పనాజీ: నిర్లక్ష్యంగా రోడ్డుపై చెత్త పడేసినందుకు గాను టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత అజయ్ జడేజా రూ.5 వేల జరిమానా కట్టాడు. నార్త్ గోవాలోని అల్డోనా గ్రామంలో విలాసవంతమైన భవనంలో నివాసముండే ఈ మాజీ క్రికెటర్.. తన పక్కనే ఉన్న నచినోలా అనే గ్రామంలో చెత్త పడేయటాన్ని గ్రామస్తులు గుర్తించారు. దీంతో అతనికి జరిమానాను విధించడంతో పాటు మరోసారి చెత్త వేయవద్దని హెచ్చరించారు. గ్రామ పంచాయతీ ఆదేశాల మేరకు తప్పును ఒప్పుకున్న జడేజా జరిమానా కట్టి, మరోసారి ఈ 'చెత్త' పని చేయనని అంగీకరించాడు. ఈ విషయాన్ని నచినోలా గ్రామ సర్పంచ్ తృప్తి బండోద్కర్ మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా గ్రామ్ సర్పంచ్ మాట్లాడుతూ.. జడేజా లాంటి పాపులర్ క్రికెటర్ తమ పరిసరాల్లో ఉంటుంన్నందుకు చాలా గర్వంగా ఉందన్నాడు.
అయితే ఎంతటి సెలబ్రిటీ అయినా పారిశుద్ధ్య నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేనని చెప్పుకొచ్చాడు. కాగా, గోవాలోని అల్డోనా గ్రామ పంచాయతీ చాలా మంది సెలబ్రిటీలకు సెకండ్ హోమ్‌గా ఉంది. అజయ్ జడేజా, అమితావ్ ఘోష్ లాంటి పలువురు ప్రముఖులు అక్కడే భవనాలు కొనుగోలు చేసి ప్రకృతిని ఆస్వాధిస్తూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. ఇదిలా ఉంటే, భారత్ జట్టులోకి 1992లో అరంగేట్రం చేసిన అజయ్ జడేజా 15 టెస్టులు, 196 వన్డే మ్యాచ్‌లు ఆడి, 6 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీల సాయంతో దాదాపు 6000 పరుగులు సాధించాడు. టీమిండియా డాషింగ్ బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ గుజరాత్ ఆటగాడు.. 2000లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం క్రికెట్ వ్యాఖ్యాతగా కొనసాగుతున్నాడు.
చదవండి: డోపింగ్ టెస్ట్‌లో పట్టుబడ్డ మహిళా క్రికెటర్..
Comments
Please login to add a commentAdd a comment