రిహార్సల్స్‌లో ప్రయోగ
రిహార్సల్స్ అన్నది ఒకప్పుడు షూటింగ్‌కు ముందుగా జరిగే మంచి విధానం. అదిప్పుడు దాదాపు తెరమరుగవుతున్న పద్ధతి. దర్శకుడు ఆర్.కన్నన్‌లాంటి అతి కొద్దిమంది తన చిత్ర నటీనటులకు అవసరం అనిపిస్తే రిహార్సల్స్ చేయిస్తుంటారు. ప్రస్తుతం నటి ప్రయోగ మార్టిన్‌తో ఆ దర్శకుడు అలాంటి రిహార్సల్స్ చేయిస్తున్నారు. ఆమెను తన తాజా చిత్రం పోడా ఆండవనే ఎన్‌పక్కం చిత్రంలో నాయికగా ఎంపిక చేశారు. ప్రయోగ పిశాచు చిత్రంలో చిన్న పాత్రల్లో మెరిసింది. అదే ఆమెనిప్పుడు హీరోయిన్ స్థాయికి చేర్చింది. దీంతో బాధ్యత పెరగడంతో ప్రయోగ నటనలోను, డాన్స్‌లోను రిహార్సల్స్ చేస్తోందట.
దీని గురించి మోడలింగ్ రంగం నుంచి వచ్చిన ఈమె తెలుపుతూ కన్నన్ చిత్రంలో నటించే పాత్ర కోసం సంభాషణల ఉచ్ఛరణ, శారీరక భాష తదితర విషయాలు దర్శకుడి సహకారం చాలా హెల్ప్ అవుతోందని చెప్పింది. డాన్స్ విషయంలో నృత్యదర్శకులు కల్యాణ్, బృందాల వద్ద శిక్షణ పొందుతున్నట్లు తెలిపింది. పోడా ఆండవనే ఎన్ పక్కం చిత్రం నగర నేపథ్యంలో సాగే కథ అయినా తన పాత్రలో నటనకు చాలా అవకాశం ఉంటుందంది. ఇది చాలా హోమ్లీ పాత్ర అని అంది. పిశాచు చిత్రంలో చిన్న పాత్ర అయినా చాలా గుర్తింపును తెచ్చిపెట్టిందని, తాజా చిత్రంలో మరింత పేరు తెచ్చుకుంటానని ప్రయోగ అంటోంది.