
పెళ్లి భోజనమెప్పుడు?
ప్రభు, సత్యరాజ్ లాంటి సీనియర్ నటులు సెట్‌లో ఉంటే అక్కడ వాతావరణం సందడి సందడిగా ఉంటుంది. మరో విషయం ఏమిటంటే వాళ్ల ఇంటి నుంచి ఘుమఘుమ లాడే రకరకాల వంటకాలతో కూడిన పసందైన భోజనం హాట్ క్యారియర్లలో వస్తుంటుంది. దాన్ని చిత్ర యూనిట్ అంతా కమ్మగా ఆరగిస్తుంటారు. తాజాగా ఇలాంటి రుచికరమైన సంఘటనే జరిగింది. యువ నటుడు జయం రవి నటిస్తున్న చిత్రం అప్పాటక్కర్. త్రిష, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ముఖ్య పాత్రల్లో ప్రభు, సత్యరాజ్‌లు నటిస్తున్నారు. సూరజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చెన్నైలో సాగుతోంది.
ఇటీవల నటుడు ప్రభు ఇంటి నుంచి పలు రకాల శాకాహారం, మాంసాహారం పసందైన వంటకాలతో కూడిన భోజనాలు వచ్చాయట. ఇవన్నీ యూనిట్‌సభ్యులు కలిసి పుష్టిగా ఆరగించినట్లు త్రిష తన ట్విట్టర్‌లో పేర్కొన్నారట. ప్రభుసార్ ఇంటి వంట ఎంత కమ్మగా ఉందో చేపల పులుసు, పీతల ఇగురు, కోడి కూర, అంటూ వివిధ రకాల వంటలు తలచుకుంటే ఇప్పుడు కూడా నోరూరుతున్నాయట అంటూ ట్విట్టర్‌లో పోస్టు చేశారట. ఇది తెలిసిన ప్రభు షూటింగ్ స్పాట్‌లో మరి నువ్వు వివాహ విందుఎప్పుడు ఇస్తావు అని అడిగారట. అందరి మధ్య ప్రభు సడన్‌గా అలా అడగడంతో కాస్త ఇబ్బందికి గురైన త్రిష ముఖానికి నవ్వు పులుముకుని అక్కడ నుంచి మెల్లగా జారుకుందట. మరి పెళ్లి గురించి ఎప్పుడు చెబుతుందో!