బ్లేడుతో ఒళ్లంతా కోసుకుని..
Published Wed, Feb 22 2017 3:12 PM | Last Updated on Tue, Sep 5 2017 4:21 AM
ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలు టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఉన‍్న రిమాండ్ ఖైదీ బ్లేడుతో ఒళ్లంతా గాయపరుచుకుని బీభత‍్సం సృష‍్టించాడు. ఈ సంఘటనతో నివ్వెరపోయిన పోలీసులు అతనిని రహస‍్యస్థావరంలో ఉంచారు. దాదాపు 150 కేసుల‍్లో నిందితుడుగా ఉన‍్న తమిళనాడుకు చెందిన నవాజ్‌షరీఫ్‌ను చెన‍్నై పోలీసులు మంగళారం ఉదయం తీసుకువచ్చి ఇక‍్కడి కేసుల విచారణ నిమిత‍్తం ఒంగోలు జైలు అధికారులకు అప‍్పగించారు. అయితే విచారణ నిమిత‍్తం పీటీ వారెంట్‌పై టూటౌన్ పోలీసులు నవాజ్‌షరీఫ్‌ను మంగళవారం సాయంత్రం స్టేషన్‌కు తీసుకువచ్చారు. అక‍్కడ మంగళవారం రాత్రి కడుపులో దాచుకున‍్న బ్లేడును బయటికి తీసి శరీరమంతా విచక్షణారహితంగా కోసుకున్నాడు.
తీవ్ర రక‍్తస్రావంతో సోమ‍్మసిల్లి పడిఉన‍్న నవాజ్‌షరీఫ్‌ను గమనించిన పోలీసులు కంగారుపడి ప్రభుత‍్వ ఆస‍్పత్రికి తీసుకెళ్ళి ప్రాథమిక చికిత‍్స చేయించి రహస‍్యస్థావరంలో ఉంచారు. కడుపులో దాచుకున‍్న బ‍్లేడును నీళ‍్లు తాగి వెలుపలికి తెచ‍్చే చాకచక‍్యం నవాజ్‌షరీఫ్‌కు తెలుసునని, దాని ద్వారానే ఈ అరాచకానికి పాల‍్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు. ఒళ‍్లంతా బ్లేడు గాట్లు ఉండడంతో జైలు అధికారులు అతనిని జైలులో ఉంచుకునేందుకు తిరస‍్కరించారు. దీంతో దిక్కుతోచని పోలీసులు గాయాలు మానేంతవరకూ రహస‍్యస్థావరంలో ఉంచారని చెబుతున్నారు. ఈ విషయం బుధవారం ఉదయం పట‍్టణంలో సంచలనం సృష‍్టించింది.
Advertisement
Advertisement