
వైభవంగా తెలుగువారి గణతంత్ర వేడుకలు
సాక్షి, ముంబై : నగరంలోని పలు తెలుగు సంఘాలు 66వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా పలు సంఘాలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాయి.
ది బొంబాయి ఆంధ్రమహాసభ ఆధ్వర్యంలో...
దాదర్‌లోని ఆంధ్రమహాసభ ఆవరణలో ఉదయం సంపూర్ణానందగిరి స్వామి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ చేసిన సేవలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి యాపురం వెంకటేశ్వర్, అనుమల్ల రమేష్, గట్టు నర్సయ్య, నడిమెట్ల యెల్లప్ప, యెలిగేటి రాజ్‌కుమార్, రేపల్లి పరమేశ్వర్, మహిళా శాఖ అధ్యక్షురాలు తురగా జయ శ్యామల, ప్రధాన కార్యదర్శి యత్తం లత తదితరులు పాల్గొన్నారు.
తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో...
వాషిలోని తెలుగు కళాసమితి ఆధ్వర్యంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో సమితి ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం జాతీయ జెండాను ఆవిష్కరించారు. తర్వాత నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డాక్టర్ కె.టి.వి.రెడ్డి, కమిటీ సభ్యుడు భాస్కర్ రెడ్డి, కే.ఎస్.మూర్తి, మహిళా శాఖ ఉపాధ్యక్షులు వరలక్ష్మి, వహీద, గంటి లలిత, తిరుపతి రెడ్డి, జిండే తదితరులు పాల్గొన్నారు.
మున్నూరు కాపు సేవా సంఘం...
వర్లీలోని తెలుగు మున్నూరు కాపు సేవా సంఘం ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు శెకెల్లి రాములు పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి సంగెవేని రవీంద్ర, ఉపాధ్యక్షులు బండారు రాజేశం, సిరినేని సత్తయ్య, తమ్మల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
పద్మశాలి సమాజ సుధారక మండలి...
వర్లీలోని పద్మశాలి సమాజ సుధారక మండలిలో అధ్యక్షులు వాసాల శ్రీహరి జెండావిష్కరణ చేశారు. తర్వాత దేశ భక్తి గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కస్తూరి హరిప్రదాస్, ట్రస్ట్ చెర్మైన్ రమేష్ మంతెన, డాక్టర్ వీరబత్తిని చంద్ర శేఖర్, సహదేవ్ భోగ, గాజెంగి రమేష్, ఉపాధ్యక్షులు వేముల మనోహర్, తదితరుల పాల్గొన్నారు.
వివేక గ్రంథాలయంలో..
ఖేడ్‌గల్లీలోని వివేక గ్రంథాలయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక సామాజిక కార్యకర్త బాలచంద్ర ఇందాల్కర్ పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు తలకొక్కుల గంగాధర్‌తోపాటు ఉపాధ్యక్షులు ద్యావరిశెట్టి గంగాధర్, సిరిపురం రాజేశం, యెలిగేటి నరహరి తదితరులు పాల్గొన్నారు.
పటేల్ మెన్షన్ చాల్ కమిటీ...
ఖేడ్‌గల్లీలోని పటేల్ మెన్షన్ చాల్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో సత్యనారాయణ స్వామి మహాపూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మహిళలకు పసుపు-కుంకుమ అందచేశారు. ఈ వేడుకల్లో శివసేనా ఎమ్మెల్యే సదా సావర్కర్‌తోపాటు మాజీ ఎమ్మెల్యే నితిన్ సర్దేశాయ్ పాల్గొన్నారు. అధ్యక్షుడు సురేష్ యాదవ్, ఉపాధ్యక్షుడు రాణాసింగ్, ప్రధాన కార్యదర్శి నాగభూషణ్, కోశాధికారి రజిని కాంత్ తదితరులు హాజరయ్యారు.
ఆంధ్ర ప్రజా సంఘం ఆధ్వర్యంలో...
గోరేగావ్‌లోని హనుమాన్ నగర్, ఆంధ్ర ప్రజా సంఘం ఆవరణలో సీనియర్ సభ్యుడు ఉండ్రు నరసింహారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సంఘం ప్రధాన కార్యదర్శి వి.జె.రావు, ఎం.నారధ, డి.వెంకటేశ్వరరావు, జే.ఎస్.మూర్తి, విష్ణు సాయిబాబా, వి.రామారావు తదితరులు ప్రసంగించారు.
తెలంగాణ ప్రజా సంఘం...
పశ్చిమ గోరేగావ్‌లోని తెలంగాణ ప్రజాసంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యక్షుడు శేఖర్ వంటపాక జెండావిష్కరణ చేశారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గాదె మల్లేషం, కొండ బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
వడాలా తెలుగు సంఘం మహిళా మండలి...
వడాలా తెలుగు సంఘం మహిళా మండలి ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో చంద్రగిరి రామ చెంద్రయ్య, కల్కూరి మాధయ్య, గంగుల రామయ్య, కల్కూరి రాములు తదితరులు పాల్గొన్నారు.
ఓం పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో...
ఖరాస్ బిల్డింగ్‌లోని ఓం పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో సంఘ అధ్యక్షుడు పోతు రాజారాం మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు అంబల్ల గోవర్దన్, ప్రధాన కార్యదర్శి వేముల శివాజి, చౌటి నారాయణ, చాట్ల శ్రీనివాస్, యెల్ది సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
ఓం పద్మశాలి విజయ సంఘం...
ఖరాస్ బిల్డింగ్‌లోని ‘ఓం పద్మశాలి విజయ సంఘం- కమ్మర్‌పల్లి’ ఆధ్వర్యంలో రోజంతా గణతంత్ర వేడుకలు నిర్వహించారు. ముందుగా ఉదయం సంఘం అధ్యక్షుడు గుడ్ల నడ్పి లింబాద్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సాయంత్రం శ్రీసత్యానారాయణ వ్రతం, రాత్రి జరిగిన పసుపు-కుంకుమ కార్యక్రమంలో మహిళలకు కానుకలు అందజేశారు. అనంతరం 250 మందికిపైగా అన్నదానం చేసినట్లు లింబాద్రి చెప్పారు.
మోర్తాడ్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో...
ఎన్.ఎం.జోషి మార్గ్‌లోని మోర్తాడ్ పద్మశాలి సంఘంలో అధ్యక్షులు కామని హన్మాండ్లు పతాకావిష్కరణ చేశారు. తర్వాత నిర్వహించిన పసుపు-కుంకుమ కార్యక్రమంలో దాదాపు 150 మంది మహిళలు పాల్గొన్నారు.
తెలుగు మాల సేవా సంఘం ఆధ్వర్యంలో...
కింగ్‌సర్కిల్‌లో తెలుగు మాల సేవా సంఘం ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు కోమర సాయన్న జెండావిష్కరణ చేశారు. దాస్, కైలాస్, వెలుగు గంగాధర్, మేకల శశింకరిత, డాక్టర్ రాము, మాదరి కుపల్, ఈరిగల సాయన్న, సూలం బాబురావు తదితరులు పాల్గొన్నారు.
రజక ఫౌండేషన్...
బోరివలి న్యూస్‌లైన్: బోరివలి పశ్చిమంలోని నూతన్‌నగర్‌లో రజక ఫౌండేషన్ ఆధ్వర్యంలో జెండావిష్కరణ జరిగింది. విద్యార్థులకు జి. నర్సయ్య నోటు పుస్తకాలు, పెన్నులు అందజేశారు. ఎలిజాల శ్రీనివాస్, మల్లేష్ చిల్కరాజు, సురేష్ కల్లూరి, మామిడాల భూపతి, చింతల తాడెపు మహేంద్ర, రాజు ఒడియానం తదితరులు పాల్గొన్నారు.
తెలుగు చైతన్య పాఠశాలలో..
బోరివలిలోని తెలుగు చైతన్య పాఠశాలలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల చైర్మన్ చాట్ల గంగాధర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. తర్వాత ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
షోలాపూర్‌లో...
షోలాపూర్, న్యూస్‌లైన్: జిల్లా ఇన్‌చార్జి మంత్రి విజయ్ దేశ్‌ముఖ్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి హోంగార్డ్స్, పోలీసులు, ఎస్.ఆర్.పి జవాన్‌ల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో ప్రావీణ్యత సాధించిన వారిని సన్మానించారు.
భివండీలో....
భివండీ, న్యూస్‌లైన్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా భివండీ నిజాంపూర్ షహర్ మహానగర్ పాలిక ముఖ్య కార్యాలయంలో మేయర్ తుషార్ చౌదరి త్రివర్ణ పథకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ పరిధిలోని ఐదు ప్రభాగ్ సమితులకు క్రిమికీటకాలను సంహరించే పిచికారీలు బిగించిన మిరీ ట్రాక్టర్లను మేయర్ తుషార్ చౌదరి, స్టాండింగ్ కమిటీ చైర్మన్ ప్రశాంత్ లాడ్ ప్రారంభించారు. కార్యక్రమంలో కమిషనర్ జీవన్ సోనావునే, నగర్ సేవకులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
తెలుగు సమాజ్ శిక్షణ సంస్థ ఆధ్వర్యంలోని వివిధ పాఠశాలలు గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నాయి. పద్మశాలి తెలుగు హైస్కూల్‌లో కన్నేరీ సంస్థ ట్రస్టీ దాసి అంబాదాస్, పద్మశాలి ఇంగ్లిష్ మీడియం స్కూల్ అండ్ జూనియర్ కళాశాలలో సంస్థ చైర్మన్ డాక్టర్ పాము మనోహర్, మార్కండేయ ప్రైమరీ స్కూల్ గాయిత్రినగర్‌లో నగర్‌సేవిక పూనం పాటిల్, వికాస్ ప్రైమరీ స్కూల్ పద్మనగర్‌లో కార్పొరేటర్ సంతోష్ ఎం. శెట్టి, పద్మశాలి ప్రైమరీ స్కూల్ పేనాగావ్‌లో సంస్థ ఉపాధ్యక్షుడు కుందెన్ పురుషోత్తం జాతీయ పతాకాలను ఆవిష్కరించారు.
శారద ఎడ్యుకేషన్ సొసైటికి చెందిన వివేకానంద ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో కాందేశ్ సేవా ప్రముఖ్ సుహాస్ బోందే, పద్మశాలి సమాజ్ యువక్ మండలి కార్యాలయంలో అఖిల పద్మశాలి సమాజ్ అధ్యక్షుడు కముటం శంకర్, బాలాజీ సేవా సొసైటీ కార్యాలయంలో కార్పొరేటర్ సంతోష్ ఎం. శెట్టి త్రివర్ణ జెండాను ఎగురవేశారు.
పలుచోట్ల రక్తదాన శిబిరాలు
భివండీ, న్యూస్‌లైన్: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలో పలు చోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహించారు. తెలుగు ప్రజలు స్థిరపడ్డ పద్మనగర్ పరిధిలోని గల బాలాజీ జోపడ్‌పట్టి ప్రాంతంలో బాలాజీ మిత్ర మండల్ ఆధ్వర్యంలో సోమవారం రక్తదాని శిబిరం నిర్వహించారు. భివండీ బ్లడ్‌బ్యాంక్ వారు దాతలు ఇచ్చిన 142 మంది నుంచి రక్తం సేకరించారు. మండలి తరపున దాతలకు మొక్కలను, గుర్తింపు కార్డులను అందజేశారు. రక్తం కావలసిన రోగులు మండలిని సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలిపారు.
రామ మందిరం ప్రాంగణంలో యువ గిటార్ గైస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్త దానం చేసిన ధాతలకు తులసి మొక్కలను అందచేశారు. ఈ శిబిరంలో 184 రక్తపు బాటిళ్లను సేకరించారని మండలి అధ్యక్షుడు కారంపురి వినోద్ తెలిపారు.
పదవ తరగతి 2009-10 బ్యాచ్ తెలుగు విద్యార్థులు పద్మనగర్ ప్రాంతంలో దుకాణాల యజమానులకు మొక్కలను పంపిణీచేసి వాటిని సంరక్షించాలని కోరారు.
సంఖ్య మరచిపోయిన అధికారులపై చర్యకు డిమాండ్
సాక్షి, ముంబై: గణతంత్ర దినోత్సవ వేడుకల సంఖ్యను తప్పుగా రాసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రదేశ్ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా సోమవారం 66వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. కాని ముంబైలోని శివాజీపార్క్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో అక్కడ పూలతో అలంకరించిన బ్యానర్‌పై 65వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అని పెద్ద పెద్ద అక్షరాలతో రాశారు.
దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రతిపక్ష నాయకులు గణతంత్ర దినోత్సవ వేడుకల సంఖ్య మర్చిపోవడం దురదృష్టకరమని, ప్రభుత్వానికి ఆ మాత్రం కూడా తెలియదా అంటూ విమర్శలు సంధించారు. నిలదీశారు. మరో విశేషమేమిటంటే గవర్నర్ విద్యాసాగర్‌రావు కూడా తన ప్రసంగంలో 65వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అని ఉచ్ఛరించారు. కాగా బ్యానర్‌పై సంఖ్యను తప్పుగా రాసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని మాణిక్‌రావ్ డిమాండ్ చేశారు.