![మళ్లీ రెండు నెలల తరువాత కలుస్తా.. - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/5/61496993182_625x300.jpg.webp?itok=83LYemrq)
మళ్లీ రెండు నెలల తరువాత కలుస్తా..
తమిళసినిమా: రెండు నెలల తరువాత మరోసారి అభిమానులతో మమేకం అవుతానని సూపర్‌స్టార్ రజనీకాంత్ వెల్లడించారు. గత నెలలో ఆయన వరుసగా ఐదు రోజుల పాటు అభిమానులను కలిసి వారితో విడివిడిగా ఫొటోలు దిగిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా సమయం వచ్చినప్పుడు పోరుకి సిద్ధంగా ఉండండి అని అభిమానులనుద్దేశించి రజనీ చేసిన వ్యాఖ్యలు తమిళ రాజకీయాలను కుదిపేశాయనే చెప్పాలి. ఇప్పటికీ రజనీ రాజకీయరంగప్రవేశం గురించి చర్చ జరుగుతూనే ఉంది.కాగా గత నెల 28వ తేదీన కాలా చిత్రం కోసం ముంబై వెళ్లిన రజనీకాంత్ తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని గురువారం ఉదయం చెన్నైకు తిరిగి వచ్చారు.
ఈ సందర్భంగా ఆయన చెన్నై విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ ముంబైలో 11 రోజుల పాటు జరిగిన కాలా చిత్రం షూటింగ్ తనకు చాలా సంతృప్తి నిచ్చిందన్నారు. రెండవ షెడ్యూల్‌ను ఈ నెల 24 నుంచి చెన్నైలో చిత్రీకరించనున్నట్లు చెప్పారు. కాగా మరో రెండు నెలల్లో తన అభిమానుల్ని మరోసారి కలవనున్నట్లు ఈ సందర్భంగా రజనీకాంత్ తెలిపారు. దీంతో రజనీకాంత్ మరోసారి రాజకీయచర్చకు తావిచ్చారని చెప్పవచ్చు.