సూపర్ స్టార్ రజనీకాంత్ అస్వస్థత కారణంగా గత సోమవారం రాత్రి చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయన గుండెలోని రక్తనాళానికి వాపు రావడంతో వైద్యులు శస్త్ర చికిత్స లేకుండా స్టెంట్ అమర్చారు. శుక్రవారం ఉదయం డిశ్చార్జ్ అయ్యారు రజనీ. వైద్యులు ఆయనకు 15 రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కాగా రజనీ అనారోగ్యానికి గురైన విషయం తెలిసి ప్రధాని నరేంద్ర మోదీ, తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌తో సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఇక అభిమానులైతే గుళ్లు, గోపురాలు, చర్చిలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రజనీకాంత్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో ‘‘నేను ఆస్పత్రిలో ఉన్నప్పుడు త్వరగా కోలుకోవాలని శుభాకాంక్షలు తెలిపిన రాజకీయ నాయక మిత్రులకు, సినీ రంగానికి చెందిన స్నేహితులకు, నా క్షేమం కోరిన మీడియా మిత్రులకు, నన్ను బతికిస్తున్న ఫ్యాన్స్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని రజనీకాంత్ పేర్కొన్నారు. – సాక్షి ప్రతినిధి, చెన్నై
ఆస్పత్రి నుంచి గోవిందా డిశ్చార్జ్
బాలీవుడ్ నటుడు గోవిందా ఈ నెల 1న తన వ్యక్తిగత తుపాకీ పొరపాటున పేలడంతో కాలికి గాయాలై ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. శుక్రవారం వైద్యులు ఆయన్ను డిశ్చార్జ్ చేసి, కొన్ని రోజులపాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారు. వీల్‌ఛైర్‌లో ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన గోవిందాను పలువురు అభిమానులు పరామర్శించారు. ‘‘ప్రస్తుతం క్షేమంగా ఉన్నాను. నేను త్వరగా కోలుకోవాలనిప్రార్థించినవారికి కృతజ్ఞతలు’’ అని గోవిందా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment