ప్రాజెక్టు ‘కనికట్టు’! | Project 'compassion'! | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టు ‘కనికట్టు’!

Published Mon, Oct 28 2013 2:24 AM | Last Updated on Sat, Sep 2 2017 12:02 AM

Project 'compassion'!

సాక్షి ప్రతినిధి, అనంతపురం: సమైక్యాంధ్ర పోరాటానికి చుక్కానిలా నిలుస్తోన్న అనంతపురం జిల్లాలో ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కిరణ్ సర్కారు కుట్ర పన్నుతోందా? ఉద్యమంలో కీలక భూమిక పోషిస్తోన్న రైతులను కనికట్టు చేసేందుకు పూనుకుందా? సేద్యాన్ని లాభసాటిగా మార్చేందుకు ఉద్దేశించిన ‘ప్రాజెక్టు అనంత’కు నిధులు మంజూరు చేయడం మాట పక్కన పెట్టి.. అమలు కోసమంటూ రిటైర్డు ఐఏఎస్ అధికారి చంద్రమౌళిని ప్రత్యేకాధికారిగా నియమించడం అందులో భాగమేనా?.. ఈ  ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నారు వ్యవసాయ శాఖ అధికారులు, సమైక్యవాదులు.

రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ), యూపీఏ పక్షాలు జూలై 30న తీర్మానం చేసిన తక్షణమే ‘అనంత’లో సమైక్యాంధ్ర ఉద్యమం పురుడుపోసుకున్న విషయం విదితమే. ఈ ఉద్యమం దావానంలా సీమాంధ్ర అంతటా వ్యాపించింది. ఉద్యమానికి ‘అనంత’ మార్గనిర్దేశనం చేస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కిరణ్ సర్కారు పూనుకుంది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు సమ్మెను తాత్కాలికంగా విరమించినా.. జిల్లాలో మాత్రం ఉద్యమ వేడి ఏమాత్రమూ తగ్గలేదు.

రైతులు, కూలీలు, ఇతర అన్ని వర్గాల ప్రజలు ఉద్యమానికి దన్నుగా నిలుస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర నిఘా సంస్థలు కూడా ఇదే అంశాన్ని స్పష్టీకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు, వ్యవసాయ కూలీలను కూడా ఉద్యమం నుంచి తప్పించడానికి ప్రభుత్వం ఉత్తుత్తి తాయిలాలను ఎరగా వేస్తోంది. ‘ప్రాజెక్టు అనంత’ అమలు కోసం ప్రత్యేకాధికారిగా రిటైర్డు ఐఏఎస్ చంద్రమౌళిని  హడావుడిగా నియమించడమే ఇందుకు నిదర్శనం.
 
నిధుల్లేని ‘ప్రాజెక్టు అనంత’

దుర్భిక్ష ‘అనంత’లో సేద్యాన్ని లాభసాటిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు  కేంద్రం వ్యవసాయ శాస్త్రవేత్తలతో ఓ అత్యున్నత సాంకేతిక కమిటీని నియమించింది. ఈ కమిటీ రెండు పర్యాయాలు జిల్లాలో పర్యటించి... ఓ నివేదికను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు అందించింది. ఈ నివేదిక అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం ఓ ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రణాళిక పేరును ‘ప్రాజెక్టు అనంత’గా పెట్టారు. ఈ ప్రాజెక్టు అమలుకు రూ.7,676 కోట్లు అవసరమని జిల్లా అధికారులు తేల్చారు. కానీ.. ఆ మేరకు నిధులు మంజూరు చేయలేమని రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది.

చేసేదిలేక రాష్ట్ర రెవెన్యూమంత్రి ఎన్.రఘువీరారెడ్డి కేంద్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్ అహ్లూవాలియాను కలిసి.. ‘ప్రాజెక్టు అనంత’కు నిధులు కేటాయించాలని కోరారు. అందుకు అహ్లూవాలియా అంగీకరించలేదు. దాంతో శాఖాపరంగా మంజూరయ్యే నిధులను ‘ప్రాజెక్టు అనంత’కు మళ్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. వ్యవసాయ, ఉద్యాన, సూక్ష్మనీటిపారుదల, పశుసంవర్ధక, పట్టు, మత్స్యశాఖలకు శాఖాపరంగా ఐదేళ్లలో రూ.4,387 కోట్లు మంజూరవుతాయని లెక్కకట్టిన సర్కారు.. తక్కిన రూ.3,282 కోట్లను సమీకరించే ప్రయత్నాలు చేస్తామని తెలిపింది. అయితే.. శాఖాపరంగా మంజూరయ్యే నిధులను మళ్లించలేమంటూ అధికారులు ఇప్పటికే సర్కారుకు తెగేసి చెప్పారు.
 
అమలుకు ప్రత్యేకాధికారా?

‘ప్రాజెక్టు అనంత’ అమలు కోసమంటూ రిటైర్డు ఐఏఎస్ అధికారి చంద్రమౌళిని ప్రత్యేకాధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులను సమన్వయపరచి.. ‘ప్రాజెక్టు అనంత’ను అమలు చేసే బాధ్యతను అప్పగించింది. అసలు నిధులే లేని ప్రాజెక్టు అమలుకు ఏకంగా రిటైర్డు ఐఏఎస్ అధికారిని ప్రత్యేకాధికారిగా నియమించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సమైక్యాంధ్ర ఉద్యమంలో అగ్రపథాన సాగుతోన్న ‘అనంత’ రైతన్నలను, వ్యవసాయ కూలీలను దారి మళ్లించేందుకే ఈ రకమైన ఎత్తుగడలు వేసినట్లు వ్యవసాయశాఖ అధికారులు స్పష్టీకరిస్తున్నారు. లేని తాయిలాలను ఎరగా వేసి.. ఉద్యమాన్ని నీరుగార్చాలన్న లక్ష్యంతోనే కిరణ్ సర్కారు ఈ వ్యూహం రచించినట్లు సమైక్యవాదులు మండిపడుతున్నారు. నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ‘ప్రాజెక్టు అనంత’ అమలుకు తక్షణమే నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement