సమస్యల్లో సినిమా
రెండు గంటల్లో ముగిసిపోయే సినిమా రూపకల్పనకు దాని స్థాయిని బట్టి రెండు నెలల నుంచి రెండేళ్లవరకు పట్టవచ్చు. అలాంటి సినిమా ఎన్నో పురుటి నొప్పులను ఎదుర్కొని తెరమీదకు రావాలి. కొన్ని పురిటిలోనే ఆగిపోతాయన్నది వేరే సంగతి. ప్రస్తుతం కొన్ని భారీ చిత్రాలతోపాటు చిన్న చిత్రాల నిర్మాణంలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకుందాం.
లింగా: సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం లింగా. అందాలతార అనుష్క, ముంబాయి భామ సోనాక్షి సిన్హా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ను కర్ణాటకలో షియోగా జిల్లా, సాగర్ తాలుకాలోని లింగాన్ మాక్కిడ్యాం సమీపంలో నిర్వహిసుతన్నారు. అయితే స్థానిక సమస్యల కారణంగా ఆ ప్రాంత ప్రజలు షూటింగ్ నిలిపివేయూలని డిమాండ్ చేస్తున్నారు.
కత్తి : ప్రస్తుతం కోలీవుడ్‌లో ప్రముఖ యువ కథా నాయకుడిగా వెలుగొందుతున్న విజయ్ నటిస్తున్న చిత్రం కత్తి. ఈ చిత్రంలో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారు. సమంత కథా నాయకి. ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లైక్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సంస్థ అధినేత శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేకు సన్నిహితుడని, అందువల్ల చిత్ర విడుదలను అడ్డుకుంటామని తమిళ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. దీంతో కత్తి చిత్రం సమస్యల్లో పడింది. చిత్ర నాయకుడు విజయ్, దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ తమిళుల వ్యతిరేకతకు గురవుతున్నారు. ఈ చిత్ర నిర్మాణం చేతులు మారనున్నట్లు సమాచారం.
పులి పార్వై : తాజాగా తమిళుల తీవ్ర వ్యతిరేకతను చవిచూస్తున్న చిత్రం పులిపార్వై. ఇది శ్రీలంక తమిళుల కోసం పోరాడిన ఎల్‌టీటీఈ నేత ప్రభాకరన్ కొడుకు బాలచంద్రన్ ఇతివృత్తంతో రూపొందించిన చిత్రం. ఎస్.ఆర్.ఎం సంస్థల అధినేత పారివేందర్ నిర్మించిన ఈ చిత్రంలో ఎల్‌టీటీఈల యుద్ధాన్నే తప్పుపట్టే విధంగా సన్నివేశాలు చోటు చేసుకున్నాయని తమిళ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో చిక్కుల్లో పడ్డ చిత్ర దర్శక నిర్మాతలు సెన్సార్ పూర్తి చేసుకున్నా పులిపార్వై చిత్రానికి చేర్పులు మార్పులు చేసే పనిలో పడ్డారు.
పాపనాశం: పాపనాశం చిత్రానికి ఆదిలోనే సమస్యలు చుట్టుముట్టాయి. ఇది ప్రఖ్యాత నటుడు కమల్‌హాసన్ ఇష్టపడి మరీ నటిస్తున్న చిత్రం మలయాళంలో దృశ్యంగా తెరకెక్కి విజయ దుందుభి మోగించిన చిత్రం. మోహన్‌లాల్, మీనా జంటగా నటించిన చిత్రానికి తమిళంలో సమస్యలెదురయ్యాయి. మోహన్‌లాల్ పాత్రలో కమల్‌హాసన్ పోషిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఆ చిత్ర కథ తనదంటూ కేరళ దర్శకుడు సతీష్ పాల్ ఎర్నాకులం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారించిన న్యాయమూర్తులుతమిళ రీమేక్‌పై తాత్కాలిక స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కమల్‌హాసన్ పాపనాశం చిత్ర నిర్మాణం సమస్యల్లో చిక్కుకుంది.