‘‘సిక్కాల’’ పరేషాన్
‘‘సిక్కాల’’ పరేషాన్
Published Mon, May 8 2017 4:19 PM | Last Updated on Tue, Sep 5 2017 10:42 AM
ఘట్‌కేసర్ : పది రూపాయల సిక్కాలు చెల్లవంటూ పుకార్లు షికార్లు రావడంతో సిక్కాలను తీసుకోవడానికి వ్యాపారులు నిరాకరిస్తున్నారు. మొన్నటి వరకు పాత నోట్ల రద్దుతో ఇబ్బందులు పడ్డ సామాన్యులు నేడు పది రూపాయల సిక్కాలతో పరేషాన్ అవుతున్నారు. చిన్నచిన్న హోటళ్లు, ఆటో చార్జీలు, చిరు వ్యాపారులు, గ్రామాల్లోని దుకాణాల్లో పది సిక్కాలను తీసుకోవడానికి జంకుతున్నారు. దీంతో ప్రస్తుతం మార్కెట్‌లో పది సిక్కాల గొడవ హాట్ టాపిక్‌గా మారింది. పది సిక్కాలపై చలామణిపై అధికారులు అవగాహన కల్పించకపోవడంతోనే ఈ సమస్య తలెత్తుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు.
అవగాహన కరువు
పాతనోట్ల రద్దు అనంతరం పది రూపాయల నోట్లు తగ్గిపోవడంతో మార్కెట్‌లో చిల్లర సమస్యలు తొలగించాలని బ్యాంకు అధికారులు పది సిక్కాలను ప్రజలకు అందజేస్తున్నారు. పట్టణం వ్యాపార కేంద్రం కావడంతో వివిధ అవసరాల నిమిత్తం గ్రామాల నుంచి ప్రజలు వస్తుంటారు. విక్రయాలు, కొనుగోళ్ల సమయంలో చిల్లర సమస్య తీర్చడంలో పది రూపాయలు ప్రధాన పాత్ర పోషిస్తుంది. పక్షం రోజులుగా పది నాణాలు చెల్లంటు పుకార్లు వ్యాపించడంతో మారుమూల ప్రాంతాల ప్రజలు సిక్కాలను తీసుకోవడం లేదు. దీంతో వ్యాపారుల దగ్గర సిక్కాలు పేరుకుపోతున్నాయి. ఇప్పటికైనా బ్యాంకు అధికారులు స్పందించి పది సిక్కాల వినియోగంపై అవగాహన కల్పించి వాటిని చెలామణి అయ్యేలా చర్యలు చేపట్టాలి. లేని పక్షంలో సిక్కాల సమస్య మరింత జటిలమయ్యే అవకాశం ఉంది.
పది సిక్కాలు తీసుకోవడం లేదు
పుకార్లు కారణంగా పది సిక్కాలు ఇస్తే ప్రజలు తీసుకోవడం లేదు. మా దగ్గర పది సిక్కాల మూట పెరిగిపోతోంది. పెట్రోల్ పోయించుకొని సిక్కాలను చెల్లిస్తే బంకు సిబ్బంది తీసుకోవడం లేదు. బ్యాంకు అధికారులు స్పందించి సిక్కాల చలామణిపై ప్రజలకు అవగాహన కల్పించాలి.
సిక్కాలు చెల్లవన్న పుకార్లను నమ్మొద్దు
పది సిక్కాలు చెల్లవంటూ వస్తున్న పుకార్లను నమ్మొద్దు. ప్రజలు, చిరు వ్యాపారులు ఇతరులకు చిల్లర సమస్య రాకూడదని రిజర్వుబ్యాంకు నూతనంగా పది సిక్కాలను మార్కెట్‌లో విడుదల చేసింది. పది సిక్కాలు చెల్లవంటు వచ్చిన పుకార్లను విశ్వసించకూడదు. నిస్సందేహంగా పది సిక్కాలను తీసుకోవచ్చు.
- శ్రీకాంత్, మేనేజర్ ఎస్‌బీఐ బ్యాంకు ఘట్‌కేసర్
Advertisement
Advertisement