నరేంద్ర మోడీ ప్రధాని అయ్యే ప్రసక్తే లేదు
- ముఖ్యమంత్రి సిద్దరామయ్య
గంగావతి, న్యూస్‌లైన్ : నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యే ప్రసక్తే లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య జోష్యం చెప్పారు. ఆయన శనివారం స్థానిక క్రీడా మైదానం ఆవరణంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఎన్నికల బహిరంగ సభనుద్దేశించి మాట్లాడారు. నరేంద్రమోడీ గుజరాత్‌లో 13 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పాలన సాగిస్తున్నాడని, అయినా ఆ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదన్నారు.
మానవ అభివృద్ధి దృష్ట్యా గుజరాత్ 9వ స్థానంలో ఉందని, మనిషి సగటు అభివృద్దిని పరిశీలిస్తే 12వ స్థానంలో ఉందని చెప్పారు. పౌష్టికాహారం కొరత ఉన్నవారు 55 శాతం మంది ఉన్నారన్నారు. ఒకటవ తర గతి విద్యాభ్యానికి స్వస్తి పలికి బడులు మానుకున్న పిల్లలు 60 శాతం మంది ఆ రాష్ట్రంలో ఉన్నారని విమర్శించారు. నరేంద్రమోడీ అపద్దాలను ప్రచారం చేస్తూ దేశంలో సంచరిస్తున్నారని విమర్శించారు.
ఆయన కర్ణాటక రాష్ట్రానికి నాలుగు సార్లు పర్యటించినపుడు ఆయన కుడి ఎడమ వైపు అవినీతి పరులను పెట్టుకొని తాను ఉపన్యసిస్తూ అవినీతిని అంతమొందిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన అవినీతిలో కూరుకుపోయి జైలుపాలు అయిన యడ్యూరప్ప, కట్ట సుబ్రమణ్యం నాయుడు, సదానందగౌడ, జగదీశెట్టర్‌లాంటి అవినీతిపరులతో ప్రచారం చేపట్టడం విచారకరమన్నారు. ఆయన సభలో పాల్గొన్న మాజీ ఉపముఖ్యమంత్రి ఈశ్వరప్ప ఇంట్లో దొంగనోట్లను ముద్రించే రెండు యంత్రాలను లోకాయుక్త స్వాధీనం చేసుకోవడం ప్రజలకు తెలుసన్నారు.
కాంగ్రెస్ పార్టీ సర్వధర్మాలను పరిగణలోకి తీసుకొని వారికి సముచితమైన న్యాయాన్ని కల్పించే ఏకైక పార్టీ అన్నారు. బీజేపీ ఒకే ధర్మం, ఒకే సంస్కృతి, ఒక్కరే నాయకుడన్న ధోరణులతో దేశాన్ని పాలించగలదా? అని ప్రశ్నించారు. బీజేపీ నేతృత్వంలో ఈ రాష్ట్రాన్ని లూటీ చేసి సిద్దరామయ్య ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని విమర్శలు చేయడం సరికాదన్నారు.
తమ పాలనలో పేద ప్రజలకు రుణాలను మాఫీ చేయడం, అలాగే పక్కా ఇళ్ల రుణాలను మాఫీ చేయడం జరిగిందన్నారు. రూ.2.10 కోట్లను రాష్ట్రంలో పాలఉత్పత్తి దారులకు సహాయధనాన్ని అందిస్తున్నామన్నారు. కోటి 5 లక్షల మంది పిల్లలకు వారంలో మూడు రోజులకు ఒకసారి 150 మిల్లిలీటర్ల పాలు అందిస్తున్నామన్నారు. రైతులకు రూ.3 లక్షల వడ్డీ లేని రుణాలను, రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు మూడు శాతం వడ్డీతో రుణసౌకర్యం కల్పించామన్నారు.
ఆర్టికల్-371 కు సంబంధించి రూ.1630 కోట్ల ప్రత్యేక గ్రాంట్‌ను కేంద్రప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. కొప్పళ్ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన బసవరాజ్ హిట్నాళ్‌కు మీ ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ వేదికపై కేంద్ర మాజీ మంత్రి సీఎం.ఇబ్రహీం, యలబుర్గా ఎమ్మెల్యే బసవరాజ రాయరెడ్డి, రాష్ట్ర చిన్ననీటిపారుదల శాఖ మంత్రి శివరాజ్ తంగడిగి, మాజీ సభాపతి వీరణ్ణ మత్తికట్టి, మాజీ ఎమ్మెల్సీ హెచ్‌ఆర్ శ్రీనాథ్, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్, సిరుగుప్ప ఎమ్మెల్యే బీఎం నాగరాజు, కొప్పళ ఎమ్మెల్యే రాఘవేంద్ర హిట్నాళ్, మాజీ మంత్రులు మల్లికార్జున నాగప్ప, సాలోణి నాగప్ప, కొప్పళ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన బసవరాజ్ హిట్నాళ్, పార్టీ కనకగిరి బ్లాక్ అధ్యక్షుడు రెడ్డిశ్రీనివాస్, గంగావతి బ్లాక్ అధ్యక్షులు హనుమంతప్ప నాయక్, జిల్లా పంచాయితీ అధ్యక్షులు పీ. జనార్దన్, గంగావతి తాలూకా పంచాయితీ అధ్యక్షులు రాజేశ్వరి సురేష్, తదితరులు పాల్గొన్నారు.