సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధానిగా పేరుగాంచిన ముంబైలో ప్రతీరోజు సగటున ఐదు ద్విచక్రవాహనాలు (బైక్‌లు)చోరీకి గురవుతున్నాయి. గతంతో పోలిస్తే ఈ రెండేళ్ల కాలంలో బైక్ చోరీ సంఘటనలు విపరీతంగా పెరిగిపోయాయి. తూర్పు, పశ్చిమ ఉపనగరాల్లోనే బైక్‌లు అధికంగా చోరీ అవుతున్నట్లు పోలీసు గణాంకాలు తెలుపుతున్నాయి. జుహూ, ఖార్, శాంతాక్రుజ్, బోరివలి, పొవాయి తదితర ధనవంతులుండే ప్రాంతాల్లో ఒక్కొక్క కుటుంబంలో కనీసం రెండు లేదా మూడుకుపైనే బైక్‌లుంటాయి. వారుంటున్న సొసైటీ ఆవరణలో తగినంత స్థలం లేకపోవడంతో అత్యధిక శాతం వాహనాలు రోడ్లపైనే పార్కింగ్ చేయాల్సి వస్తోంది.
దీన్ని అలుసుగా తీసుకున్న చిల్లర దొంగలు రాత్రి వేళల్లో వాటిని తస్కరిస్తున్నారు. బైక్‌లతోపాటు అప్పుడప్పుడు కార్లు కూడా చోరీ అవుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ఇక్కడ చోరీ చేసిన వాహనాలను ఇతర రాష్ట్రాలకు తరలించి అక్కడ విక్రయిస్తున్నారు. వాహనాలు ముఖ్యంగా అర్థరాత్రి 2-5 గంటల మధ్య చోరీకి గురైతున్నాయి. 2013లో ముంబై నుంచి 3,807, 2014లో 3,494 ద్విచక్ర వాహనాలు చోరీకి గురైనట్లు ఆయా పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇలా ఏడు సంవత్సరాల కాలంలో 19,351 బైక్‌లు, 9,575 ఫోర్ వీలర్స్, 3,757 ఇతర వాహనాలు చోరీ అయినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇలా చోరీకి గురైన వాటిలో 2013లో 1,203, 2014లో 1,825 వాహనాలను పోలీసులు కనుగొన గలిగారు.
చోరీ ఇలా జరుగుతుంది
వాహన దొంగలు ఏదైనా వాహనాన్ని తస్కరించాలనుకుంటే దానిపై రెండు, మూడు రోజులు కన్నేసి ఉంచుతారు. అర్థరాత్రి 2-5 గంటల మధ్య పోలీసుల గస్తీ అంతగా ఉండదు. దీన్ని అదనుగా చేసుకుని దొంగలు అక్కడే నకిలీ తాళాలు తయారుచేసి కారు డోరు తెరుస్తారు. ఈ పనంతా కేవలం 5 నుంచి 10 నిమిషాల్లోనే జరిగిపోతుంది. తరువాత అదే ఆర్టీఓ నంబరుపై వాహనాన్ని ముంబై దాటిస్తారు. నిర్ధేశించిన స్థలానికి చేరవేసి అక్కడ భద్రపరుస్తారు. అందుకు కారు ఖరీదును బట్టి వీరికి రూ.50 వేల నుంచి రూ.లక్షా వరకు దళారులు ముట్టజెపుతారు. ఆ తరువాత నకిలీ పత్రాలు సృష్టించి వాటిని ఇతర రాష్ట్రాలకు తరలించి విక్రయిస్తారు.
రోజూ ఐదు బైక్‌ల చోరీ
Published Thu, Feb 12 2015 10:49 PM | Last Updated on Sat, Sep 2 2017 9:12 PM
Advertisement