాస్తు చేసుకున్నారు.
పోస్టుగ్రాడ్యుయేట్‌లలో 160 మంది నగరానికి చెందినవారు. వారిలో 76 మంది పశ్చిమ శివారు ప్రాంతానికి చెందినవారు ఉన్నారు. తూర్పు శివారు ప్రాంతాలకు చెందినవారు 24 మంది ఉన్నారు. ఠాణే నుంచి 17 మంది, వాషి నుంచి 16 మంది కల్యాణ్ నుంచి 15 మంది ఆటో పర్మిట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ముఖ్యంగా పుణే, ఔరంగాబాద్, షోలాపూర్‌ల నుంచి పోస్టుగ్రాడ్యుయేట్లు ఆటో పర్మిట్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారిలో అధికంగా ఉన్నారు. గ్రాడ్యుయేట్ల విషయానికి వస్తే.. నగరం నుంచి 2,122 మంది దరఖాస్తు చేసుకోగా, పశ్చిమ శివారు ప్రాంతాల నుంచి 898 మంది దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా తూర్పు శివారు ప్రాంతాల నుంచి 351 మంది దరఖాస్తు చేసుకున్నారు. కాగా, ఇందులో ఠాణే నుంచి 307, కల్యాణ్ నుంచి 210, వాషి నుంచి 156 మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఇదిలా వుండగా ఆటో పర్మిట్లను పొందేందుకు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అయితే ఒకవేళ తగినన్ని దరఖాస్తులు అందకపోతే కనీసం 8వ తరగతి అయినా ఉత్తీర్ణులైన వారు చేసుకున్న దరఖాస్తులను పరిశీలిస్తామని స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఎస్‌టీఏ) ఇటీవల పేర్కొంది. ఈ సందర్భంగా టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ ప్రొఫెసర్ శరత్ భౌమిక్ మాట్లాడుతూ.. ఉన్నత చదువులు చదువుకున్న విద్యార్థులు కూడా ఆటో పర్మిట్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయని పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగులు ఎక్కువగా ఉండడం ఇందుకు ప్రధాన కారణంగా తెలిపారు. ఈ రోజుల్లో డిగ్రీ చదివినా కూడా ఉద్యోగాలు లభించకపోవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు.కాగా, ఆర్టీవో అధికారులు మాట్లాడుతూ.. ప్రత్యామ్నాయ ఆదాయం ఆర్జించే ఉద్దేశంతో కూడా వీరు పర్మిట్లకోసం దరఖాస్తు చేసి ఉండవచ్చని భావిస్తున్నామన్నారు. పర్మిట్లను లీజ్‌కు ఇవ్వడం ద్వారా కూడా మంచి ఆదాయం ఆర్జించవచ్చని వారు అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా ఈ నెల 26వ తేదీన అంధేరి ఆర్టీవో ఆటో పర్మిట్ల కోసం ఆన్‌లైన్ లాటరీ విధానాన్ని నిర్వహించనుందని అధికారి తెలిపారు.