మళ్లీ వస్తున్నా..!
హీరోయన్ల పరిచయం చేయడానికి పెట్టింది పేరు మాలీవుడ్ అంటారు. అక్కడ నుంచి ఇతర భాషలకు తారలు విస్తరిస్తుంటారు. నయనతార లాంటి అగ్రతారల పుట్టినిల్లు మలయాళ సినిమానేనన్నది తెలిసిందే. అంతే కాదు దక్షిణాదిని చుట్టేస్తున్న యువ హీరోయిన్లలో చాలా మందికి కేరాఫ్ మాలీవుడ్డే. వీరంతా ఇతర భాషల్లో నటిస్తున్నా కోలీవుడ్‌ను ప్రత్యేకంగా చూస్తారు.
తమిళ చిత్రాల్లో నటించడానికి ఆసక్తి చూపుతుంటారు. యువ నటి ప్రయాగ మార్టిన్ అదే కోరుకుంటున్నారు. పిశాచు చిత్రం పేరు చెబితే టక్కున గుర్తొచ్చే నటి ప్రయాగ. అదే ఈ మాలీవుడ్ అమ్మడికి తొలి తమిళ చిత్రం. ఆ తరువాత ఇక్కడ కనిపించకపోయినా మలయాళ, కన్నడ భాషల్లో నటిస్తూ బిజీగానే ఉన్నారు. అయితే త్వరలో వరుస చిత్రాలతో కోలీవుడ్‌కు రానున్నట్లు ప్రయాగ చెప్పారు. ఈ అమ్మడు ఏమంటున్నారో చూద్దాం. హద్దులు లేని ప్రేమ, అభిమానాలు కలిగిన వారు
‘తమిళ ప్రజలు.. చాలా కాలం క్రితం పిశాచు చిత్రంలో నటించినా, ఇప్పటికీ నన్ను గుర్తించుకున్నారని తెలిసి చాలా భావోద్వేగానికి గురయ్యాను. అందుకు కారణం అయిన పిశాచు చిత్ర దర్శకుడు మిష్కిన్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రస్తుతం మలయాళం, కన్నడం చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాను. మలయాళంలో సురేశ్‌గోపి వారసుడు గోకుల్ సురేశ్‌కు జంటగా ఉల్టా అనే చిత్రంలో నటించాను.
షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం జూలైలో తెరపైకి రానుంది. అదే విధంగా పృథ్వీరాజ్‌తో నటించిన బ్రదర్స్ డే చిత్ర విడుదల కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ చిత్రం ఓనం పండగ సందర్భంగా తెరపైకి రానుంది. ఇకపోతే కన్నడంలో గోల్డెన్‌స్టార్ గణేశ్‌కుమార్ సరసన గీత అనే చిత్రంలో నటిస్తున్నాను. ఇది కన్నడ సినీ పరిశ్రమలో భారీ చిత్రంగా తెరకెక్కుతోంది.
కోల్‌కతా, సిమ్లా, పంజాబ్, బెంగళూర్ వంటి సుందరమైన ప్రాంతాల్లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. నాకు తమిళ సినిమా అంటే ప్రత్యేక గౌరవం. కారణం ఒకటని చెప్పలేను. మంచి కథా చిత్రాలను అందించడంతో పాటు, తమ ఆత్మాభిమానానికి భంగం కలగకుండా, నేటివిటీని కోల్పోకుండా అంతర్జాతీయ స్థాయి చిత్రాలను అందించడం వరకూ తమిళసినిమా ప్రత్యేకం.
అలాంటి కోలీవుడ్‌లో పలు వైవిధ్యభరిత కథా పాత్రల్లో నటించాలని ఆశిస్తున్నాను. ప్రస్తుతం చాలా కథలు వింటున్నారు. త్వరలోనే వరుసగా నా చిత్రాల గురించి వివరాలు వెలువడనున్నాయి’ అని నటి ప్రయాగ మార్టిన్ చెప్పుకొచ్చారు.