దంపతుల సజీవదహనం
►పెళ్లయిన ఏడాదికే కానరాని లోకాలకు
►కారు ప్రమాదంలో దంపతుల సజీవదహనం
►భర్త కారు రేసర్, భార్య వైద్యురాలు
ప్రేమించి పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఏడాదికే ఆ దంపతులకు నూరేళ్లు నిండాయి. నాతి చరామీ అంటూ సంసార జీవితం వైపు ఏడడుగులు నడిచిన చూడముచ్చటైన ఆ జంట పెట్టుకున్న గంపెడాశలు కారు మంటల్లో కాలిబూడిదయ్యాయి. చెన్నైలో శనివారం తెల్లవారుజామున ఈ హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాలు..
సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై వలసరవాక్కం సమీపం ఆలపాక్కం అష్టలక్ష్మీనగర్‌కు చెందిన సుందర్ కుమారుడు అశ్విన్ సుందర్ (27) అంతర్జాతీయ కార్ల పోటీలో పాల్గొనే ఫార్ములా 4 రేసర్. దేశ విదేశాల్లో జరిగిన అనేక పోటీల్లో చాంపియన్‌గా నిలిచారు. ఇతని భార్య నివేదిత (26) చెన్నై పోరూరులోని రామచంద్ర ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌గా పనిచేస్తున్నారు. అశ్విన్ సుందర్ వద్ద రెండే సీట్లు కలిగిన బీఎండబ్ల్యూ కారు ఉంది. శుక్రవారం రాత్రి ఆశ్విన్ తన భార్యతో కలిసి ఈసీఆర్ రోడ్డులోని ఒక రిసార్టులో తన స్నేహితుడు ఇచ్చే పార్టీకి హాజరయ్యారు.
అర్ధరాత్రి వరకు స్నేహితునితో గడిపి శనివారం తెల్లవారుజాము 1.30 గంటల ప్రాంతంలో భార్యతో కలిసి ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. చెన్నై అడయారు సమీపం రాజా అన్నామలైపురం డీజీఎస్ దినకరన్ రోడ్డు మీదుగా ఎంఆర్‌సీ నగర్, అంబేడ్కర్ మణిమండపం సమీపం మలుపు వద్ద అతివేగంగా వస్తున్న అశ్విన్ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయి అశ్విన్, నివేదిత అందులో ఇరుక్కుపోయారు. ఆ వైపుగా వెళుతున్న వాహనాల వైపు చూస్తూ రక్షించాలని కేకలు వేసినా ఎవ్వరూ నిలపలేదు.
ఈలోపు కారు ముందు భాగం నుంచి మంటలు చెలరేగి కొద్ది క్షణాల్లో పూర్తిగా వ్యాపించాయి. మంటల్లో చిక్కుకున్న దంపతులు సహాయం కోసం అర్ధిస్తూ ఆర్తనాదాలు చేశారు. ఆ సమయంలో ఆ వైపుగా వస్తున్న ఉషారాణి అనే మహిళా కానిస్టేబుల్ వారి దయనీయ స్థితిని చూసినా కారు వద్దకు వెళ్ల లేక సెల్‌ఫోన్ నుంచి వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. మైలాపూరు, తేనాంపేటల నుంచి రెండు అగ్నిమాపక శకటాలు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పాయి.
అయితే అప్పటికే జరగాల్సిన దారుణం జరిగిపోయింది. కారులో దంపతులు సజీవదహనమై ఎముకల గూడుగా, బొగ్గు ముద్దలుగా మారిపోయారు. అడయారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక విచారణలో రేసర్ అశ్విన్ తన కారును వంద కిలోమీటర్ల వేగంతో నడిపి అదుపు తప్పడమే ప్రమాదానికి కారణమని తేలింది. గత ఏడాది ఫిబ్రవరి 12వ తేదీన ఆశ్విన్‌కు వివాహం కాగా భార్య నివేదిత గర్భంతో ఉన్నట్లు తెలిసింది.
చిరు ప్రాయం నుంచే రేసులపై ఆసక్తి: అశ్విన్‌కు 14 ఏళ్ల ప్రాయంలో బైక్, కారు రేసులపై ఆసక్తిని తండ్రి, మేనత్త గుర్తించారు. కారు రేసులో తగిన శిక్షణ ఇప్పించి తొలిసారిగా ‘మాగాన్ మోటార్ స్పోర్టు’ అనే జర్మనీ కారు పందెం బృందంలో చేర్పించారు. ఆ తరువాత జర్మని ఫార్ములా వోక్స్‌వాగన్ అటాక్ చాంపియన్ షిప్ పోటీలో ఆశ్విన్ పాల్గొన్నారు.
అయితే కారు రేస్ కంటే కూడా బైక్ రేసులంటే ఎక్కువ ఇష్టపడేవారు. ప్రమాదకరమని తెలిసినా ఎక్కువ వేగాన్ని బైక్‌లోనే ఆస్వాదించగలమని భావించేవాడు. 2003లో జరిగిన కారు రేసులో తొలిసారిగా జాతీయస్థాయి చాంపియన్ షిప్‌ను అందుకున్నారు. 2004లో రెండుసార్లు చాంపియన్‌గా నిలిచారు. 2006లో ఆసియా దేశాల స్థాయి పోటీల్లో రెండో స్థానంలో నిలిచారు. 2010 నుంచి 2013 వరకు వరుసగా ప్రతి ఏడాది అంతర్జాతీయ చాంపియన్ షీల్డ్‌ను అందుకున్నారు.
36 సార్లు చాంపియన్–నివేదితతో ప్రేమ వివాహం:
అశ్విన్ సుందర్‌కు రేస్‌బైక్‌ను తయారుచేసి ఇచ్చిన అమీన్ అనే వ్యక్తి కన్నీరుమున్నీరై విలపిస్తూ చెప్పిన మాటలు ఇవి. అశ్విన్ కారు రేసుల్లో పాల్గొనడానికి ముందు బైక్ రేసులపై ఆసక్తి చూపేవాడు. రేసుల్లో ఆశ్విన్ వినియోగించే బైక్‌ను నేనే చేసి ఇచ్చాను. అశ్విన్‌కు మద్యం సేవించే అలవాటు లేదు.
ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకుంటారని చెప్పాడు. అశ్విన్ స్నేహితుడు కిరణ్ మాట్లాడుతూ, తెల్లవారుజామున పోలీసులు ఫోన్ చేసి ఒక కారు మంటల్లో తగులబడిపోతోంది, వారు మీకు తెలిసినవారు అనుకుంటా వెంటనే రండి అని చెప్పారు. దీంతో ఆఘమేఘాలపై అక్కడికి చేరుకోగా కారు నిలువునా కాలిపోతోంది. కారులో ఉన్న వారిని గుర్తించలేక పోయాను. ఇంతలో పోలీసులు ఒక సిమ్‌కార్డును ఇచ్చి కారు వద్ద దొరికిందని చెప్పారు.
ఆ సిమ్‌కార్డును నా ఫోన్‌లో వేసి చూడగా అశ్విన్ భార్య నివేదితదని తెలిసింది. కారు, బైక్ రేసుల్లో 36 చాంపియన్‌గా నిలిచిన అశ్విన్ అగ్నికి ఆహుతైపోయాడనే వాస్తవాన్ని జీర్ణించుకోలేక పోతున్నానని కన్నీళ్లుపెట్టుకున్నాడు.అశ్విన్ పినతండ్రి గణేష్ మాట్లాడుతూ, అశ్విన్, నివేదిక ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో పెళ్లిచేసుకున్నాడని తెలిపారు. వచ్చే వారం హనీమూన్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకోగా ఇంతలో ఘోరం జరిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు.