మెరైన్ డ్రైవ్‌లో మువ్వన్నెల రెపరెపలు
సాక్షి, ముంబై:
మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో ఆదివారం జరిగిన గణతంత్ర దిన వేడుకలు అంగరంగ ైవె భవంగా జరిగాయి. గతంలో శివాజీ పార్కులో నిర్వహించిన ఈ వేడుకలు తొలిసారిగా మెరైన్ డ్రైవ్‌లో జరిగాయి. త్రివిధ దళాలు సంయుక్తంగా విన్యాసాలు ప్రదర్శించడం ముంబైకర్లను ఆకట్టుకుంది. ఉత్సవాల్లో భాగంగా తొలుత గవర్నర్ కె.శంకర్ నారాయణన్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సమయంలో హెలికాప్టర్ ద్వారా వాయుసేన సిబ్బంది పూలవర్షం కురిపించింది. ఆ తర్వాత త్రివిద దళాల కవాతు ప్రారంభమైంది. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్, ముంబై ఫోర్ట్ ట్రస్టు సంస్ధకు చెందిన ప్రముఖ వ్యక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ ప్రదర్శనలతో కూడిన 25 శకటాలు ప్రభుత్వ శాఖలు ప్రదర్శించాయి. ఈ ఉత్సవాల్లో వింటేజ్ కారు ర్యాలీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
మెరైన్‌డ్రైవ్‌లోని రోడ్డుకు ఇరువైపుల కూర్చున్న ముంబైకర్లు ఈ ఉత్సవాలను ఆస్వాదించారు.
రాష్ట్రానికి చెందిన శకటం, మిలీటరికి చెందిన సాయుధ వాహనాలు, నేవీ శాఖ 50 మందితో కూడిన బ్యాండ్ బృందం, మోటార్ సైకిళ్ల ర్యాలీ, వివిధ విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇందులో 150 మందికిపైగా డ్రమ్స్ (ఢోల్) వాయించేవారు. 100కుపైగా లేజిం, 40 మందికిపైగా ఇతర వాయిద్యాలు వాయించేవారు పాల్గొన్నారు. కాగా గణతంత్ర వేడుకలు పురస్కరించుకుని మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో భారీ బందోబస్తు నిర్వహించారు. ఉత్సవాలు ప్రశాంత జరిగేందుకు నగర పోలీసులతోపాటు ఎస్‌ఆర్పీ, క్విక్ రెస్పాన్స్ టీం, బాంబు గుర్తింపు, నిర్వీర్యం బృందం, కోస్టు గార్డులు తదితర బలగాలు సహకరించాయి. ఉత్సవాలు ప్రారంభానికి 10 రోజుల ముందే ఈ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. స్థానిక బహుళ అంతస్తుల భవనాలపై నుంచి నిఘాను పర్యవేక్షించారు. ఉత్సవాలు జరుగుతున్న సమయంలో ఈ ప్రాంతాన్ని నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించారు. ఆదివారం ఉదయంనుంచి సాయం త్రం వరకు ఈ ప్రాంతం మీదుగా హెలికాప్టర్లు, విమానాలు, పారాగ్లాయిడ్స్ ఎగరలేకపోయాయి.