Rs 10 Coin
-
రూ. 10 కాయిన్ చెల్లుతుందా..చెల్లదా..? క్లారిటీ ఇచ్చిన కేంద్రం..!
మనం దగ్గరలోని మార్కెట్‌కి వెళ్లినప్పుడు సదరు షాప్ యజమానికి రూ.10 నాణెం ఇస్తే...ఇది చెల్లదు అంటూ..వేరే రూ. 10 నోట్ ఇస్తూ ఉంటాం. అంత ఎందుకు మనలో కొంతమంది రూ. 10 కాయిన్‌ను తీసుకోవాలంటే వెనకముందు అవుతుంటాం. రూ.10 నాణెం చెల్లుతుందా? లేదా? అన్న అనుమానాలు ఇప్పటికీ సామాన్యుల్లో ఉన్నాయి. రూ.10 కాయిన్ చెల్లుతుందని కొందరు, చెల్లదని ఇంకొందరు... ఈ వాదనలు చాలాకాలంగా ఉన్నవే. ఇక రూ.10 నాణెం చెల్లుబాటుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI అనేక సార్లు క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు తాజాగా రూ. 10 నాణేంపై కేంద్రం స్పందించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరణ ఇదే..! ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఒక వ్రాతపూర్వక సమాధానంలో రూ. 10 నాణెంపై స్పందించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ముద్రించబడిన, భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్వారా పంపిణీ చేయబడిన వివిధ రకాల రూ. 10 నాణేలు చట్టబద్ధమైనవని తెలిపారు. అన్ని లావాదేవీలలో చట్టపరమైన టెండర్‌గా ఉపయోగించవచ్చునని తెలిపారు. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రూ. 10 నాణేలను నకిలీవిగా భావించి అంగీకరించడం లేదని రాజ్యసభలో ఎంపీ ఎ. విజయకుమార్ అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ విధంగా సమాధానమిచ్చారు. రూ. 10 నాణెం అంగీకరించకపోవడంపై కొన్ని ఫిర్యాదులు ఎప్పటికప్పుడు సాధారణ ప్రజల నుంచి స్వీకరించామని తెలిపారు. ప్రజలలో అవగాహన కల్పించడానికి, అపోహలను తొలగించడానికి ఆర్బీఐ కాలానుగుణంగా పత్రికా ప్రకటనలను జారీ చేస్తుందని వివరణ ఇచ్చారు. ప్రజలు రూ. 10 నాణేలపై ఎటువంటి సంకోచం లేకుండా లీగల్ టెండర్‌గా అంగీకరించాలని కోరారు. రూ. 10 నాణేంపై గతంలో కూడా ఆర్బీఐ అనేక సార్లు వివరణ ఇచ్చింది. అంతకుముందు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ.10 నాణెం మొత్తం 14 డిజైన్లు చెల్లుబాటు అవుతాయని , లావాదేవీలకు చట్టబద్ధమైన టెండర్ అని చెప్పింది. ఆర్బీఐ తొలిసారిగా రూ. 10 కాయిన్‌ను 2005లో ప్రవేశపెట్టింది. చదవండి: ఆర్బీఐ కీలక ప్రకటన.. ఈ రూపీ పరిమితి భారీగా పెంపు -
‘‘సిక్కాల’’ పరేషాన్
ఘట్కేసర్ : పది రూపాయల సిక్కాలు చెల్లవంటూ పుకార్లు షికార్లు రావడంతో సిక్కాలను తీసుకోవడానికి వ్యాపారులు నిరాకరిస్తున్నారు. మొన్నటి వరకు పాత నోట్ల రద్దుతో ఇబ్బందులు పడ్డ సామాన్యులు నేడు పది రూపాయల సిక్కాలతో పరేషాన్ అవుతున్నారు. చిన్నచిన్న హోటళ్లు, ఆటో చార్జీలు, చిరు వ్యాపారులు, గ్రామాల్లోని దుకాణాల్లో పది సిక్కాలను తీసుకోవడానికి జంకుతున్నారు. దీంతో ప్రస్తుతం మార్కెట్లో పది సిక్కాల గొడవ హాట్ టాపిక్‌గా మారింది. పది సిక్కాలపై చలామణిపై అధికారులు అవగాహన కల్పించకపోవడంతోనే ఈ సమస్య తలెత్తుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. అవగాహన కరువు పాతనోట్ల రద్దు అనంతరం పది రూపాయల నోట్లు తగ్గిపోవడంతో మార్కెట్లో చిల్లర సమస్యలు తొలగించాలని బ్యాంకు అధికారులు పది సిక్కాలను ప్రజలకు అందజేస్తున్నారు. పట్టణం వ్యాపార కేంద్రం కావడంతో వివిధ అవసరాల నిమిత్తం గ్రామాల నుంచి ప్రజలు వస్తుంటారు. విక్రయాలు, కొనుగోళ్ల సమయంలో చిల్లర సమస్య తీర్చడంలో పది రూపాయలు ప్రధాన పాత్ర పోషిస్తుంది. పక్షం రోజులుగా పది నాణాలు చెల్లంటు పుకార్లు వ్యాపించడంతో మారుమూల ప్రాంతాల ప్రజలు సిక్కాలను తీసుకోవడం లేదు. దీంతో వ్యాపారుల దగ్గర సిక్కాలు పేరుకుపోతున్నాయి. ఇప్పటికైనా బ్యాంకు అధికారులు స్పందించి పది సిక్కాల వినియోగంపై అవగాహన కల్పించి వాటిని చెలామణి అయ్యేలా చర్యలు చేపట్టాలి. లేని పక్షంలో సిక్కాల సమస్య మరింత జటిలమయ్యే అవకాశం ఉంది. పది సిక్కాలు తీసుకోవడం లేదు పుకార్లు కారణంగా పది సిక్కాలు ఇస్తే ప్రజలు తీసుకోవడం లేదు. మా దగ్గర పది సిక్కాల మూట పెరిగిపోతోంది. పెట్రోల్ పోయించుకొని సిక్కాలను చెల్లిస్తే బంకు సిబ్బంది తీసుకోవడం లేదు. బ్యాంకు అధికారులు స్పందించి సిక్కాల చలామణిపై ప్రజలకు అవగాహన కల్పించాలి. సిక్కాలు చెల్లవన్న పుకార్లను నమ్మొద్దు పది సిక్కాలు చెల్లవంటూ వస్తున్న పుకార్లను నమ్మొద్దు. ప్రజలు, చిరు వ్యాపారులు ఇతరులకు చిల్లర సమస్య రాకూడదని రిజర్వుబ్యాంకు నూతనంగా పది సిక్కాలను మార్కెట్లో విడుదల చేసింది. పది సిక్కాలు చెల్లవంటు వచ్చిన పుకార్లను విశ్వసించకూడదు. నిస్సందేహంగా పది సిక్కాలను తీసుకోవచ్చు. - శ్రీకాంత్, మేనేజర్ ఎస్బీఐ బ్యాంకు ఘట్కేసర్ -
పది రూపాయిల నాణేలపై పుకార్లు నమ్మొద్దు
రామగుండం : ఇటీవల కాలంలో నూతనంగా రిజర్వు బ్యాంకు విడుదల చేసిన పది రూపాయల కాయిన్స్ చెల్లుబాటు కావనే పుకార్లతో వ్యాపారులు, వివిధ ఆర్థిక సంస్థలు వాటిని తిరస్కరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ బి.వి. సుబ్రహ్మణ్యం అన్నారు. అలాంటి పుకార్లను నమ్మవద్దని యధేచ్ఛగా పది రూపాయల కాయిన్స్ స్వీకరించవచ్చన్నారు. బ్యాంకులలో కూడా డిపాజిట్లు, చెల్లింపుల్లో పది కాయిన్స్ తీసుకుంటారన్నారు. ఇటీవల కాలంలో నగదు కొరత ఎక్కువగా ఉండడంతో కాయిన్స్ చెలామణి పెంచామన్నారు. త్వరలోనే నగదు కరెన్సీ కొరత తీరుతుందన్నారు. కాయిన్స్ ఎవరైనా తిరస్కరించితే సెల్ నెం. 9440908845 కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. -
రూ.10 నాణెంపై అయోమయం!
ఫరీదాబాద్: గత రెండు వారాలుగా ఫరీదాబాద్ ప్రజలు రూ.10 నాణెం విషయంలో తికమకపడుతున్నారు. కొంతమంది దుకాణదారులు రూ.10 నాణెం చెల్లుతుందని తీసుకుంటుంటే.. మరికొందరు అంగీకరించటం లేదు. దీంతో ప్రజలు నాణ్యాన్ని తీసుకోవాలా? వద్దా? అనే విషయాన్ని ఏటూ తేల్చుకోలేకపోతున్నారు. ఆర్బీఐ రూ.10 నాణెం చెల్లదని చెప్పినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరగడమే ఇందుకు ప్రధానకారణం. దీంతో రూ.10 నాణ్యాలతో అక్కడి ప్రజలు బ్యాంకులకు క్యూ కడుతున్నారు. రూ.10 నాణెంను బ్యాంకులో ఇచ్చి పది నోటును తీసుకుంటున్నారు. దీనిపై స్పందించిన నీలమ్ చౌక్ ఎస్బీఐ బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరిగిందని చెప్పారు. ఆర్బీఐ అటువంటి నిర్ణయం ఏం తీసుకోలేదని.. రూ.10 నాణెంను తీసుకోవడానికి తిరస్కరించిన వ్యాపారులు చట్టరీత్యా శిక్షార్హులని పేర్కొన్నారు. ఇప్పటివరకూ దాదాపు 2వేల పది రూపాయిల నాణ్యాలు బ్యాంకుకు వచ్చినట్లు చెప్పారు. నగరంలోని కొద్ది ప్రాంతాల్లో నాణ్యాలను తీసుకుంటున్నా.. టియాగాన్, పాత ఫరీదాబాద్ లలో తీసుకోవడం లేదని తెలిపారు.