బంద్ ప్రశాంతం | Pune weeps for Narendra Dabholkar, observes shutdown | Sakshi
Sakshi News home page

బంద్ ప్రశాంతం

Published Wed, Aug 21 2013 11:39 PM | Last Updated on Wed, Aug 15 2018 5:57 PM

Pune weeps for Narendra Dabholkar, observes shutdown

పింప్రి, న్యూస్‌లైన్: మూఢ నమ్మకాల వ్యతిరేక ప్రచారకుడు నరేంద్ర దబోల్కర్ హత్యకు వ్యతిరేకంగా పుణేలో బుధవారం నిర్వహించిన బంద్ ప్రశాంతంగా జరిగింది. స్థానిక శనివార్‌పేట్‌లోని సాధనా కార్యాలయానికి వచ్చిన వేలాది మంది అంధ శ్రద్ధ నిర్మూలన సమితి కార్యకర్తలు, విద్యార్థుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత నిర్వహించిన  కార్యక్రమంలో వక్తలు ప్రసంగిస్తూనే కంట తడిపెట్టుకున్నారు. నగరంలోని అన్ని రాజకీయ, విద్య, ఉద్యోగ, కళారంగ, వ్యాపార, స్వచ్ఛంద సంస్థలు పాల్గొనడంతో బంద్ ప్రశాంతంగా ముగిసింది. వీరికితోడు నగరంలోని ఆటోవాలాలు కూడా బంద్‌కు మద్దతు తెలపడంతో నగరంలో జనజీవనం స్తంభించిపోయింది.
 
ముంబై హైవేపై రాస్తారోకో...
దబోల్కర్ హత్యను నిరసిస్తూ మావల్ తాలూకా ఎన్సీపీ కార్యకర్తలు పుణే-ముంబై హైవేపై బుధవారం రాస్తారోకో నిర్వహించారు. దోషులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మావల్ తాలూకా ఎన్సీపీ అధ్యక్షుడు బబన్‌రావ్‌బేగడే, యూత్ విభాగం అధ్యక్షుడు సందీప్ కాకడే, ఎన్సీపీ రాష్ర్ట శాఖ కార్యదర్శి విక్రమ్ కదమ్, యూత్ విభాగం కార్యదర్శి సంతోష్ భేగడే, పుణే జిల్లా ఎన్సీపీ యువజనవిభాగం కార్యాధ్యక్షుడు సంతోష్ మానే తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
 ప్రజాసంఘాల హస్తం ఉండొచ్చు
 నరేంద్ర హత్య వెనుక ప్రజాసంఘాల హస్తం ఉండొచ్చంటూ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అనుమానం వ్యక్తం చేశారు. ఇటువంటి శక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించకూడదన్నారు. మహాత్మాగాంధీ మాదిరిగానే నరేంద్రను దుష్టశక్తులు పొట్టనబెట్టుకున్నాయన్నారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమన్నారు.
 
 దర్యాప్తు వేగవంతం
 దాబోల్కర్‌ను హత్య చేసిన అగంతకులు వినియోగించిన మోటారు సైకిల్ నంబరును గుర్తించామని నగర పోలీసులు తెలిపారు. దర్యాప్తు వేగవంతం చేశామన్నారు. అగంతకులు వినియోగించిన పిస్తోళ్లను గుర్తించామని తెలిపారు. ఈ కేసు దర్యాప్తుకు ఎనిమిది బృందాలను సిద్ధం చేశామని, వీరిని రంగంలోకి దించినట్లు పేర్కొన్నారు. ఘటనా స్థలం పరిసరాలలోని సీసీటీవీ కెమెరాలలో నమోదైన దృశ్యాలను పరిశీలిస్తున్నట్లు పోలీసు అధికారి సింఘాల్ తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రజలకు ఏదైనా సమాచారం అందితే వెంటనే  020-26112222, 020-26208295 నంబర్‌లలో సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు.
 
 హత్యతో మాకు సంబంధం లేదు’
 సంఘ సేవకుడు నరేంద్ర హత్యతో తమ సంస్థకు ఎటువంటి సంబంధం లేదని సనాతన్ సంస్థ ప్రతినిధి అభయ్ వర్తక్ తెలిపారు. బుధవారం ఆయన ముంబైలో విలేకరులతో మాట్లాడుతూ నరేంద్రతో తమకు సిద్ధాంతాల శత్రుత్వమే తప్ప వ్యక్తిగతంగా ఎటువంటి వైరమూ లేదని చెప్పారు. దబోల్కర్ తాను నమ్మిన సిద్ధాంతం కోసం కష్టపడి పనిచేశాడంటూ కొనియాడారు. అతడిని హత్య చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. ‘మేము భక్తి మార్గంలో పయనిస్తున్నాం.. అతడితో మాకు వ్యక్తిగత వైరం లేదు.. సైద్ధాంతిక వ్యతిరేకత మాత్రమే ఉంది.’ అని స్పష్టం చేశారు.
 
 విచారణకు చేయూత
 ప్రముఖ హేతువాది నరేంద్ర దబోల్కర్ హత్య కేసు విచారణ విషయంలో పుణే పోలీసులకు ముంబై పోలీసులు తమవంతు చేయూతనందించనున్నారు. ముంబై క్రైంబ్రాంచ్‌కు చెందిన బృందం త్వరలో పుణేకి రానుంది. ఈ బృందం ఆరుగురు సభ్యులు ఉంటారని క్రైంబ్రాంచ్ అధికారి ఒకరు తెలిపారు. పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఈ బృందానికి సారథ్యం వహిస్తారన్నారు. నిందితుల ఊహాచిత్రాలతోపాటు సాంకేతిక అంశాలను ఆధారంగా చేసుకుని ముంబై క్రైంబ్రాంచ్ బృందం దృష్టి సారించనుందన్నారు. ఫోన్ సంభాషణలను విశ్లేషించడంలో ఈ బృందం దిట్ట అని ఆయన చెప్పారు. హతుడు నరేంద్ర వాడిన ఫోన్‌కు వచ్చిన కాల్స్‌తోపాటు పుణే పోలీసులు సేకరించిన ఫోన్ నంబర్లపై జరిగిన సంభాషణలను కూడా విశ్లేషించనుందన్నారు.
 
 న్యాయవిచారణ జరిపించాలి :  సీపీఐ
 ప్రముఖ హేతువాది నరేంద్ర దబోల్కర్ హత్య ఘటనపై న్యాయవిచారణ జరిపించాలని సీపీఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ నాయకుడు గురుదాస్ గుప్తా... ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌కు బుధవారం ఓ లేఖ రాశారు. ‘మధ్యయుగకాలంనాటి దురహంకారవాదులే ఈ హత్యకు పాల్పడి ఉంటారు. అందువల్ల ఈ ఘటనపై న్యాయవిచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలి’ అని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన హత్యగా ఆయన అభివర్ణించారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసికూడా ఆయన ఎంతమాత్రం లెక్కచేయలేదన్నారు. పోలీసుల రక్షణ కూడా కోరలేదన్నారు. కాగా దాభోల్కర్ హత్యను సీపీఐ కేంద్ర కమిటీ ఖండించింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement