ఆక్రమణల తొలగింపు... మిన్నంటిన ఆక్రందనలు
- ఇళ్లను కూల్చరాదని అడ్డుకున్న మహిళలు
- బలవంతంగా ఇళ్ల నుంచి బయటకు పంపిన పోలీసులు
- రెండు రోజులు సమయం ఇవ్వాలని వేడుకున్న బాధితులు
- హైకోర్టు స్టేతో ఆక్రమణల తొలగింపునకు తాత్కాలిక బ్రేక్
కోలారు : పేదల ప్రతిఘటన మధ్య నగర సమీపంలోని కోలారమ్మ చెరువులో బుధవారం ఆక్రమణల తొలగింపు ప్రారంభమైంది. అయితే బాధితులు హైకోర్టును ఆశ్రయించడంతో తొలగింపునకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఆర్డీవో మంజునాథ్ నేతృత్వంలో బుధవారం ఉదయం ఏడుగంటలకే అధికారులు జేసీబీలతో కోర్టు సర్కిల్ సమీపం నుంచి ఆక్రమణల తొలగింపు ప్రారంభించారు. అయితే కొంతమంది తమ ఇళ్లనుంచి హడావుడిగా ఇళ్లనుంచి సామగ్రిని బయటకు తీసుకురాగా మరికొందరు ఇళ్లను కూల్చవద్దని బీష్మించుకూర్చున్నారు.
అయితే పోలీసులు ఇళ్ల యజమానులను బలవంతంగా బయటకు పంపి సామాగ్రిని బయటకు తరలించారు. కొందరు మహిళలు బయటకు రాకుండా తాళం వేసుకొని ఇంట్లోనే బైఠాయించారు. తమను ఇంట్లోనే ఉంచి నివాసాన్ని కూల్చాలని, తాము ఇంటి సమేతంగా సమాధి అవుతామని తలుపులు వేసుకున్నారు సీఐ శివకుమార్ సిబ్బంది సహాయంతో బలవంతంగా తలుపులు తెరచి ఇంటిలో ఉన్న మహిళలను మహిళా పోలీసు సిబ్బంది సహాయంతో బయటకు పంపారు. ఈ నేపథ్యంలో ఓ వృద్ధురాలు సొమ్మసిల్లి కిందపడిపోయింది.
రెండు రోజులు గడువియ్యండి
ఇళ్లను కూల్చివేయడానికి అధికారులు రాగా మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. సామగ్రిని తరలించడానికి రెండు రోజుల గడువు ఇవ్వాలని వేడుకున్నారు. ఆర్డీవో చేతులు పట్టుకుని మరీ వేడుకున్నారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నందువల్ల తామేమి చేయలేదని ఆయన నిస్సహాతను వ్యక్త పరిచారు. మరో ఇంటి యజమాని అయితే ఏకంగా జేసీబీకి అడ్డు తగిలి తన ఇంటిని కూల్చవద్దని వేడుకున్నారు. పోలీసులు అతనిని బలవంతంగా పక్కకు లాగేశారు.
హైకోర్టు స్టే
ఓ వైపు ఆక్రమణల తొలగింపు కొనసాగుతుండగా మరో వైపు కొందరు బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. వారి విన్నపాన్ని పరిశీలించిన కోర్టు స్టే మంజూరు చేయడంతో ఆక్రమణల తొలగింపును నిలిపివేశారు. భాధితులు అక్కడి నుంచి తరలి వెళ్లడానికి వారం రోజులు గడువు ఇవ్వాలని హైకోర్టు సూచించినట్లు సమాచారం