Garbage dumping
-
బల్దియాల్లో చెత్త సమస్య
సాక్షి, పెద్దపల్లి: జిల్లాలో పట్టణీకరణ అంతకంతకూ పెరిగిపోతోంది. జనాభా, ఆధునిక జీవనశైలికి తగినట్లు బల్దియాల్లో వాతావరణ పరిస్థితులను మార్చాలంటే అది వందశాతం పారిశుధ్యం నుంచే మొదలుకావాలి. పట్టణాల్లో జనాభా ఏటా పెరిగిపోతుండగా.. నిత్యం టన్నుల కొద్దీ చెత్త వెలువడుతోంది. అయితే ఆ చెత్తను డంప్ చేయడానికి మాత్రం రామగుండం, మంథనిలో స్థలాలు లేవు. ఫలితంగా గోదావరి ఒడ్డున, రోడ్డుపైనే పోస్తున్నారు. జిల్లాలోని బల్దియాల్లో చెత్తను నిర్ణీత విధానంలో రీసైక్లింగ్ చేయకపోవడంతో డంపింగ్‌యార్డుల్లో టన్నుల కొద్దీ పేరుకుపోతోంది. ప్రభుత్వం నూతన మున్సిపాలిటీ చట్టం తెచ్చినప్పటికీ.. పట్టణాల్లో నిత్యం వెలువడే చెత్తను రీసైక్లింగ్ చేసి పర్యావరణానికి మేలు జరిగేలా ఎరువుల తయారీ చేపట్టకపోవడంతో సమస్య రోజురోజుకూ పెరిగిపోతోంది. జిల్లావ్యాప్తంగా బల్దియాల్లో రీసైక్లింగ్ చర్యలు అరకొరగానే సాగుతున్నాయి. గాడి తప్పిన తడి, పొడి చెత్త ప్రక్రియ.. నిత్యం ఇంటింటికీ తిరిగి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలి. తడిచెత్త ద్వారా ఎరువు, పొడిచెత్త ద్వారా కార్మికులు ఆదాయం పొందవచ్చు. తడి, పొడి చెత్త వేరు చేసే ప్రక్రియ రామగుండం కార్పొరేషన్ పరిధిలో కాగితాలకే పరిమితం అవుతోంది. స్వచ్ఛ సర్వేక్షణ్ తడి, పొడిచెత్త నిర్వహణతోపాటు బహిరంగ మల, మూత్ర విసర్జన, మురుగు నిర్వహణ కూడా కీలకం. కేవలం పొడి చెత్త నిర్వహణ చేపడుతున్న అధికారులు.. తడి చెత్తపై చేతులెత్తేశారు. తడి చెత్తతో కంపోస్టు ఎరువు తయారు చేయడానికి అవసరమైన అన్ని వనరులూ ఉన్నప్పటికీ.. ఆ దిశగా అడుగులు మాత్రం ముందుకుపడటం లేదు. తడి చెత్తతో ఎరువులను తయారు చేసి నర్సరీలకు వాడుతున్నట్లు తప్పుడు నివేదికలు తయారు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తడి చెత్త నుంచి సేంద్రియ ఎరువు తయారీ చేసేందుకు గౌతమినగర్, ఎన్టీఆర్నగర్, జ్యోతినగర్‌లో షెడ్ల నిర్మాణం చేపట్టినప్పటికీ, అవి వినియోగానికి నోచుకోలేదు. రెండేళ్ల క్రితం ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించారు. సేంద్రియ ఎరువు తయారీ కేంద్రాలను నిర్వహించి కొంత ఫలితం సాధించారు. తర్వాత ఈ ప్రక్రియ నిర్వహణ పూర్తిగా గాడి తప్పింది. రామగుండంతోపాటు జిల్లాలో ఉన్న పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీల్లో వాహనాల్లో ఇంటింటికి తిరిగి చెత్తను సేకరిస్తున్నారు. నేరుగా డంపింగ్ యార్డులకు తరలించి చేతులు దులుపుకుంటున్నారు. రీసైక్లింగ్ ప్రక్రియను పట్టించుకోకపోవడంతో చెత్త గుట్టలుగా పేరుకుపోతోంది. ఆ చెత్త కుప్పలను కాల్చడంతో పొగ కాలుష్యంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే విషయమై మున్సిపల్ కమిషనర్లను వివరణ కోరగా.. డంపింగ్ యార్డుల స్థలసేకరణకు సింగరేణికి లేఖ రాశామని చెప్పారు. తడి, పొడి చెత్త సేకరణ, సెగ్రిగేషన్ షెడ్ల వినియోగంపై వివరణ కోరగా.. చెత్తద్వారా ఆదాయం పొందేలా, షెడ్లను పూర్తిస్థాయిలో వినియోగించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రోడ్డుపైనే పారబోత ఈ చిత్రంలో రోడ్డుపక్కనే చెత్త డంపింగ్ చేసి కనిపిస్తున్నది మంథని మున్సిపాలిటీలోనిది. మంథని మున్సిపాలిటీగా రూపాంతరం చెందినప్పటికీ డంపింగ్‌యార్డు లేకపోవడంతో ప్రతిరోజూ సేకరించే సుమారు 18 టన్నుల చెత్తను మంథని–కాటారం రహదారి వెంబడి.. పట్టణ శివారులో డంప్ చేస్తున్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించకుండా అంతా కలిపేస్తుండడం.. అనంతరం కాల్చివేయటం పరిపాటిగా మారింది. దీంతో పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
'చెత్త' పనికి పరిహారం కట్టిన టీమిండియా మాజీ క్రికెటర్
పనాజీ: నిర్లక్ష్యంగా రోడ్డుపై చెత్త పడేసినందుకు గాను టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత అజయ్ జడేజా రూ.5 వేల జరిమానా కట్టాడు. నార్త్ గోవాలోని అల్డోనా గ్రామంలో విలాసవంతమైన భవనంలో నివాసముండే ఈ మాజీ క్రికెటర్.. తన పక్కనే ఉన్న నచినోలా అనే గ్రామంలో చెత్త పడేయటాన్ని గ్రామస్తులు గుర్తించారు. దీంతో అతనికి జరిమానాను విధించడంతో పాటు మరోసారి చెత్త వేయవద్దని హెచ్చరించారు. గ్రామ పంచాయతీ ఆదేశాల మేరకు తప్పును ఒప్పుకున్న జడేజా జరిమానా కట్టి, మరోసారి ఈ 'చెత్త' పని చేయనని అంగీకరించాడు. ఈ విషయాన్ని నచినోలా గ్రామ సర్పంచ్ తృప్తి బండోద్కర్ మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా గ్రామ్ సర్పంచ్ మాట్లాడుతూ.. జడేజా లాంటి పాపులర్ క్రికెటర్ తమ పరిసరాల్లో ఉంటుంన్నందుకు చాలా గర్వంగా ఉందన్నాడు. అయితే ఎంతటి సెలబ్రిటీ అయినా పారిశుద్ధ్య నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేనని చెప్పుకొచ్చాడు. కాగా, గోవాలోని అల్డోనా గ్రామ పంచాయతీ చాలా మంది సెలబ్రిటీలకు సెకండ్ హోమ్‌గా ఉంది. అజయ్ జడేజా, అమితావ్ ఘోష్ లాంటి పలువురు ప్రముఖులు అక్కడే భవనాలు కొనుగోలు చేసి ప్రకృతిని ఆస్వాధిస్తూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. ఇదిలా ఉంటే, భారత్ జట్టులోకి 1992లో అరంగేట్రం చేసిన అజయ్ జడేజా 15 టెస్టులు, 196 వన్డే మ్యాచ్‌లు ఆడి, 6 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీల సాయంతో దాదాపు 6000 పరుగులు సాధించాడు. టీమిండియా డాషింగ్ బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ గుజరాత్ ఆటగాడు.. 2000లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం క్రికెట్ వ్యాఖ్యాతగా కొనసాగుతున్నాడు. చదవండి: డోపింగ్ టెస్ట్‌లో పట్టుబడ్డ మహిళా క్రికెటర్.. -
మహిళ ప్రాణం తీసిన ‘చెత్త’ పనులు..!
సాక్షి, సంగారెడ్డి: నారాయణ్ ఖేడ్ మున్సిపల్ అధికారుల నిర్వాకం ఓ మహిళ మృతికి కారణమైంది. ఇంటిపన్ను కట్టలేదని ఓ ఇంటి ముందు నారాయణ్ ఖేడ్ పురపాలక సంఘం అధికారులు నాలుగు రోజుల క్రితం చెత్త వేశారు. దీంతో ఇంటి యజమానురాలు భూమవ్వ (58) తీవ్ర మనస్తాపం చెందారు. ఈరోజు (ఆదివారం) ఉదయం గుండె నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన సంగారెడ్డిలోని ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. జోగిపేట్ వద్దకు చేరుకోగానే ఆరోగ్య పరిస్థితి విషమించి ఆమె ప్రాణాలు విడిచింది. అధికారుల మితిమీరిన చర్యల వల్లే భూమవ్వ చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, స్థానికుల కథనం మాత్రం భిన్నంగా ఉంది. ఈనెల 15 న భూమవ్వ ఇంటి ముందు చెత్త వేసిన మున్సిపల్ అధికారులు 17న తొలగించారని వారు తెలిపారు. -
రోడ్డుపై చెత్త వేసిన టీచర్‌కు రూ. 5వేల జరిమానా
శంషాబాద్ రూరల్ : రోడ్డుపై చెత్త వేసిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి పంచాయతీ అధికారులు రూ. 5వేల జరిమానా వేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా నర్కూడలో జరిగింది. నర్కూడ గ్రామ పంచాయతీ పరిధిలోని రోడ్డుపై ఉదయం చెత్తను గమనించిన ఆ గ్రామ సర్పంచ్ సిద్దులు, పంచాయతీ కార్యదర్శి శివప్రసాద్ ఈ విషయమై ఆరా తీశారు. అక్కడి చెత్త కాగితాల్లో ఒక ప్రభుత్వ టీచర్‌కు పోస్ట ల్ బ్యాలెట్ పేపరు, పాత చెక్కులు, ఐడీ కార్డులు వారికి లభించాయి. ఫోన్ నంబర్ ఆధారంగా ఆ వ్యక్తిని నాగోల్‌కు చెందిన మల్లారెడ్డిగా గుర్తించి ఆయనను పిలిపించి జరిమానా విధించారు. -
ట్రాష్‌ట్యాగ్ చాలెంజ్‌కు సిద్ధమా?
ఎవరైనా చెత్తకుప్ప మధ్యలో కూర్చుని ఫొటోకి పోజిస్తారా? ఛీ ఛీ అంటూ ముక్కుమూసుకొని పారిపోతారు. కానీ అమెరికాలో వేలంవెర్రిగా వేలాదిగా కుర్రకారు చెత్తకుప్పల్లో ఫొటోలు దిగి ఫేస్బుక్లో పెట్టేస్తున్నారు. ఫేస్బుక్లో యువతరం విసురుతున్న పిచ్చి చాలెంజ్‌లు ఎన్నెన్నో. బట్టలు శుభ్రంచేసేందుకు వాడే డిటర్జెంట్ ద్రవాన్ని తాగమనో, ఏకబిగిన ఒక గ్యాలన్(దాదాపు 4లీటర్ల) పాలు తాగాలనో, చెంచాడు దాల్చిన చెక్క పొడిని మింగాలనో ఇలా పిచ్చి చాలెంజ్లెన్నో సోషల్‌మీడియాలో పెరిగిపోయాయి. అయితే కొత్తగా వచ్చిన ట్రాష్‌ట్యాగ్ చాలెంజ్‌కు వీటితో సంబంధమే లేదు. పూర్తి భిన్నం. యువతరానికి సామాజిక బాధ్యతను గుర్తుచేసే సరికొత్త ఆలోచనే ట్రాష్‌ట్యాగ్ చాలెంజ్. మొట్టమొదటిగా బైరాన్ రోమన్ అనే వ్యక్తి మార్చి 5న చెత్తలో కూర్చుని ఉన్న ఒక వ్యక్తి ఫొటో ఫేస్బుక్లో పెట్టాడు. తర్వాత ఆ చెత్తనంతా శుభ్రంగా సంచుల్లోకి ఎత్తి అదే చోట వాటితో దిగిన మరో ఫొటోను ఫేస్బుక్లో పెట్టాడు. ఫేస్బుక్ ఖాతాలో ఫొటోలు పెట్టి ‘బోర్‌గా ఫీలవుతున్నారా? అయితే మీకోసం సరికొత్త చాలెంజ్ ఎదురుచూస్తోంది’ అంటూ యువతకు రోమన్ సవాల్ విసిరాడు. ఆ ఫొటోల్లో వ్యక్తి ఎవరు? అమెరికాలోని ఫీనిక్స్ సిటీకి చెందిన రోమన్ పోస్ట్ చేసిన రెండు ఫొటోల్లోని వ్యక్తి ఎవరనేది ఇంకా సస్పెన్స్‌గా ఉంది. ఈ ఫొటోలు తొలిసారిగా హ్యాపీ టూర్స్ అనే సంస్థ వెబ్సైట్లో ప్రత్యక్షమయ్యాయి. గ్వాటెమాలాకు చెందిన ఈ సంస్థ సైట్లో మార్చి 4న ఈ ఫొటోలు కనిపించగానే రోమన్ వీటికి ఓ క్యాప్షన్ తగిలించి తన ఖాతాలో మార్చి 5న పోస్ట్చేశాడు. తమ సైట్లో ఆ ఫొటోలను ఎవరు పెట్టారో తమకూ తెలియదని హ్యాపీ టూర్స్ చెప్పిందని వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. లక్షలాది యువతకు స్ఫూర్తిగా నిలిచిన ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి ఎవరనేది ఎవ్వరికీ తెలీదు. ఆ ఫొటోలు ఇప్పటికే 323,000 సార్లు షేర్ అయ్యాయి. వేలాదిగా కామెంట్లు వచ్చాయి. -
ఢిల్లీని చెత్త నగరంగా మార్చారు: సుప్రీం
న్యూఢిల్లీ: ఢిల్లీలో భారీగా పేరుకుపోయిన ‘చెత్త పర్వతాలు’ నగరం ఎదుర్కొంటున్న అధ్వాన పరిస్థితిని సూచిస్తున్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి తగు చర్యలు చేపట్టకపోవడంపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ)పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డంపింగ్ యార్డులైన ఘాజీపూర్, ఓక్లా, బల్స్‌వాల్లో పెద్ద ఎత్తున పేరుకుపోయిన చెత్త పర్వతాలను ప్రస్తావిస్తూ.. అధికారులు గానీ, లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయ అధికారులుగానీ ఘన వ్యర్థాల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోకపోవడంతోనే నగరం ఈ దుస్థితిని ఎదుర్కొంటోందని పేర్కొంది. ఘన వ్యర్థాల నిర్వహణ బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్‌దేనని ఢిల్లీ ప్రభుత్వ, గవర్నర్ కార్యాలయ అధికారులు కోర్టుకు తెలుపగా.. ఇది బాధ్యతను మరొకరిపై తోసెయ్యడం తప్ప మరొకటి కాదని అసంతృప్తి వ్యక్తం చేసింది. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ తీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన వివరాలతో కూడిన అఫిడవిట్‌ను దాఖలు చేయనందుకు 10 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలకు జరిమానా విధించింది. -
రింగ్ పక్కన చెత్త!
శివారు గ్రామాల ముక్కుపుటాలదిరేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్‌రోడ్డును హరితహారంగా మలుస్తామని ప్రకటించిన కొన్నాళ్లకే.. ఈ రోడ్డు నిర్మాణానికి తవ్విన గోతులను ‘డంపింగ్ యార్డు’లుగా మార్చాలని నిర్ణయించింది. మట్టి, కంకర తవ్వకాలతో పెద్ద గోతులతో ఏర్పడిన గోతులను పూడ్చేందుకు సర్కారు ఈ ఆలోచన చేసింది. ఈ క్రమంలోనే ఔటర్‌కు ఇరువైపులా లీజు ముగిసిన క్వారీలను గ్రేటర్ చెత్తతో నింపేసేలా ప్రణాళిక తయారు చేసింది. - జవహర్‌నగర్‌పై భారాన్ని తగ్గించే ఆలోచన - ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన యంత్రాంగం - ఆందోళనలో పరిసర గ్రామాల ప్రజలు - హైదరాబాద్‌లో రోజుకు సగటున 3,800 టన్నుల చెత్త సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఇటీవల రింగ్‌రోడ్డుపై చక్కర్లు కొట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్.. చుట్టుపక్కల హరితహారం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అయితే, తాజాగా ఔటర్ రహదారి నిర్మాణానికి తరలించిన మట్టితో ఏర్పడిన గుంతలను చెత్త డంపింగ్‌కు ఉపయోగించుకోవాలని నిర్ణయం తీసుకోవడంతో పరిసర గ్రామాల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ పరిధిలో సగటున రోజుకు 3,800 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. దీంట్లో 90శాతం జవహర్‌నగర్‌లోని డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటూ చెత్తను వివిధ రకాలుగా వినియోగించుకుంటున్నారు. అయినప్పటికీ, భూగర్భజలాలు కలుషితం కావడం, రోగాల బారిన పడుతుండడంతో ఇక్కడి నుంచి డంపింగ్ యార్డును షిఫ్ట్ చేయాలని స్థానికులు ఉద్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలో జవహర్‌నగర్‌పై ఒత్తిడి తగ్గించేందుకు ఔటర్ గోతులను వాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. పర్యావరణ సమతుల్యత, కాలుష్య సమస్యను అధిగమించేందుకు సరికొత్త టెకా్నాలజీని ఉపయోగిస్తామని, చెత్తను వేర్వేరుగా విభజించడం ద్వారా దుర్వాసనకు తావివ్వకుండా మట్టి పొరలతో నింపేస్తామని యంత్రాంగం చెబుతోంది. జవహ ర్నగర్లోనూ ఈ విధానం అమలు చేస్తున్నా కంపు కొడుతోందని, ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉత్పన్నమవుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. - కుత్బుల్లాపూర్ మండలం నిజాంపేట్, గాజులరామారంలో లీజు పరిమితి ముగియడంతో 22 క్వారీలను రద్దు చేశారు. సర్వే నం.307, 308, 329/1, 79, 342లలో 148.26 ఎకరాల విస్తీర్ణంలోని 20 క్వారీల నుంచి మట్టి, కంకరను తీశారు. ఏడు మీటర్ల లోతుతో 34 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకాలు జరిపిన ఈ ప్రాంతాన్ని డంపింగ్‌యార్డుకు ఉపయోగించుకున్నారు. నిజాంపేట్ సర్వే నం.332లో 14.97 ఎకరాల్లో ఉన్న రెండు క్వారీలు కూడా దాదాపు 10 మీటర్ల లోతులో ఉన్నాయి. దాదాపు 6.67 క్యూబిక్ మీటర్ల మేర ఖనిజ వనరులను ఇక్కడ నుంచి తరలించారు. - శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడలోని 16 క్వారీల లెసైన్స్‌ను రద్దు చేశారు. స్థానికుల అభ్యంతరం మేరకు లీజును నిలిపివేశారు. దాదాపు 74.13 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ గుంతల నుంచి 20 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి/ కంకరను తీశారు. మరో 20శాతం మేర తొలిగించారు. వీటిని కూడా డంపింగ్ యార్డు ప్రతిపాదనల్లో చేర్చారు. - తుక్కుగూడ -పెద్దఅంబర్‌పేట్ జంక్షన్ వరకు ఔటర్ నిర్మాణ పనులు దక్కించుకున్న ‘గాయిత్రీ’ కాంట్రాక్టు సంస్థ ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్‌లో ఏడు లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకాలను జరిపింది. సర్వేనం. 300/1లో ఈ మట్టిని తొలగించిన సదరు సంస్థ.. దీన్ని ఔటర్ నిర్మాణంలో వినియోగించింది. పెద్ద గొయ్యిగా ఏర్పడిన క్వారీని గార్బెజ్ డంపింగ్ కోసం వాడుకోవాలని నిర్ణయించారు. -
చెత్త సమరం
- బీబీఎంపీకి వ్యతిరేకంగా పోరాటం - రాత్రంతా రోడ్డుపైనే గడిపిన గ్రామీణులు - టెర్రాఫార్మా మూయాల్సిందేనని పట్టు - బారులు తీరిన చెత్త వాహనాలు దొడ్డబళ్లాపురం: బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) పరిధిలోని చెత్త డంపింగ్‌పై వివాదం మళ్లీ చెలరేగింది. దొడ్డబళ్లాపురం తాలూకాలోని గుండ్లహళ్లి వద్ద ఉన్న టెర్రాఫార్మా డంపింగ్ సెంటర్‌కు కొన్ని సంవత్సరాలుగా బీబీఎంపీ చెత్తను తరలిస్తున్నారు. ఇక్కడ పోగవుతున్న చెత్తను ఎరువగా మారుస్తుంటారు. వాస్తవానికి 150 ఎకరాల్లో విస్తరించి ఉన్న టెర్రాఫార్మాలోని యంత్రాలతో ఒక రోజుకు 20 టన్నుల చెత్త నుంచి మాత్రమే ఎరువులను చేయగలిగే సామర్థ్యం ఉంది. అయితే ఇందుకు భిన్నంగా రోజుకు వంద టన్నుల మేర చెత్తను బీబీఎంపీ అధికారులు తరలిస్తున్నారు. దీంతో టెర్రాఫార్మ చుట్టుపక్కల ఉన్న 25 గ్రామాల ప్రజలకు ఇక్కట్లు మొదలయ్యాయి. దీంతో ఏడు సంవత్సరాల క్రితమే స్థానికులు దీనిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. చెత్త మురిగిపోవడంతో ఆ ప్రాంతంలో దుర్గంధం వ్యాపిస్తోందని, అపరిశుభ్రత పెరిగి ఈగలు వృద్ధి చెందడం వల్ల అనారోగ్యం పాలవుతున్నామంటూ స్థానికులు అప్పట్లో పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టారు. దీనిపై బీబీఎంపీ అధికారుల్లో గాని, పాలకుల్లో గాని ఎలాంటి స్పందన లేకపోవడంతో రెండేళ్ల క్రితం ఈ ఉద్యమం తీవ్రతరమైంది. అదే సమయంలో మండూరు దగ్గర ఉన్న డంపింగ్ యార్డ్ పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం చేపట్టడంతో అక్కడ డంప్ చేసే చెత్తను టెర్రాఫార్మాకు అధికారులు మళ్లించారు. దీంతో ఒక రోజుకు రెండు వందల టన్నులకు పైగా చెత్త టెర్రాఫార్మాకు చేరుతూ వచ్చింది. దీంతో 25 గ్రామాలకు చెందిన ప్రజలు మరోసారి ఉద్యమ బాట పట్టారు. మంగళవారం మధ్యాహ్నం హఠాత్తుగా బీబీఎంపీ చెత్త లారీలను అడ్డగించి ధర్నా చేపట్టారు. దీంతో 200 బీబీఎంపీ చెత్త లారీలు దాబస్‌పేట, తుమకూరు రోడ్డుపైనే నిలిచిపోయాయి. దుర్గంధం, దోమలు, ఈగల బెడద వల్ల రోగాలు ప్రబలుతుండడంతో చాలా మంది గ్రామాలను వదలాల్సిన పరిస్థితి నెలకొంది. మంగళవారం మొదలైన ఆందోళన బుధవారం కూడా కొనసాగింది. రాత్రి మొత్తం గ్రామీణులు రోడ్డుపైనే ఉంటూ చెత్త వాహనాలను టెర్రాఫార్మాలోకి అనుమతించకుండా అడ్డుకున్నారు. అక్కడే వంట వండుకుని రోడ్డుపైనే భోజనం చేశారు. చెత్త డంపింగ్‌ను పూర్తిగా నిలిపి వేసేవరకు అక్కడి నుంచి కదలబోమంటూ భీష్మించారు. మరో వైపు బెంగళూరు నుంచి ప్రతి ఐదు నిమిషాలకో చెత్త వాహనం వస్తుండడంతో చూస్తుండగానే కిలోమీటర్ల మేర ఆ వాహనాలు నిలిచిపోయాయి. బీబీఎంపీ అధికారులు వచ్చి ఇకపై చెత్త తరలించమని హామీ ఇచ్చేవరకూ ఇక్కడి నుండి కదిలే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు మొహరించారు. -
ప్రైవేట్ కంపెనీతో మంత్రి డీకే కుమ్మక్కు
మాజీ సీఎం కుమారస్వామి జాతీయ రహదారిని నిర్బంధించిన గోరూరు గ్రామస్తులు బెంగళూరు: మంత్రి డీకే శివకుమార్ ఒక ప్రైవేట్ కంపెనీలతో కుమ్మక్కై గోరూరు ప్రాంతంలో చెత్త డంపింగ్ చేయడానికి యత్నాలు చేస్తున్నారని మాజీ సీఎం, జేడీఎస్ పార్టీ అధ్యక్షుడు కుమారస్వామి ఆరోపించారు. శనివారం ఆయన గోరూరు గ్రామస్తులు జాతీయ రహదారి నిర్బంధించిన విషయం తెలుసుకుని అక్కడి చేరుకుని మాట్లాడారు. ఇక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే ఈ పరిసర ప్రాంతాలలో నివాసం ఉంటున్న గ్రామస్తులు ఆనారోగ్యాలకు గురి అవుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్త డంపింగ్ యార్డు ఏర్పాటు చేయకూడదని శుక్రవారం శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్న మహిళలు, వృద్ధులు, పిల్లలపై పోలీసులు లాఠీచార్జ్ చేసి ప్రతాపం చూపించారని మండిపడ్డారు. మహిళలపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారని తెలుసుకున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే వెంటనే ఈ గ్రామస్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే సందర్బంలో స్థానిక గ్రామస్తులు జాతీయ రహదారిపై రెండు గంటల పాటు ధర్నా చేసి రాష్ట్ర మంత్రి డి.కే. శివకుమార్ దిష్టిబొమ్మ దగ్దం చేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రాణాలు పోయినా ఇక్కడ చెత్త డంపింగ్ యార్డ్ ఏర్పాటు చెయ్యడానికి అంగీకరించమని మాగడి తాలుకాలోని పలు ప్రాంతాలలో ఉన్న గ్రామస్తులు తేల్చి చెప్పారు. ధర్నాలో బండేమఠాధిపతి బసవలింగస్వామీజి, మహంతేషస్వామీజి, చిలుమమఠస్వామీజి, శాసన సభ్యుడు డాక్టర్ శ్రీనివాసమూర్తి, ఎంఎల్సీ, కన్నడ సినీ నిర్మాత ఇ. కృష్ణప్ప, స్థానిక జేడీఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
మహా గుబులు !
చెత్త డంపింగ్‌కు ససేమిరా అన్న మండూరు వాసులు డంప్ చేస్తే విషం తాగుతాం ! తీవ్ర నిరసనల మధ్య డంపింగ్ యార్డు పరిశీలించిన మంత్రి రామలింగారెడ్డి ముందుచూపులేని పాలికె బెంగళూరు, న్యూస్‌లైన్ : బెంగళూరు మహానగర పాలికెకు చెత్త గుబులు పట్టుకుంది. ఇన్నాళ్లు నగరంలోని చెత్తను మండూరు యార్డుకు తరలిస్తున్న విషయం తెల్సిందే. జూన్ ఒకటి తరువాత చెత్తను మండూరుకు తరలించేది లేదని అప్పటి వరకు గడువు కోరిన బీబీఎంపీ ఇప్పుడు చెత్తను ఎక్కడికి తరలించాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. బెంగళూరుకు 18 కి.మీ దూరం ఉన్న మండూరులో చెత్తను డంపింగ్ ఆపివేయాలని గ్రామస్తులు తీవ్రంగా ప్రతిఘటిస్తూ వ స్తున్నారు. జనవరి ఒకటి నుంచి చెత్త డంపింగ్ ఆపివేస్తామని మొదటిసారిగా పాలికె మాట ఇచ్చింది. అటు తరువాత జూన్ ఒకటి వరకు గడువు కోరింది. ఆ గడువు కూడా పూర్తి కావడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవ డంలో పాలికె పూర్తిగా విఫలమైంది. ఇదిలా ఉంటే ఆదివారం మండూరుతో పాటు బయ్యప్పనహళ్లి, గుండూరు, బొమ్మసంద్ర, మల్లసంద్ర, బీదరహళ్లి, భీమసంద్ర తదితర గ్రామాలకు చెందిన ప్రతి ఇంటికొక మహిళ స్వచ్ఛంద ధర్నాలో పాల్గొన్నారు. దీంతో పాలికె అధికారుల దిమ్మతిరిగింది. మరొసారి డంపింగ్ చేస్తే సామూహికంగా ఆత్మహత్య చేసుకుంటామని పలువురు విషం బాటిళ్లు చేతపట్టుకుని బైఠాయించారు. ఈ నేపథ్యంలో బెంగళూరు ఇన్చార్జ్ మంత్రి రామలింగారెడ్డి, బీబీఎంపీ మేయర్ కట్టె సత్యనారాయణ, పాలికె కమిషనర్ లక్ష్మినారాయణతో సహ అధికారులు మండూరు చేరుకుని స్థానికులకు న చ్చచెప్పడానికి ప్రయత్నించారు. స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మంత్రితో సహ మేయర్, కమిషనర్ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. అంతకు ముందు వీరు డంపింగ్ యార్డ్‌ను పరిశీలించారు. మండూరులో డంపింగ్ యార్డ్ వద్దని, తాము రోగాల బారిన పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డ్ ఉన్న చుట్టు పక్కల 10 కిలోమీటర్లు పొడవునా దుర్వాసన భరించలేకున్నామని, రోగాలతో ఎప్పుడో పోతామోనని ఆందోళన పడుతున్నామని కొందరు మహిళలు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. గ్రామస్తులకు మాజీ మంత్రి, మహదేవపుర ఎమ్మెల్యే అరవింద లింబావలి, మండూరు గ్రామ పంచాయతీ సభ్యుడు రాకేష్‌గౌడ తదితరులు మద్దతుగా నిలిచారు.