చెత్త సమరం | protest aganist BBMP | Sakshi
Sakshi News home page

చెత్త సమరం

Published Thu, Jun 18 2015 4:46 AM | Last Updated on Sun, Sep 3 2017 3:53 AM

చెత్త సమరం

చెత్త సమరం

- బీబీఎంపీకి వ్యతిరేకంగా పోరాటం
- రాత్రంతా రోడ్డుపైనే గడిపిన గ్రామీణులు
- టెర్రాఫార్మా మూయాల్సిందేనని పట్టు  
- బారులు తీరిన చెత్త వాహనాలు
దొడ్డబళ్లాపురం:
బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) పరిధిలోని చెత్త డంపింగ్‌పై వివాదం మళ్లీ చెలరేగింది. దొడ్డబళ్లాపురం తాలూకాలోని గుండ్లహళ్లి వద్ద ఉన్న టెర్రాఫార్మా డంపింగ్ సెంటర్‌కు కొన్ని సంవత్సరాలుగా బీబీఎంపీ చెత్తను తరలిస్తున్నారు. ఇక్కడ పోగవుతున్న చెత్తను ఎరువగా మారుస్తుంటారు. వాస్తవానికి 150 ఎకరాల్లో విస్తరించి ఉన్న టెర్రాఫార్మాలోని యంత్రాలతో ఒక రోజుకు 20 టన్నుల చెత్త నుంచి మాత్రమే ఎరువులను చేయగలిగే సామర్థ్యం ఉంది. అయితే ఇందుకు భిన్నంగా రోజుకు వంద టన్నుల మేర చెత్తను బీబీఎంపీ అధికారులు తరలిస్తున్నారు. దీంతో టెర్రాఫార్మ చుట్టుపక్కల ఉన్న 25 గ్రామాల ప్రజలకు ఇక్కట్లు మొదలయ్యాయి. దీంతో ఏడు సంవత్సరాల క్రితమే స్థానికులు దీనిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. చెత్త మురిగిపోవడంతో ఆ ప్రాంతంలో దుర్గంధం వ్యాపిస్తోందని, అపరిశుభ్రత పెరిగి ఈగలు వృద్ధి చెందడం వల్ల అనారోగ్యం పాలవుతున్నామంటూ స్థానికులు అప్పట్లో పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టారు.

దీనిపై బీబీఎంపీ అధికారుల్లో గాని, పాలకుల్లో గాని ఎలాంటి స్పందన లేకపోవడంతో రెండేళ్ల క్రితం ఈ ఉద్యమం తీవ్రతరమైంది. అదే సమయంలో మండూరు దగ్గర ఉన్న డంపింగ్ యార్డ్ పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం చేపట్టడంతో అక్కడ డంప్ చేసే చెత్తను టెర్రాఫార్మాకు అధికారులు మళ్లించారు. దీంతో ఒక రోజుకు రెండు వందల టన్నులకు పైగా చెత్త టెర్రాఫార్మాకు చేరుతూ వచ్చింది. దీంతో 25 గ్రామాలకు చెందిన ప్రజలు మరోసారి ఉద్యమ బాట పట్టారు. మంగళవారం మధ్యాహ్నం హఠాత్తుగా బీబీఎంపీ చెత్త లారీలను అడ్డగించి ధర్నా చేపట్టారు. దీంతో 200 బీబీఎంపీ చెత్త లారీలు దాబస్‌పేట, తుమకూరు రోడ్డుపైనే నిలిచిపోయాయి.

దుర్గంధం, దోమలు, ఈగల బెడద వల్ల రోగాలు ప్రబలుతుండడంతో చాలా మంది గ్రామాలను వదలాల్సిన పరిస్థితి నెలకొంది. మంగళవారం మొదలైన ఆందోళన బుధవారం కూడా కొనసాగింది. రాత్రి మొత్తం గ్రామీణులు రోడ్డుపైనే ఉంటూ చెత్త వాహనాలను టెర్రాఫార్మాలోకి అనుమతించకుండా అడ్డుకున్నారు. అక్కడే వంట వండుకుని రోడ్డుపైనే భోజనం చేశారు. చెత్త డంపింగ్‌ను పూర్తిగా నిలిపి వేసేవరకు అక్కడి నుంచి కదలబోమంటూ భీష్మించారు. మరో వైపు బెంగళూరు నుంచి ప్రతి ఐదు నిమిషాలకో చెత్త వాహనం వస్తుండడంతో చూస్తుండగానే కిలోమీటర్ల మేర ఆ వాహనాలు నిలిచిపోయాయి. బీబీఎంపీ అధికారులు వచ్చి ఇకపై చెత్త తరలించమని హామీ ఇచ్చేవరకూ ఇక్కడి నుండి కదిలే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు మొహరించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement