రోమన్ పోస్ట్‌చేసిన ఫొటోలు
ఎవరైనా చెత్తకుప్ప మధ్యలో కూర్చుని ఫొటోకి పోజిస్తారా? ఛీ ఛీ అంటూ ముక్కుమూసుకొని పారిపోతారు. కానీ అమెరికాలో వేలంవెర్రిగా వేలాదిగా కుర్రకారు చెత్తకుప్పల్లో ఫొటోలు దిగి ఫేస్‌బుక్‌లో పెట్టేస్తున్నారు. ఫేస్‌బుక్‌లో యువతరం విసురుతున్న పిచ్చి చాలెంజ్‌లు ఎన్నెన్నో. బట్టలు శుభ్రంచేసేందుకు వాడే డిటర్జెంట్ ద్రవాన్ని తాగమనో, ఏకబిగిన ఒక గ్యాలన్(దాదాపు 4లీటర్ల) పాలు తాగాలనో, చెంచాడు దాల్చిన చెక్క పొడిని మింగాలనో ఇలా పిచ్చి చాలెంజ్‌లెన్నో సోషల్‌మీడియాలో పెరిగిపోయాయి.
అయితే కొత్తగా వచ్చిన ట్రాష్‌ట్యాగ్ చాలెంజ్‌కు వీటితో సంబంధమే లేదు. పూర్తి భిన్నం. యువతరానికి సామాజిక బాధ్యతను గుర్తుచేసే సరికొత్త ఆలోచనే ట్రాష్‌ట్యాగ్ చాలెంజ్. మొట్టమొదటిగా బైరాన్ రోమన్ అనే వ్యక్తి మార్చి 5న చెత్తలో కూర్చుని ఉన్న ఒక వ్యక్తి ఫొటో ఫేస్‌బుక్‌లో పెట్టాడు. తర్వాత ఆ చెత్తనంతా శుభ్రంగా సంచుల్లోకి ఎత్తి అదే చోట వాటితో దిగిన మరో ఫొటోను ఫేస్‌బుక్‌లో పెట్టాడు. ఫేస్‌బుక్ ఖాతాలో ఫొటోలు పెట్టి ‘బోర్‌గా ఫీలవుతున్నారా? అయితే మీకోసం సరికొత్త చాలెంజ్ ఎదురుచూస్తోంది’ అంటూ యువతకు రోమన్ సవాల్ విసిరాడు.
ఆ ఫొటోల్లో వ్యక్తి ఎవరు?
అమెరికాలోని ఫీనిక్స్ సిటీకి చెందిన రోమన్ పోస్ట్ చేసిన రెండు ఫొటోల్లోని వ్యక్తి ఎవరనేది ఇంకా సస్పెన్స్‌గా ఉంది. ఈ ఫొటోలు తొలిసారిగా హ్యాపీ టూర్స్ అనే సంస్థ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమయ్యాయి. గ్వాటెమాలాకు చెందిన ఈ సంస్థ సైట్‌లో మార్చి 4న ఈ ఫొటోలు కనిపించగానే రోమన్ వీటికి ఓ క్యాప్షన్ తగిలించి తన ఖాతాలో మార్చి 5న పోస్ట్‌చేశాడు. తమ సైట్‌లో ఆ ఫొటోలను ఎవరు పెట్టారో తమకూ తెలియదని హ్యాపీ టూర్స్ చెప్పిందని వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. లక్షలాది యువతకు స్ఫూర్తిగా నిలిచిన ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి ఎవరనేది ఎవ్వరికీ తెలీదు. ఆ ఫొటోలు ఇప్పటికే 323,000 సార్లు షేర్ అయ్యాయి. వేలాదిగా కామెంట్లు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment