
శుభవార్త..
ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి మంత్రి హామీ
పది రోజుల్లో నోటిఫికేషన్ విడుదల
సీఈటీ ద్వారా నియామకాలు
దళారుల ప్రమేయం వద్దు
బెంగళూరు :ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి పది రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు రాష్ర్ట ప్రాథమిక విద్యాశాఖ మంత్రి కిమ్మెన రత్నాకర్ తెలిపారు. రాష్ర్ట వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 11,200 ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ఉండేలా ఈ సారి ఉమ్మడి ప్రవేశ పరీక్ష(సీఈటీ) నిర్వహించనున్నట్లు చెప్పారు. పాఠ్య పుస్తకాల మార్పు విషయమై బెంగళూరులో గురువారం జరిగిన సమీక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు టెట్ పరీక్షలో ఉత్తీర్ణులైన 23 వేల మంది అర్హులేనని అన్నారు. ఉద్యోగాల కోసం దళారులను ఆశ్రయించరాదని అభ్యర్థులకు సూచించారు. విద్యా హక్కు చట్టాన్ని (ఆర్టీఈ)
అనుసరించి ప్రవేశాలు ఈ ఏడాది నుంచే మొదటిసారిగా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అందువల్ల సాంకేతిక ఇబ్బందులు తలెత్తిన మాట వాస్తవమన్నారు. ఒకటి రెండు రోజుల్లో ఇందుకు పరిష్కారం కనుగొంటామన్నారు. బెంగళూరుతో సహా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో గుర్తింపు లేని పాఠశాలలు ఉన్నాయన్నారు. ఈ పాఠశాల వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నామని తెలిపారు. కాలానుగుణంగా విద్యా విధానంలో మార్పులు తీసుకురావాల్సి ఉంటుందన్నారు. అందులో భాగంగానే పాఠ్యపుస్తకాల్లో మార్పులు తీసుకువస్తున్నామన్నారు. అయితే మతానికి ఈ విషయాన్ని ముడిపెట్టి కొంతమంది అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి అసహనం వ్యక్తం చేశారు.